పాడేరులో ఎగిరే పాము ప్రత్యక్షం - మీరెప్పుడైనా చూశారా?
🎬 Watch Now: Feature Video
Flying Snake in Paderu : ప్రపంచంలో వేలాది రకాల పాముల జాతులున్నాయి. వాటిలో కొన్ని విషపూరితం కాగా, చాలా వరకు విషం లేనివి ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ అరుదైన పాము అందరి దృష్టిని ఆకర్షించింది. పాడేరులోని ఓ ఇంట్లో వంట గదిలో ఎగిరే జాతికి చెందిన ఆర్నెట్స్ ఫ్లయింగ్ స్నేక్ కనిపించింది. వెంటనే వారు అప్రమత్తమై స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్, దానిని పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ పాము అరుదైన జాతికి చెందినదని స్నేక్ క్యాచర్ తెలిపారు. ఇది ఎక్కువగా అడవుల్లో, ఎత్తైన ప్రాంతాల్లో సంచరిస్తుంటుందని చెప్పారు. రంగురంగులుగా ఉండి చిన్న చిన్న కీటకాలు తింటూ జీవిస్తుందని పేర్కొన్నారు. ఒక చెట్టు పైనుంచి మరో చెట్టు పైకి ఎగురుతుందని పేర్కొన్నారు. ఇది ఒకవేళ కరిచినా విష ప్రభావం అంతగా ఉండదన్నారు. ఆహార వేట కోసం, ఇంకా భూమ్మీదుండే శత్రుజీవుల నుంచి తప్పించుకోవడానికే ఇలా ఇది ఎగురుతుందని భాస్కర్ వెల్లడించారు.