గుడి ముందు బెగ్గర్,​ 20ఏళ్ల తర్వాత డాక్టర్- ఈమె జర్నీ ట్రూలీ ఇన్స్​పిరేషనల్! - Beggar Become Doctor

🎬 Watch Now: Feature Video

thumbnail

Beggar Become Doctor In Himachal Pradesh : మురికివాడలో పుట్టి తల్లిదండ్రులతో కలిసి బాల్యం నుంచే భిక్షాటన చేసిన పింకీ హర్యన్, ఇపుడు ఎంబీబీఎస్‌ పట్టా అందుకొన్న వైద్యురాలు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఈ యువతి విజయగాథ వెనుక ఉన్నది ఓ టిబెటన్ బౌద్ధ గురువు, ధర్మశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థ. 2004లో మెక్​లియోడ్​ గంజ్​ వీధుల్లో బిచ్చం కోసం తిరుగుతున్న నాలుగున్నరేళ్ల పింకీ టిబెటన్‌ శరణార్థ సన్యాసి లాబ్‌సంగ్‌ జమ్యాంగ్‌ కంటపడింది. దీంతో ఆయన మనసు చలించింది. అనంతరం మురికివాడకు వెళ్లి పింకీ తల్లిదండ్రులను ఒప్పించారు. ఆ చిన్నారిని ధర్మశాలలోని దయానంద్‌ పబ్లిక్‌ స్కూలులో ఆయన చేర్చారు. హాస్టల్​లో ఉండి చదువుకొన్న పింకీ మొదటినుంచీ విద్యాభ్యాసంలో చాలా చురుగ్గా ఉండేదని ఉమంగ్‌ ఫౌండేషన్‌ (ఎన్జీవో) అధ్యక్షుడు అజయ్‌ శ్రీవాస్తవ చెప్పారు. 

అలా సీనియర్‌ సెంకడరీ పరీక్ష తర్వాత నీట్‌ లోనూ పింకీ హర్యన్ ఉత్తీర్ణురాలైంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలో పింకీకి సీటు రాలేదు. బ్రిటన్‌కు చెందిన టాంగ్‌ - లెన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు సాయంతో చైనాలోని ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలలో సీటు దక్కించుకొంది. ఎంబీబీఎస్‌ పట్టాతో ఇటీవలే ధర్మశాలకు తిరిగివచ్చిన ఆమె, బాల్యంలో పేదరికం నాకో సవాలుగా నిలిచిందని చెప్పింది. మురికివాడల నేపథ్యమే నాకు పెద్ద స్ఫూర్తి అని, వైద్యురాలిగా పేదలకు సేవ చేస్తానని అంటోంది పింకీ హర్యన్. భారత్‌లో ప్రాక్టీసుకు అర్హత కోసం పింకీ ఇపుడు మరో పరీక్షకు సిద్ధమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.