శ్రీసిటీ తరహాలో ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధి: మంత్రి టీజీ భరత్ - TG bharath on Industrial Lands
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 3, 2024, 10:42 PM IST
Minister TG bharath Review on Industrial Lands: రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక జోన్లలో ఉన్న సమస్యల్ని పరిష్కరించేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి టి.జి.భరత్ అధికారులను ఆదేశించారు. ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, కమిషనర్ శ్రీధర్‌తో పాటు అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ జోన్ల గురించి మంత్రి ఆరా తీశారు. భూముల విలువ, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అన్ని జిల్లాల్లో ఉన్న పాత ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పార్క్ స్థలాలు నగరాల్లో కలిసిపోయింటే వాటి ద్వారా ఆదాయం ఆర్జించేలా చర్యలు చేపట్టాలన్నారు. అదే సమయంలో ఆ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలన్నారు. సీఎం చంద్రబాబుకి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌తో పారిశ్రామికవేత్తలకు పాజిటివ్ సంకేతం ఇప్పటికే వెళ్లిందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో మంది పెట్టుబడిదారులు చర్చలు జరుపుతున్నారని, ఇండస్ట్రియల్ జోన్లలో అన్ని సమస్యలు పరిష్కరించి అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. శ్రీసిటీ తరహాలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని మంత్రి టి.జి భరత్ సూచించారు. ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధిలో కింది స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.