Skull Shaped Rock Found On Mars: అనంత విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు. కాలాంతరంలో మనుషులు ఎన్నో మిస్టరీలను ఛేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో భూమిని పోలిన గ్రహాల కోసం శాస్త్రవేత్తలు నిత్యం గాలిస్తున్నారు. భూమిపై కాకుండా వేరే గ్రహంపై కూడా మానవుల మనుగడ సాధ్యమేనా అని తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. భూమిని పోలిన గ్రహాలను గుర్తించినా వాటిపై జీవం ఉందో లేదా కనుగొనేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో అంగారక గ్రహ అన్వేషణలో భాగంగా నాసా పంపించిన పెర్సెవెరెన్స్ రోవర్ ఒక మిస్టీరియస్ రాయిని గుర్తించింది. ఆ రాయి మనుషుల పుర్రె ఆకారంలో ఉండడం గమనార్హం. ఏప్రిల్ 11న జెజెరో క్రేటర్ అంచున పెర్సెవరెన్స్ రోవర్ మాస్ట్‌క్యామ్-Z పరికరం ద్వారా దీన్ని గుర్తించారు. నాసా 2020లో ప్రారంభించిన మార్స్ మిషన్‌లో భాగంగా అంగారక గ్రహంపై జెజెరో క్రేటర్‌ను అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో పెర్సెవెరెన్స్ రోవర్‌ను పంపింది.
కారుకి సమానమైన పరిమాణంలో ఉండే ఈ రోవర్ అంగారక గ్రహంపై విస్తృతంగా తిరుగుతూ పలు పరిశోధనలు జరుపుతోంది. ప్రస్తుతం ఇది అంగారక గ్రహంపై జెజెరో క్రేటర్ అంచున పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో అది మార్స్‌పై అసాధారణ ఆకారంలో ఉన్న రాయిని గుర్తించి దాని చిత్రాన్ని భూమికి పంపించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనే దానిపై ఇంకా స్పష్టతరాలేదు. ఈ నేపథ్యంలో దీనిపై మరింత లోతైన పరిశోధనలు జరిపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.
స్కల్ హిల్: పుర్రె ఆకారంలో ఉన్న ఈ రాయికి నాసా 'స్కల్ హిల్' అని పేరు పెట్టింది. ఈ రాయి చుట్టుపక్కల ధూళితో కూడిన రాళ్లు ఉన్నాయి. అయితే వాటన్నింటి కంటే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటూ కాస్త మెరుస్తున్నట్లుగా కన్పిస్తుంది. దాని సమీపంలోని ఇతర రాళ్లు, నేల లేత రంగులో ఉండగా ఇది మాత్రం ప్రత్యేకంగా రాతి ముదురు రంగులో, చిన్న చిన్న గుంతలను కలిగి ఉంది. ఈ 'స్కల్ హిల్' దాని చుట్టుపక్కల ఉన్న లైట్-కలర్డ్ శిలల మధ్య డార్క్ కలర్, కోణీయ ఉపరితలంతో చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని నాసా పేర్కొంది.
దాని ఉపరితలంపై ఉన్న గుంతలు ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దీని మూలానికి సంబంధించిన వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ ఈ రాయిపై ఉన్న గుంతలు అనేవి గాలి లేదా ఇతర సహజ కోత ప్రక్రియల (Natural Erosion Processes) వల్ల ఏర్పడి ఉండవచ్చని నాసా భావిస్తోంది.
స్కల్ హిల్ మూలం: ఈ శిల ఒక ఇంపాక్ట్ క్రేటర్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఉండవచ్చు లేదా సమీపంలోని శిల నుంచి విరిగిపోయి ఉండవచ్చు. లేదంటే ఇది అగ్నిపర్వత శిల అయినా కావచ్చు. లేదా చుట్టుపక్కల ఉన్న రాళ్ల కోత నుంచి ఏర్పడి ఉండవచ్చు అని నాసా విశ్వసిస్తోంది.
