రే-బాన్ మెటా జెన్ 2 గ్లాసెస్ లాంఛ్- 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్తో పాటు మరిన్నో!
మెటా నెక్స్ట్ లెవల్ స్మార్ట్ ఐవేర్ రిలీజ్- ధర, ఫీచర్ల వివరాలు మీకోసం- ఓ లుక్కేయండి మరి!

Published : September 18, 2025 at 2:13 PM IST
Hyderabad: మెటా కనెక్ట్ 2025లో తన కొత్త తరం స్మార్ట్‌గ్లాసెస్‌ను ఆవిష్కరించింది. భారతకాలమానం ప్రకారం సెప్టెంబర్ 18న ఉదయం 5:30 గంటలకు అమెరికాలో జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ "రే-బాన్ మెటా జెన్ 2" స్మార్ట్‌గ్లాసెస్‌ను ప్రారంభించింది. ఇవి 2023లో విడుదలైన రే-బాన్ మెటా స్మార్ట్గ్లాసెస్కు అప్‌గ్రేడ్ వెర్షన్. ఇవి యూజర్ మణికట్టు (Wrist)పై ధరించే బ్యాండ్ నియంత్రణలో ఉంటాయి. అంటే ఈ బ్యాండ్ ద్వారా చేతివేళ్లతోనే వీటిని కంట్రోల్ చేయొచ్చు.
ఈ స్మార్ట్‌గ్లాసెస్ స్టైలిష్‌గా ఉండటంతో పాటు మీకు స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ మాదిరిగా డిజిటల్ లైఫ్‌ను అందిస్తాయి. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ కొత్త మోడల్‌ను AR స్మార్ట్‌గ్లాసెస్ మెటా రే-బాన్ డిస్ప్లే, అథ్లెట్ల కోసం తీసుకొచ్చిన వాన్‌గార్డ్ గ్లాసెస్‌తో పాటు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మెటా కొత్త స్మార్ట్‌గ్లాసెస్ "రే-బాన్ మెటా జెన్ 2" గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
The next evolution of AI glasses is here: meet Meta Ray-Ban Display and Meta Neural Band. Learn more: https://t.co/q0wYlE4hGR
— Meta Newsroom (@MetaNewsroom) September 18, 2025
మెరుగైన కెమెరా ఫీచర్లు: ఈ "రే-బాన్ మెటా జెన్ 2" బ్యాటరీ, కెమెరాతో పాటు మరిన్ని ఫీచర్లలలో గణనీయమైన మెరుగుదలలను కూడా కలిగి ఉంది. వీటిలో మునుపటి మోడల్‌తో పోలిస్తే మెరుగైన బ్యాటరీ లైఫ్, 3K వీడియో క్వాలిటీ, కొత్త AI ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లోని కెమెరా కూడా గణనీయమైన అప్‌గ్రేడ్‌లను పొందింది. ఇవి ఇప్పుడు 3K అల్ట్రా HD వీడియో రికార్డింగ్ అండ్ ఫొటో క్యాప్చర్‌ను అందిస్తున్నాయి.

ఈ స్మార్ట్‌గ్లాసెస్ 60fps వరకు స్మూత్ రికార్డింగ్, అల్ట్రావైడ్ HDR సపోర్ట్‌ను కూడా అందిస్తాయి. మునుపటి మోడల్‌తో పోలిస్తే రెట్టింపు పిక్సెల్‌లతో వస్తున్నాయి. ఇంకా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి స్మార్ట్ గ్లాసెస్‌కు హైపర్‌లాప్స్, స్లో-మోషన్ వీడియో మోడ్‌లను కూడా జోడిస్తోంది.
కాన్వర్జేషన్ ఫోకస్ ఫీచర్: అదనంగా ఇందులో ఒక కొత్త "కాన్వర్జేషన్ ఫోకస్" ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది కేఫ్ లేదా పార్క్ వంటి నాయిస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా మీరు అవతలి వ్యక్తి వాయిస్‌ను స్పష్టంగా వినేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ త్వరలో రే-బాన్ మెటా, ఓక్లీ మెటా HSTN గ్లాసెస్‌లోనూ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారా అందుబాటులోకి రానుంది.
మెరుగైన బ్యాటరీ లైఫ్: ఈ కొత్త "రే-బాన్ మెటా జెన్ 2" బ్యాటరీ కూడా మునుపటి తరంతో పోలిస్తే మెరుగుపడింది. ఈ స్మార్ట్‌గ్లాసెస్ సాధారణ వాడకంతో 8 గంటల వరకు పనిచేస్తాయని, ఇది మునుపటి మోడళ్ల కంటే రెండు రెట్లు ఎక్కువ అని కంపెనీ పేర్కొంది. అంతేకాక వీటిని కేవలం 20 నిమిషాల్లోనే 50% వరకు ఛార్జ్ చేయొచ్చు. ఇవి ఛార్జింగ్ కేసుతో పాటు వస్తాయి. ఇది అదనంగా 48 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్: "రే-బాన్ మెటా జనరేషన్ 2" ఇప్పుడు "లైవ్ ట్రాన్స్‌లేషన్" ఫీచర్‌తో వస్తుంది. అయితే ఇది ప్రస్తుతం జర్మన్, పోర్చుగీస్ భాషలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ ఆఫ్‌లైన్ ట్రాన్స్‌లేషన్ మాత్రం త్వరలో 6 భాషలలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్ గ్లాసెస్ ప్రస్తుతం స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, బ్రెజిల్‌లో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ వీటిని ఈ ఏడాదే భారత్, మెక్సికోలో కూడా విడుదల చేయనుంది.

ధర, వేరియంట్లు: ఈ కొత్త "రే-బాన్ మెటా జెన్ 2" స్మార్ట్‌గ్లాసెస్ వేఫేరర్, స్కైలర్, హెడ్‌లైనర్ అనే మూడు స్టైలిష్ ఫ్రేమ్‌లతో పాటు 27 రంగులు, మల్టిపుల్ లెన్స్ ఆప్షన్స్‌లో లభిస్తాయి. వీటి ధరలు $379 (సుమారు రూ. 33,300) నుంచి ప్రారంభమవుతాయి. పోలరైజ్డ్ లెన్స్‌లు $409 నుంచి, ట్రాన్సిషన్ లెన్స్‌లు $459 నుంచి ప్రారంభమవుతాయి. ప్రిస్క్రిప్షన్ మోడల్స్ ధర ఇంకా ఎక్కువ ఉండొచ్చు.

