Xiaomi YU7 Electric SUV Unveiled: చైనీస్ కార్ల తయారీ సంస్థ షావోమీ తన ఎలక్ట్రిక్ SUV 'షావోమీ YU7'ని ఆవిష్కరించింది. గతేడాది చివర్లో గ్లోబల్ మార్కెట్లో తొలిసారిగా 'SU7 సెడాన్' ప్రవేశపెట్టిన తర్వాత కంపెనీ నుంచి వచ్చిన రెండవ ఎలక్ట్రిక్ కారు ఇది. ఇది కంపెనీ స్వదేశీ మార్కెట్ అయిన చైనాలో మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో విడుదల కానుంది. ఈ కారు CLTC సైకిల్‌లో 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. కంపెనీ నుంచి వచ్చిన ఈ మొదటి ఎలక్ట్రిక్ SUV పవర్‌ట్రెయిన్‌పై పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు మీకోసం.
షావోమీ YU7 వేరియంట్లు, బ్యాటరీ ఆప్షన్స్:

ఈ కొత్త 'షావోమీ YU7'ను కంపెనీ స్టాండర్డ్, ప్రో, మాక్స్ సహా మూడు వేరియంట్లలో పరిచయం చేస్తుంది. కంపెనీ ఎలక్ట్రిక్ 'సెడాన్ SU7' లాగానే దీని బేస్ మోడల్ రియర్-వీల్ డ్రైవ్‌తో వస్తుంది. దీని ప్రో, మాక్స్ వేరియంట్లు ఆల్-వీల్ డ్రైవ్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి. దీంతోపాటు ఈ 'షావోమీ YU7' స్టాండర్డ్‌గా 96.3 kWh బ్యాటరీని ఉపయోగిస్తుంది.

ఈ బ్యాటరీ రియర్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఇది గరిష్ఠంగా 315 bhp శక్తిని, 528 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. షావోమీ స్టాండర్డ్ YU7 835 కిలోమీటర్ల వరకు CLTC రేంజ్‌ను అందిస్తుందని, ఇది గరిష్ఠంగా 240 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ చెబుతోంది. ఈ కారు కేవలం 5.9 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని పేర్కొంది.

లోవర్ రేంజ్‌తో మిడ్ వేరియంట్ ప్రో: దీని ప్రో వేరియంట్ గురించి మాట్లాడుకుంటే ఇది డ్యూయల్-మోటార్ పవర్‌ట్రెయిన్ సెటప్‌ను కలిగి ఉంది. అయినప్పటికీ దీని స్టాండర్డ్ బ్యాటరీ ప్యాక్‌ను అలాగే ఉంచారు. ఈ వేరియంట్ ఫ్రంట్ యాక్సిల్‌పై అమర్చిన అదనపు ఎలక్ట్రిక్ మోటారు 489bhp పవర్, 690Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన కారు 4.3 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. అయినప్పటికీ దీని టాప్ స్పీడ్ 240kmphగా ఉంటుంది. కానీ కంపెనీ దీని రేంజ్ 770 కిలోమీటర్లు అని పేర్కొంది.

బిగ్ బ్యాటరీతో టాప్-స్పెక్ మాక్స్ వేరియంట్: కంపెనీ దీని టాప్-స్పెక్ వేరియంట్ మాక్స్‌లో పెద్ద 101.7 kWh బ్యాటరీని ఇన్‌స్టాల్ చేసింది. ఇది అప్‌గ్రేడ్ చేసిన డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌కు శక్తినిస్తుంది. ఈ సెటప్ 681 bhp పవర్, 866 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాక్స్ వేరియంట్ దాదాపు 3.2 సెకన్లలో 100 కి.మీ./గం. వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 253 కిలోమీటర్లు. దీనిలో పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ మాక్స్ వేరియంట్ 760 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

షావోమీ YU7 ఛార్జింగ్ స్పీడ్: ఈ ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ గురించి చెప్పాలంటే 'షావోమీ YU7'లో 800V ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. ఇది 5.2C వరకు గరిష్ఠ ఛార్జింగ్ రేటుకు మద్దతు ఇస్తుంది. అంటే పీక్ ఛార్జింగ్ రేటుతో దీని బ్యాటరీని 12 నిమిషాల కంటే తక్కువ సమయంలో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు. అయితే 15 నిమిషాల ఛార్జ్‌తో ఈ కారు 620 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.

షావోమీ YU7 ఇంటీరియర్:

ఈ కొత్త 'షావోమీ YU7' కారు 'SU7' లాగానే మినిమలిస్ట్ డిజైన్ థీమ్‌ను కలిగి ఉంది. అయితే ఇందులో గుర్తించదగిన ఒక తేడా ఉంది. షావోమీ SU7 పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్‌తో కూడిన స్లిమ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉండగా, షావోమీ YU7 విండ్‌స్క్రీన్ బేస్ వద్ద సన్నని ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో మూడు డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇకపోతే 'షావోమీ YU7' ఇతర కీలక ఫీచర్లలో పనోరమిక్ గ్లాస్ రూఫ్, ట్విన్ రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు, రెండవ వరుస కోసం టచ్‌స్క్రీన్ ఎయిర్-కన్ట్రోలర్, 135 డిగ్రీల వరకు వాలుకునే పవర్-అడ్జస్టబుల్ వెనక సీట్లు ఉన్నాయి.
షావోమీ YU7 భద్రతా ఫీచర్లు:

భద్రతా ఫీచర్ల పరంగా ఇందులో LiDAR, 4D మిల్లీమీటర్-వేవ్ రాడార్, HD కెమెరా, అల్ట్రాసోనిక్ సెన్సార్ల వెబ్ సపోర్ట్‌తో అనేక ADAS ఫంక్షన్లతో వస్తుంది. ఈ వ్యవస్థ కారు నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలను, వెహికల్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న పాదచారులను గుర్తించగలదని షావోమీ పేర్కొంది.
ఒప్పో నుంచి బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఆగయా- బిగ్ బ్యాటరీతో రూ. 12,999లకే!
మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన 'కవాసకి వెర్సిస్-X 300'- ఇందులో కొత్తగా ఏం ఉందంటే?
విద్యుత్ వాహనదారులకు ఛార్జింగ్ చింత లేదిక!- త్వరలో 72,000 కేంద్రాల ఏర్పాటు