World Quantum Day 2025: నేడు వరల్డ్ క్వాంటం డే. క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రజల అవగాహనను ప్రోత్సహించేందుకు ఏటా ఏప్రిల్ 14న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని 'మొదటి అంతర్జాతీయ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ డే'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ సందర్భంగా ఏంటీ క్వాంటమ్ డే? ఇది ఈరోజే ఎందుకు? ఇది మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? వంటి వివరాలు మీకోసం.
క్వాంటమ్ ఎందుకు?: క్వాంటం మెకానిక్స్ అనేది అణువులు, కణాల శాస్త్రం. క్వాంటం మెకానిక్‌లను ఉపయోగించి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మన దైనందిన జీవితాలను ప్రభావితం చేసే విప్లవాత్మక సాంకేతికతలను సృష్టించారు. ఉదాహరణకు మన స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లలోని సెమీకండక్టర్ చిప్‌లు కొంతవరకు క్వాంటం మెకానిక్‌లను ఉపయోగించి పనిచేస్తాయి. క్వాంటం మెకానిక్స్‌పై మనకున్న అవగాహన ఆధారంగా లేజర్‌లు, LED లైట్లు, LED మానిటర్లు అభివృద్ధి చేయడం జరిగింది.
ప్రపంచాన్ని నావిగేట్ చేయడంలో మనకు సహాయపడే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (GPS).. అల్ట్రా-ప్రెసిస్ అటామిక్ క్లాక్‌ల క్వాంటం మెకానిక్స్‌పై ఆధారపడుతుంది. ఆసుపత్రులలోని మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) స్కానర్లు క్వాంటం మెకానిక్‌లను ఉపయోగించి పనిచేస్తాయి. అంతేకాకుండా క్వాంటం కంప్యూటర్లు, క్వాంటం సెన్సార్లు, క్వాంటం కమ్యూనికేషన్ డివైజ్‌లు వంటి భవిష్యత్ సాంకేతికతలు కొత్త, డిస్ట్రప్టివ్ అప్లికేషన్స్‌ను కూడా అందించవచ్చు. డిస్ట్రప్టివ్ అప్లికేషన్ అంటే మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఉత్పత్తులు, సేవలు లేదా బిజినెస్ మోడల్స్‌కు కొత్త, వినూత్నమైన మార్పులు తీసుకురావడం.
ఇది ఈరోజే ఎందుకు?: ప్రపంచ క్వాంటం దినోత్సవం అనేది ఏప్రిల్ 14న జరిగే అంతర్జాతీయ, కంమ్యూనిటీ-బేస్డ్ ప్రోగ్రాం. ఇది క్వాంటం మెకానిక్స్ పట్ల ఆసక్తిని రేకెత్తించడం, ఉత్సాహాన్ని కలిగించడం కోసం ఉద్దేశించినది. క్వాంటం మెకానిక్స్‌లో చాలా ముఖ్యమైన సంఖ్య అయిన ప్లాంక్ స్థిరాంకం కారణంగా ఏప్రిల్ 14వ తేదీని ప్రపంచ క్వాంటం దినోత్సవంగా ఎంపిక చేశారు. ఈ తేదీ 4.14, ప్లాంక్ స్థిరాంకం (4.1356677 × 10⁻¹⁵ eV⋅s) మొదటి మూడు అంకెలను సూచిస్తుంది. ఇది క్వాంటం స్కేల్‌ను సెట్ చేస్తుంది. ప్లాంక్ స్థిరాంకం అనేది క్వాంటం భౌతిక శాస్త్రంలో చాలా ముఖ్యమైన స్థిరాంకం. ఇది శక్తి, పదార్థం క్వాంటం స్వభావాన్ని వివరించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక సార్వత్రిక స్థిరాంకం, అంటే విశ్వంలో ప్రతిచోటా ఒకేలా ఉంటుంది.
ప్రపంచ క్వాంటం దినోత్సవ చరిత్ర: ఈ వరల్డ్ క్వాంటం దినోత్సవం మొదట ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల వికేంద్రీకృత చొరవగా ప్రారంభమైంది. దీన్ని ఏప్రిల్ 14, 2022న జరిగే మొదటి వేడుకకు కౌంట్‌డౌన్‌గా ఏప్రిల్ 14, 2021న నిర్వహించారు. మొదటి ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని 2022లో 40+ దేశాలలో 200+ ఈవెంట్‌లతో జరుపుకొన్నారు. ఈ కార్యక్రమాలు క్వాంటం సైన్స్ అన్ని రంగాలను, అలాగే దాని చరిత్ర, ఫౌండేషన్స్, అప్లికేషన్స్, ఫిలాసఫికల్, సోషల్ ఇంప్లికేషన్స్ను ప్రోత్సహించాయి. ఇందులో ఆన్‌లైన్, వ్యక్తిగత కార్యక్రమాలు రెండూ ఉన్నాయి. అంటే మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
ఇందులో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, ప్రసారకులు, వ్యవస్థాపకులు, సాంకేతిక నిపుణులు, చరిత్రకారులు, తత్వవేత్తలు, కళాకారులు, మ్యూజియాలజిస్టులు, నిర్మాతలు మొదలైన వారు పాల్గొని ఔట్రీచ్ టాక్స్, ఎక్సిబిషన్స్, లేబొరేటరీ టూర్స్, ప్యానెల్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ మొదలైన వారి సంస్థల సొంత కార్యకలాపాలను అభివృద్ధి చేసుకోవచ్చు.
