వంట సామాగ్రితో వినాయకుడి విగ్రహం - డాక్టర్ మెసేజ్ అదుర్స్ - Doctor Make Ganpati With Utensils
Published : Sep 17, 2024, 4:28 PM IST
Doctor Made Ganpati With Utensils in Hyderabad : వినాయక నిమజ్జనోత్సవాల్లో మలక్‌పేటలోని ఓ వైద్యుడు వినూత్నంగా తయారు చేసిన లంబోదరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ విశ్రాంత వైద్యుడు డాక్టర్ అమరావతి ప్రభాకర చారి వంట పాత్రలతో విఘ్నేశ్వరుడిని తయారు చేశారు. వంట సామాగ్రిలోని గ్లాసులు, గిన్నెలు, తాంబాళాలు, చెంచాలతో వినూత్న రీతిలో తీర్చిదిద్దారు.
ఆ వినాయకున్ని తన వద్ద ఉన్న వింటేజ్ కారుపై కొలువుతీర్చి హుస్సేన్ సాగర్‌కు తీసుకొచ్చారు. దారి పొడవున ఆ విగ్రహం ప్రజలను ఆకట్టుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వినాయకుడితో భక్తులు సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోయారు. అయితే ఆ విగ్రహాన్ని ప్రభాకర చారి నిమజ్జనం చేయకపోవడం విశేషం. దాని బదులు మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ఆయన సాగర్‌లో నిమజ్జనం చేశారు. మట్టి విగ్రహాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రజల్లో ఆలోచన రేకెత్తించేందుకు ప్రతీ ఏటా ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ప్రభాకర చారి తెలిపారు.