ETV Bharat / technology

జాగ్వర్ ల్యాండ్ రోవర్​పై సైబర్ ఎటాక్- రోజుకు రూ. 60 కోట్ల వరకు భారీ ఆర్థిక నష్టం!

సైబర్​ దాడిలో చిక్కుకున్న JLR- పూర్తిగా నిలిచిపోయిన ఉత్పత్తి!

Cyber Attack on Jaguar Land Rover
Cyber Attack on Jaguar Land Rover (Photo Credit- Jaguar Land Rover)
author img

By ETV Bharat Tech Team

Published : September 17, 2025 at 9:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

Cyber Attack on Jaguar Land Rover: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సెప్టెంబర్ 1న భారీ సైబర్ ఎటాక్​లో చిక్కుకుంది. కంపెనీ ఇప్పుడు తన గ్లోబల్ ఫ్యాక్టరీలలో సింగిల్ కారును కూడా ఉత్పత్తి చేయకుండా మూడవ వారంలోకి ప్రవేశించింది. ఈ సైబర్ ఎటాక్ JLR అంతర్గత వ్యవస్థలను పూర్తిగా దెబ్బతీసింది. ఉత్పత్తి, విడిభాగాల ఆర్డర్లు, రిటైల్ కార్యకలాపాలను నిలిపివేసింది. దీనివల్ల రోజుకు రూ. 60 కోట్ల వరకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అంచనా.

కంపెనీ మొదట సెప్టెంబర్ 1న ఈ ట్రబుల్ సంకేతాలను గమనించింది. సంప్రదాయకంగా UKలో సేల్స్​ అత్యంత రద్దీగా ఉండే రోజులలో ఒకటైన "న్యూ ప్లేట్ డే" నాడు JLR డీలర్లు ఒక్క కొత్త కార్ల ఆర్డర్​ను కూడా రిజిస్టర్ చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో సైబర్ దాడిని నివారించేందుకు తన సిస్టమ్​లను షట్ డౌన్ చేస్తున్నట్లు JLR సెప్టెంబర్ 2న అధికారికంగా ప్రకటించింది.

Jaguar Land Rover Production Halted
Jaguar Land Rover Production Halted (Photo Credit- Jaguar Land Rover)

సెప్టెంబర్ 3న "స్కాటర్డ్ లాప్సస్ హంటర్స్" అనే హ్యాకర్ గ్రూప్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించింది. ఈ గ్రూప్ ఈ ఏడాది ప్రారంభంలో UK రిటైల్ చైన్ మార్క్స్ & స్పెన్సర్‌పై కూడా సైబర్​ దాడికి పాల్పడింది. దీనివల్ల ఆ రిటైలర్‌కు కొన్ని వారాల పాటు అంతరాయం కలిగింది.

Jaguar Land Rover's Manufacturing Facility
Jaguar Land Rover's Manufacturing Facility (Photo Credit- Jaguar Land Rover)

ఇక జాగ్వార్ ల్యాండ్ రోవర్ విషయానికి వస్తే ఈ బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ అంతర్గతంగా ఉపయోగించే థర్డ్-పార్టీ SAP నెట్‌వీవర్ (SAP NetWeaver) సాఫ్ట్‌వేర్‌లోని తెలిసిన దుర్బలత్వాన్ని (known vulnerability) హ్యాకర్ గ్రూప్ ఉపయోగించుకున్నట్లు భావిస్తున్నారు. ఈ హ్యాకర్ గ్రూప్ JLR కస్టమర్ డేటాను కూడా పొందిందని కంపెనీ పేర్కొంది.

Jaguar Land Rover Production Facility
Jaguar Land Rover Production Facility (Photo Credit- Jaguar Land Rover)

సైబర్ దాడి జరిగి మూడు వారాలైనా JLR ఇప్పటికీ ఉపశమనం పొందలేదు. సెప్టెంబర్ 15 నాటికి JLR తన ప్రపంచ వ్యవస్థలను పునర్నిర్మిస్తున్నట్లు తెలిపింది. అయితే పూర్తి పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందో ఇంకా సమాచారం అందించలేదు. గత రెండు వారాలుగా ఏ JLR కారూ ఉత్పత్తి లైన్ నుంచి బయటకు రాలేదు. ఇది ఇంకో వారం రోజులు అంటే కనీసం సెప్టెంబర్ 24 వరకు అయినా కొనసాగేలా ఉంది.

Jaguar Land Rover Production Halted
Jaguar Land Rover Production Halted (Photo Credit- Jaguar Land Rover)

జాగ్వార్ ల్యాండ్ రోవర్ డేటా ప్రభావితమైనట్లు ధృవీకరించింది. అంటే కస్టమర్ సమాచారం లీక్ అయింది. ఈ నేపథ్యంలో JLR తన కార్యకలాపాలను సురక్షితంగా పునరుద్ధరించడంలో సహాయపడటానికి పోలీసులు, సైబర్ భద్రతా నిపుణులను పిలిపించింది.

JLR సరఫరాదారుల సంక్షోభం: JLRలో పైన పేర్కొన్న ఉత్పత్తి మూసివేతలు కంపెనీ సరఫరా గొలుసుపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. సరఫరాదారులు నిలిచిపోయిన ఆర్డర్‌ల కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొందరు అయితే దివాలా తీసే ముప్పును కూడా ఎదుర్కొంటున్నారు.

ఇటీవల BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్టన్ మార్టిన్ మాజీ CEO ఆండీ పామర్ JLR సరఫరా గొలుసు అంతటా తొలగింపులు ఇప్పటికే జరుగుతున్నాయని లేదా ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు హెచ్చరించారు. చాలా మంది సరఫరాదారులు ప్రారంభంలో అంతరాయాన్ని తట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ అంతరాయం ఇంకా కొనసాగుతున్నందున వారు సిబ్బందిని తగ్గించుకోవలసి వస్తుంది.