ఫూటుగా తాగి సీఐ కుమారుడి నానా హంగామా - క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసి పోలీసులను తిడుతూ హల్చల్ - CI Son Halchal in Hanamkonda
Published : Aug 13, 2024, 12:19 PM IST
CI Son Halchal in Hanamkonda : మద్యంమత్తులో సీఐ కుమారుడు హల్చల్ చేశాడు. కాజీపేట చౌరస్తా వద్ద ఓ క్యాబ్ డ్రైవర్‌ను చేతికి ఉన్న కడియంతో చితకబాదాడు. అనంతరం రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న మరో మూడు కార్లపై దాడి చేయడంతో వాహనాల అద్దాలు పగిలాయి. ఈ ఘటనలో సీఐ కుమారుడితో పాటు మరో ఐదుగురు యువకులపై కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున కాజీపేట స్టేషన్ వద్ద చోటుచేసుకుంది.
రహదారి పక్కన మూత్రం విసర్జించవద్దు అన్న కారణంతో క్యాబ్ డ్రైవర్‌ను సీఐ కుమారుడుతో పాటు యువకులు విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు బాధితుడు పరుగులు తీశాడు. గాయపడిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా మద్యంమత్తులో ఉన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన పోలీసులపై సీఐ కుమారుడు నానా హంగామా చేయడంతో పాటు అసభ్య పదజాలాన్ని వాడారని పోలీసులు వివరించారు.