నాసా మూన్ అండ్ మార్స్ మిషన్స్: 10 కొత్త వ్యోమగామి అభ్యర్థుల ఎంపిక- మహిళలదే హవా!
కొత్త వ్యోమగామి అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించిన నాసా- వివరాలు ఇవే!

Published : September 24, 2025 at 4:09 PM IST
Hyderabad: నాసా భవిష్యత్‌లో ప్రయోగించే మూన్ అండ్ మార్స్ మిషన్ల కోసం 10 కొత్త వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అందులో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం. ఇకపోతే ఇందుకోసం అమెరికా నలుమూలల నుంచి 8,000 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా వారిలో అత్యంత నైపుణ్యం కనబరిచిన పదిమందిని ఫైనల్ చేసినట్లుగా పేర్కొంటూ నాసా లిస్ట్ ప్రకటించింది.
ఈ బృందానికి భూమి దిగువ కక్ష్య, చంద్రుడు, అంగారక (మార్స్) గ్రహాలను చేరుకోవడంలో కావాల్సిన నైపుణ్యాలను అందించనుంది. దాదాపు రెండేళ్లపాటు అత్యంత కఠినమైన ఈ వ్యోమగామి శిక్షణను పూర్తిచేకున్న అనంతరం వీరికి తమ భవిష్యత్ సైన్స్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ఫ్లైట్ మిషన్లలో పాల్గొనే అవకాశాన్ని అందించనుంది.
నాసా 10 కొత్త వ్యోమగామి అభ్యర్థుల లిస్ట్ ఇదే:
- బెన్ బెయిలీ- చార్లోట్స్‌విల్లే, వర్జీనియా
- లారెన్ ఎడ్గార్- సమ్మమిష్, వాషింగ్టన్
- ఆడమ్ ఫుహర్మాన్- లీస్‌బర్గ్, వర్జీనియా
- కామెరాన్ జోన్స్- సవన్నా, ఇల్లినాయిస్
- యూరి కుబో- కొలంబస్, ఇండియానా
- రెబెక్కా లాలర్- లిటిల్ ఎల్మ్, టెక్సాస్
- అన్నా మీనన్- హూస్టన్, టెక్సాస్
- ఇమెల్డా ముల్లర్- కోపేక్ ఫాల్స్, న్యూయార్క్
- ఎరిన్ ఓవర్‌క్యాష్- గోషెన్, కెంటుకీ
- కేథరీన్ స్పైస్- శాన్ డియాగో, కాలిఫోర్నియా
హూస్టన్‌లోని ఏజెన్సీ జాన్సన్ స్పేస్ సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో NASA యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్ సీన్ డఫీ ఈ "ఆల్-అమెరికన్ 2025" క్లాస్ ఆస్ట్రానాట్ అభ్యర్థులను అందరికీ పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తదుపరి తరం అమెరికన్ అన్వేషకులను తమ ఏజెన్సీకి స్వాగతించడం గౌరవంగా ఉందన్నారు. అనంతరం ఈ పదిమంది అప్‌కమింగ్ వ్యోమగాములను పొగడ్తలతో ముంచెత్తారు.
"దేశ నలుమూలల నుంచి 8,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, పైలట్లు, ఇంజనీర్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడిక్కడ కూర్చున్న 10 మంది తమ వృత్తి ప్రస్తానాన్ని ఎక్కడ, ఎలా ప్రారంభిచారనేది ముఖ్యం కాదు. అమెరికా గడ్డపై శిక్షణ పొంది ఆకాశమే హద్దుగా తమ కలలను నెరవేర్చుకుంటూ ఎంతటి ఘనతలు సాధించబోతున్నారనేదే ప్రధానం. దృఢనిశ్చయంతో కలలు కనేవాడు సాధించగల దానికి పరిమితి లేదు- అంతరిక్షంలోకి వెళ్లడం కూడా లేదు అనే సత్యాన్ని వీరు ప్రతిబింబిస్తారు. వీరితో కలిసి మేం అన్వేషణలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తాం." - సీన్ డఫీ, నాసా తాత్కాలిక చీఫ్
ఇకపోతే బుధగ్రహంపై పరిశోధన కోసం నాసా దశాబ్దాల క్రితం "మెర్క్యురీ సెవన్" పేరిట ఏడుగురు వ్యోమగాముల బృందాన్ని తొలిసారిగా ప్రకటించింది. ఆనాటి నుంచి చూస్తే ఈ బ్యాచ్ 24వది. నాసా జాన్సన్‌లో విధులకు ఈ కొత్త బ్యాచ్‌ను సెప్టెంబర్ మధ్యలో రిపోర్ట్ చేసింది. వెంటనే అంటే ఇప్పటికే వారి శిక్షణనూ ప్రారంభించింది.
ఈ కొత్త వ్యోమగామి అభ్యర్థులకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, చంద్రునిపై నాసా చేపట్టబోయే ప్రతిష్టాత్మక ఆర్టీమిస్ మిషన్‌తో పాటు అంతకు మించి ఎన్నో సంక్లిష్ట కార్యకలాపాలకు సంబంధించిన నైపుణ్యాలపై నాసా సీనియర్లు తర్ఫీదు ఇవ్వనున్నారు.
ప్రత్యేకంగా ఈ శిక్షణలో రోబోటిక్స్, భూమితో పాటు నీటిలో ఎలా మనుగడ సాగించాలి, భూగర్భ శాస్త్రం, విదేశీ భాషలపై పట్టు సాధించడం, అంతరిక్ష వైద్యం, శరీరధర్మ శాస్త్రం వంటి అంశాలు ఉన్నాయి. అదేసమయంలో సిమ్యులేటెడ్ స్పేస్ వాక్స్, హై-పెర్ఫార్మెన్స్ జెట్స్‌లో ప్రయాణించడంపై కూడా వీరు శిక్షణ తీసుకోబోతున్నారు.