క్వాంటం అవగాహన ఎందుకు ముఖ్యమైనది?: సమాజంలోని కొన్ని ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడంలో సాంకేతికతను అందించడానికి, వాణిజ్యీకరించడానికి పనిచేసే సంస్థలకు విస్తృతమైన ప్రజా అవగాహన చాలా ముఖ్యమైనది. అందుకే ప్రపంచ క్వాంటం దినోత్సవం వంటి ప్రచారాలు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు చాలా ముఖ్యమైనవి.
అంతర్జాతీయ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరం: ఈ దినోత్సవంలో 2025ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది. ఇది ఈ రంగం ప్రాముఖ్యతను మరింత హైలైట్ చేస్తుంది.
క్వాంటం హిస్టరీ: మాక్స్ ప్లాంక్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, నీల్స్ బోర్, ఎర్విన్ ష్రోడింగర్ వంటి భౌతిక శాస్త్రవేత్తలు క్వాంటం అభివృద్ధిలో కీలక పాత్ర వహించారు. ఈ రంగం 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైంది. క్వాంటం సిద్ధాంతం పదార్థం, శక్తి ప్రాథమిక స్వభావం గురించి పూర్తిగా కొత్త అవగాహనను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా క్వాంటం మెకానిక్స్ అనేది అతి చిన్న ప్రమాణాలపై కణాల ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.
ఇది దాదాపు ప్రతిదాని గురించి మనం ఎలా ఆలోచిస్తామో సవాలు చేస్తూ సైన్స్ సరికొత్త యుగానికి మార్గం సుగమం చేస్తుంది. క్వాంటం సిద్ధాంతం పుట్టుక కేవలం మేధోపరమైన సవాలు కాదు. నిజానికి ఇది అనేక సాంకేతిక పురోగతులకు పునాది వేసింది. సెమీకండక్టర్లు, లేజర్ల అభివృద్ధి నుంచి MRI మిషన్‌ను సృష్టించడం వరకు క్వాంటం మెకానిక్స్ దశాబ్దాలుగా ఆధునిక ప్రపంచాన్ని నిశ్శబ్దంగా పునర్నిర్మిస్తోంది.
క్వాంటం మెకానిక్స్ ప్రపంచాన్ని ఎలా మార్చింది?: క్వాంటం మెకానిక్స్ వాస్తవికతపై మన అవగాహనను తీవ్రంగా మార్చి గణనీయమైన సాంకేతిక పురోగతికి ఆజ్యం పోసింది. ఇది ఆధునిక ఎలక్ట్రానిక్స్‌కు పునాది. ట్రాన్సిస్టర్లు, లేజర్లు, MRI స్కానర్లు వంటి పరికరాలు క్వాంటమ్ మెకానిక్స్‌ను ఉపయోగించి పనిచేస్తాయి. ఇది కంప్యూటింగ్, క్రిప్టోగ్రఫీ, మెడికల్ ఇమేజింగ్ వంటి రంగాలను ప్రభావితం చేస్తుంది.
క్వాంటం కంప్యూటింగ్ అనేది కంప్యూటర్ సైన్స్‌లో మోస్ట్ ఎక్సైటింగ్ రంగాలలో ఒకటి. ఇది నేడు సాధ్యమని భావించే దానికంటే వేగవంతమైన కంప్యూటింగ్ పురోగతిలో తోడ్పడుతుంది. క్లియర్‌గా చెప్పాలంటే ఒకప్పుడు అసాధ్యమైనవి లేదా పరిష్కరించడం అసాధ్యం అని భావించిన లెక్కలేనన్ని సమస్యలను ఈ టెక్నాలజి పరిష్కరిస్తుంది. ఇది ఔషధ ఆవిష్కరణ, పదార్థాల అభివృద్ధి నుంచి ఆర్థిక అంచనా వరకు ఉన్న రంగాలకు భారీ పురోగతిలో తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.
కియా సైరోస్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్- కళ్లు మూసుకుని కొనేయొచ్చు ఇక!
అప్డేటెడ్ పవర్‌ట్రెయిన్‌తో హీరో స్ప్లెండర్ ప్లస్- ధర కూడా పెరిగిందిగా- ఇప్పుడెంతంటే?
మనిషిలా ఆలోచించే 'మివి AI'- మీ క్లోజ్ ఫ్రెండ్‌లా ముచ్చట పెట్టుకోవచ్చు!