ఇంపాక్ట్ క్రేటర్ అంటే?: ఇంపాక్ట్ క్రేటర్ (Impact Crater) అంటే ఏదైనా ఘన ఖగోళ వస్తువు (గ్రహం, చంద్రుడు, గ్రహశకలం) ఉపరితలంపై ఏర్పడే రంధ్రాలు లేదా బౌల్ ఆకారంలో ఉండే గొయ్యి. ఇవి ప్రధానంగా ఏదైనా వస్తువు (ఉల్క, గ్రహశకలం, మొదలైనవి) ఒక గ్రహం లేదా చంద్రుడి ఉపరితలంపై అధిక వేగంతో ఢీకొనడం ద్వారా ఏర్పడతాయి. అగ్నిపర్వత క్రేటర్లతో పోల్చితే ఇంపాక్ట్ క్రేటర్లు సాధారణంగా దాని చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో తక్కువగా ఉండే అంచులతో కొంచెం చిన్న రంధ్రాలు లేదా బౌల్ ఆకారంలో లోతును కలిగి ఉంటాయి.
ప్రారంభంలో శాస్త్రవేత్తలు ఈ రాయిని ఉల్క అనుకున్నారు. కానీ రోవర్‌లో అమర్చిన శక్తివంతమైన కెమెరా ద్వారా కెమికల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇది ఉల్క కాదని తేలింది. ప్రస్తుతం దీని మూలం, ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు మరిన్ని అధ్యయనాలు నిర్వహిస్తున్నారని నాసా తెలిపింది.
అంగారక గ్రహంపై జీవం కోసం అన్వేషణ: అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశం శాస్త్రవేత్తలకు పెద్ద ప్రశ్నగా ఉంది. ఇటీవల నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ (MRO) అంగారక గ్రహం ఉత్తరార్ధగోళంలో ఘనీభవించిన ఇసుక దిబ్బల చిత్రాలను తీసింది. భూమిపై ఉన్న మట్టిదిబ్బల మాదిరిగా కాకుండా ఇది స్టేబుల్‌గా కన్పిస్తుంది.
గతేడాది అక్టోబర్‌లో నాసా అధ్యయనం అంగారక గ్రహం ఉపరితలం కింద ఘనీభవించిన మంచు కింద నిస్సారమైన నీటి కొలనులలో కిరణజన్య సంయోగక్రియ సాధ్యమవుతుందని సూచించింది. ఇది సూక్ష్మజీవులకు పొటెన్షియల్ నివాసంగా మారవచ్చు. అంటే అంగారక గ్రహం ఉపరితలం కింద జీవులు నివసించేందుకు అనువుగా ఉండొచ్చు.
అంగారక గ్రహం ప్రాచీన చరిత్ర: అంగారక గ్రహం ప్రస్తుతం చల్లగా, బంజరుగా, రాతితో నిండి ఉంది. కానీ దాదాపు 3.9 బిలియన్ సంవత్సరాల క్రితం వరకు దానికి అయస్కాంత క్షేత్రం (Magnetic Field) ఉండేదని ఆధారాలు సూచిస్తున్నాయి. ఇది అంగారక గ్రహాన్ని జీవానికి అనువైన వాతావరణంగా మారుస్తుంది. అయస్కాంత క్షేత్రం మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది మనకు దిశను సూచించడానికి, విద్యుత్ ఉత్పత్తికి, రక్షణకు, సాంకేతిక పరికరాల పనితీరుకు అవసరం.
ఇకపోతే అంగారక గ్రహంపై ఎప్పుడైనా జీవం ఉందా? ఈ 'స్కల్ హిల్' శిల ఆ కథలో భాగం కాగలదా? అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. ఈ రాయి అంగారక గ్రహం మిస్టీరియస్ హిస్టరీలో కొత్త అధ్యాయానికి తెర తీయొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రాయి మూలం, దీని క్రేటర్లు ఏర్పడిన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి NASA బృందం విస్తృతమైన పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ ఆవిష్కరణ అంగారక గ్రహం భౌగోళిక చరిత్రను అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడటమే కాకుండా, ఈ రెడ్ ప్లానెట్‌పై జీవం ఉండే అవకాశాన్ని కూడా తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది.
ఆకాశంలో కనువిందు చేయనున్న ఉల్కాపాతం- నిప్పులు కక్కుతూ నేలకు జారనున్న ఉల్కలు!
ఇస్రో ఖాతాలో మరో ఘనత- రోదసిలో స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్
ఆకాశం నవ్వటాన్ని ఎప్పుడైనా చూశారా?- ఏప్రిల్ 25న చూస్తే 'స్మైలీ ఫేస్'తో పలకరిస్తుంది కూడా!