Smiley Face in The Sky: ఆకాశం నవ్వడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఆకాశం నవ్వటం ఏంటి? మీకేమయినా పిచ్చా? ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? అని అంటే అవుననే చెప్పొచ్చు! ఆకాశం తన రెండు కళ్లతో చూస్తూ.. బోసి నవ్వుతో మిమ్మల్ని పలకరిస్తుంది కూడా! అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ఈ ఘటన ఏప్రిల్ 25, 2025న జరగనుంది. ఆ వివరాలు మీకోసం.
మనలో చాలామంది బోసి నవ్వుతో ఉన్న ఇమోజీలను చూసే ఉంటాం. ఎక్కువగా ఇలాంటి ఇమోజీలను స్మార్ట్ఫోన్లలో మెసెజ్‌ల కోసం ఉపయోగిస్తుంటాం. బాగా నవ్వు వచ్చిన సందర్భాల్లో పళ్లు తెరచి ఉన్న చిన్నపాటి ఇమేజ్‌లను సెండ్ చేస్తుంటాం. మన అన్ని రకాల భావోద్వేగాలను ఇలాంటి స్మైలీ ఇమేజ్‌ల రూపంలో తెలుపుతుంటాం. కార్టూన్ ఛానెల్స్‌లో కూడా ఇలాంటి రకమైన ఇమోజీలు కన్పిస్తుంటాయి. అందులో అయితే చంద్రుడు, సూర్యుడు, ఆకాశం నవ్వుతూ ఉన్నట్లుగా చూపిస్తుంటారు.
ఇప్పుడు అచ్చం అదే రకమైన అనుభూతిని అందించే ఓ అద్భుత దృశ్యం ఆకాశంలో సాక్షాత్కారం కానుంది. అదే ట్రిపుల్ కంజక్షన్. ఆ సమయంలో శుక్రుడు, శని, స్కిమిటార్గా మారుతున్న సన్నని నెలవంక ఆకాశంలో ఒకదానికొకటి దగ్గరగా వచ్చి త్రిభుజాకారంలో అమరి కన్పించనున్నాయి. ఆ దృశ్యం చూసేందుకు నవ్వుతూ ఉన్న ఆకాశంలా కనువిందు చేయనుంది.
అసలేంటీ ట్రిపుల్ కంజక్షన్?: ట్రిపుల్ కంజక్షన్ అంటే భూమిపై ఒక పాయింట్ నుంచి ఆకాశంలో మూడు వస్తువులు ఒకదానికొకటి దగ్గరగా కన్పిస్తాయి. ఈ దగ్గరి అమరిక అనేది కక్ష్యల నిర్మాణం, భూమిపై మన స్థానం ద్వారా కలిగిన ఒక ఆప్టికల్ భ్రమ. ఇందులో ఉన్న గ్రహాలు అంటే చంద్రుడు, ఏవైనా గ్రహాలు అంతరిక్షంలో ఒకదానికొకటి దగ్గరగా ఉండవు. కానీ వాటి కక్ష్యలు కలుస్తాయి. తద్వారా అవి మన దృక్కోణం నుంచి ఒకదానికొకటి దగ్గరగా కన్పిస్తాయి.
ఇప్పుడు అంటే ఏప్రిల్ 25,2025న కూడా మనకు శుక్రుడు, శని, చంద్రుడు ఒకదానికొకటి దగ్గరగా ఉండవు. కానీ వాటి కక్ష్యలు కలవటం వల్ల మనకు అవి త్రిభుజాకారంలో 'స్మైలీ ఫేస్'గా కన్పిస్తాయి. ఆ సమయంలో 'మార్నింగ్ స్టార్' అని పేరున్న మెరిసే తెల్లని కాంతిని కలిగి ఉండే శుక్రుడు ఆకాశం పైభాగంలో ఉంటాడు. మసకగా కన్పించే శని ఎడమ వైపున కొంచెం కింది భాగంలో ప్రకాశిస్తూ కన్పిస్తాడు. ఇక సన్నని చంద్రవంక ఈ రెండింటికీ కింది భాగంలో ఉంటుంది. దాని ప్రకాశవంతమైన అంచు చిరునవ్వులా కొంచెం వంగి ఉంటుంది. ఈ ఖగోళ అమరిక వల్ల ఆకాశం నవ్వుతూ ఉన్నట్లు కనిపించి అలరించనుంది.
ఇది ఏ సమయంలో కన్పిస్తుంది?: ఈ అద్భుత దృశ్యం బెస్ట్ వ్యూను సూర్యోదయానికి ముందు అంటే స్థానిక సమయం ఉదయం 5:30 గంటలకు చూడొచ్చు. ఈ సమయంలో ప్రకాశవంతమైన గ్రహాలు, సన్నని చంద్రవంకను సరిగ్గా అబ్జర్వ్ చేసేందుకు తగినంత చీకటి ఉంటుంది. అయితే చాలా తక్కువ సమయం వరకు మాత్రమే ఈ బెస్ట్ వ్యూ మనం చూడగలం. ఎందుకంటే ఈ అద్భుతం దర్శనం ఇచ్చిన కాసేపటికే సూర్యుడు ఉదయిస్తాడు. సూర్య కాంతిలో ఇక ఈ దృశ్యం మనకు కన్పించదు.
ఇది ఎలా చూడాలి?: ఈ ట్రిపుల్ కంజక్షన్ను చూసేందుకు వీక్షకులకు తూర్పున అడ్డంకులు లేని హారిజన్ అవసరం. అంటే తూర్పు వైపునకు అడ్డుగా లేని ఎత్తైన భవనం ఎక్కి చూస్తే ఈ గ్రహాలు, చంద్రుడు మూడూ కూడా త్రిభుజాకారంలో కనిపిస్తాయి. ఇకపోతే శుక్రుడు, శని రెండింటినీ మన కంటితో చూడొచ్చు. అయితే బైనాక్యులర్లు లేదా చిన్న టెలిస్కోప్ ఉంటే ఈ దృశ్యాన్ని ఇంకా బాగా వీక్షించొచ్చు.
10Gbps స్పీడ్ ఇంటర్నెట్ను ప్రారంభించిన చైనా- ఇకపై సెకన్లలో సినిమాలు డౌన్లోడ్!
'ఆర్యభట్ట' గోల్డెన్ జూబ్లీ వేడుకలు- చరిత్రలో నేటి గొప్పతనం మీలో ఎంతమందికి తెలుసు?
ఇన్‌స్టా యూజర్లకు గుడ్‌న్యూస్- ఇకపై మీ ప్రియమైన వారితో కలిసి ఒకే రకమైన రీల్స్ చూడొచ్చు!