విశ్వంలో 6,000 ఏలియన్ గ్రహాలు- వివరాలు వెల్లడించిన నాసా
ఎక్సోప్లానెట్ల జాబితాను వెల్లడించిన నాసా- ఓసారి చూసేయండి!

Published : September 18, 2025 at 6:34 PM IST
Hyderabad: ఈ అనంత విశ్వం అంతుచిక్కని ఎన్నో రహస్యాలకు కేరాఫ్ అడ్రస్. భూమి నుంచి మొదలుకొని ఆకాశం వరకు ఎన్నో నిగూఢ రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. వాటి గుట్టు విప్పేందుకు మానవుడు అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూ అనేక కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాడు. తాజాగా అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఏలియన్ గ్రహాల (ఎక్సోప్లానెట్స్) సంఖ్య 6,000కు చేరుకున్నట్లుగా వెల్లడించింది. 30 సంవత్సరాల క్రితం కనుగొన్న మొదటి ఎక్సోప్లానెట్ నుంచి 2025 నాటికి అంటే ఇప్పటివరకూ ఈ సంఖ్య మొత్తం 6,000కు చేరుకుందని పేర్కొంటూ జాబితాను అందించింది. తమ పరిశోధన కొనసాగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఏజెన్సీ తెలిపింది.
కాలిఫోర్నియాలోని పసాదేనాలోని కాల్టెక్ IPACలో ఉన్న నాసా ఎక్సోప్లానెట్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (NExScI) ఈ సంఖ్యను పర్యవేక్షిస్తుంది. 1995లో సూర్యుడు వంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న మొదటి ఎక్సోప్లానెట్ను గుర్తించినప్పటి నుంచి విశ్వం అద్భుతమైన వైవిధ్యాన్ని వెలికితీయడంలో నాసా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రస్తుతం మన విశ్వంలో 8,000 కంటే ఎక్కువ గ్రహాలు నిర్ధారణ కోసం వేచి ఉన్నాయి. వీటిని గ్రహాలుగా లెక్కించినట్లయితే సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఎక్సోప్లానెట్స్ సంఖ్య 6000కు మించి ఉంటుంది.
మన సౌర వ్యవస్థలో రాకీ, జెయింట్ గ్రహాలు ఉన్నాయి. కానీ విశ్వం అంతటా రాకీ గ్రహాలు ఎక్కువగా కనిపిస్తాయి. "రాకీ గ్రహాలు" (భూగోళ గ్రహాలు) అనేవి మన సౌర వ్యవస్థలోని భూమి, అంగారకుడు, శుక్రుడు, బుధుడు వంటి రాతి, లోహంతో ప్రధానంగా తయారైన చిన్న, దట్టమైన గ్రహాలు. "జెయింట్ గ్రహాలు" చాలా పెద్దవి. వీటిని జోవియన్ గ్రహాలు అని కూడా పిలుస్తారు. ఇవి తక్కువ సాంద్రత కలిగినవి. ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వంటి వాయువులతో కూడి ఉంటాయి. వీటికి బృహస్పతి, శని వంటి ఘన ఉపరితలం ఉండదు.
ఇప్పుడు మనకు తెలిసిన వాటికి పూర్తిగా భిన్నమైన అనేక రకాల ప్లానెట్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొన్ని బృహస్పతి అంత భారీ పరిమాణంలో ఉంటాయి. ఇవి వాటి నక్షత్రాలకు చాలా దగ్గరగా కక్ష్యలో తిరుగుతుంటాయి. ప్రతి కొత్త రకమైన గ్రహం.. గ్రహాలు ఎలా ఏర్పడతాయో?, భూమి వంటి ఇతర గ్రహాల కోసం ఎక్కడ వెతకాలో శాస్త్రవేత్తలకు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
భవిష్యత్ ఏలియన్ ప్లానెట్: భూమి వంటి రాతి గ్రహాలను కనుగొనడం, బయోసిగ్నేచర్స్ అనే జీవ సంకేతాల కోసం వాటి వాతావరణాలను అధ్యయనం చేయడంపై NASA దృష్టి సారించింది. అంతరిక్షం గుట్టు విప్పేందుకు నాసా రూపొందించిన "జేమ్స్ వెబ్" అనే టెలిస్కోప్ ఇప్పటికే 100 కంటే ఎక్కువ ఎక్సోప్లానెట్ల వాతావరణాలను విశ్లేషించింది. ఈ స్పేస్ టెలిస్కోప్ కంటికి కనిపించని దూరంలో ఉన్న సుదూర గ్రహాలు, నక్షత్రాల గుట్టును మనిషికి చేరవేస్తోంది. విశ్వదర్శినిగా పేరుపొందిన ఈ టెలిస్కోప్ గత కొన్నేళ్లుగా అంతరిక్షంలోని అనేక అపురూప దృశ్యాలను అందిస్తూ వస్తోంది.
అయితే భూమి పరిమాణంలో ఉన్న గ్రహాలను వాటి హోస్ట్ స్టార్‌ల తీవ్రమైన కాంతి కారణంగా గుర్తించడం చాలా కష్టం. దీనిని అధిగమించడానికి NASA రోమన్ కరోనాగ్రాఫ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేస్తోంది. ఇది అప్కమింగ్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో నక్షత్రాల కాంతిని నిరోధించి చీకటి గ్రహాలను వెలికితీస్తుంది. మరింత కచ్చితమైన గుర్తింపు కోసం భూమి వంటి గ్రహాలను గుర్తించి, వాటి జీవ సామర్థ్యాన్ని పరిశోధించేందుకు నాసా భవిష్యత్ మిషన్‌ను ప్లాన్ చేస్తోంది.

ముఖ్యంగా NASA ఎక్సోప్లానెట్ అన్వేషణ కార్యక్రమం సమీపంలోని నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహ వ్యవస్థలను కనుగొనడంపై బాధ్యత వహిస్తుంది. ఇది ఎక్సోప్లానెట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. భవిష్యత్ ఆవిష్కరణల కోసం సమన్వయ వ్యూహాన్ని ఏకీకృతం చేస్తుంది.

