IIT Madras AI Research Centre : ఐఐటీ మద్రాస్, కాలిఫోర్నియాకు చెందిన జిరోహ్ ల్యాబ్స్ భాగస్వామ్యంతో 'సెంటర్ ఫర్ ఏఐ రీసెర్చ్' (COAIR)ను స్థాపించింది. భారతదేశ కంప్యూట్ యాక్సెసిబిలిటీ సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ ఏఐ పరిశోధన కేంద్రాన్ని స్థాపించినట్లు ఐఐటీ మద్రాస్ అధికారులు తెలిపారు.
జిరోహ్ ల్యాబ్య్ అనేది కాలిఫోర్నియాకు చెందిన ఆవిష్కరణ-ఆధారిత డీప్ టెక్ స్టార్టప్ కంపెనీ. దీని భాగస్వామ్యంతో ఐఐటీ మద్రాస్ ఏర్పాటు చేసిన ఈ 'సీఓఏఐఆర్'- సీపీయూ, ఎడ్జ్ డివైస్ ఇన్ఫెరెన్సింగ్‌పై దృష్టి సారించే సమర్థవంతమైన, ఆచరణాత్మకమైన ఏఐ సొల్యూషన్స్ అభివృద్ధి చేస్తుంది. ఇవి భారతదేశ కంప్యూట్ యాక్సెసిబిలిటీ సమస్యలను పరిష్కరించడంలో చాలా కీలక భూమిక పోషించనున్నాయి.
కాంపాక్ట్ ఏఐ
జిరోహ్ ల్యాబ్స్ ఇప్పటికే కాంపాక్ట్ ఏఐ (Kompact AI) అనే మొదటి వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఇది ఒక ఏఐ ప్లాట్‌ఫారమ్. ఇది అత్యంత ఖరీదైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPU) అవసరం లేకుండా, కేవలం సీపీయూ (CPU)ను ఉపయోగించి ఫౌండేషన్ మోడల్స్‌ను అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఈ కాంపాక్ట్ ఏఐను భారతదేశ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అభివృద్ధి చేశారు. జిరోహ్ ల్యాబ్స్ దీనితో డీప్‌సీక్, క్వెన్ (Qwen), ఎల్‌లామ్ (Llama)తో సహా 17 ఏఐ మోడల్స్‌ను సీపీయూపై సమర్థవంతంగా రన్ చేసేలా ఆప్టిమైజ్ చేసింది. ఇవి క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా మంచి పనితీరు చూపిస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక జీపీయూతో పనిలేదు!
జిరోహ్ ల్యాబ్స్ బృందం కాంపాక్ట్ ఏఐ ప్రత్యేక సామర్థ్యాలను ఈ సందర్భంగా ప్రదర్శించింది. జీపీయూపై ఏమాత్రం అధారపడకుండా, సీపీయూతోనే ఏఐ మోడల్స్ ఎలా అభివృద్ధి చేయవచ్చో ఇక్కడ ప్రదర్శించారు.

"ఒక మనిషి పరిమితమైన రంగాల్లో మాత్రమే సమర్థవంతమైన జ్ఞానాన్ని పొందగలరు. అదే ప్రకృతి మనకు నేర్పింది. అందువల్ల విశ్వంలో ఉన్న అన్ని విషయాలను గ్రహించడం అంత సులభం కాదు. ఒకవేళ ఆ ప్రయత్నాలు చేస్తే, అవి విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఐఐటీ మద్రాస్, జిరోహ్ ల్యాబ్స్ ప్రయత్నం చాలా భిన్నమైంది. మేము విభిన్న (డొమైన్) రంగాలకు అవసరమైన, కచ్చితమైన ఫలితాలను ఇచ్చే ఏఐ మోడల్స్ రూపొందించే పనిలో ఉన్నాం."
- వీ.కామకోటి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
ఇంటర్నెట్ అవసరం లేకుండా!
'కాంపాక్ట్ ఏఐ అనేది ఇంటర్నెట్ అవసరం లేకుండానే పని చేస్తుంది. ఇది ఏఐ మోడల్స్‌ను రన్ చేయడానికి అల్గోరిథమిక్‌గా, మల్టిపుల్ ఆప్టిమైజేషన్‌ను ఉపయోగించుకుంటుంది' అని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి తెలిపారు. ఈ విధంగా కాంపాక్ట్ ఏఐని ప్రపంచ సమస్యలను పరిష్కరించే గేమ్ ఛేంజర్‌గా మార్చడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
గ్రామీణ, వెనుకబడిన ప్రజల కోసం
సీఓఏఐఆర్ ద్వారా భారతదేశంలోని గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఏఐ మోడల్స్‌ను రూపొందిస్తామని ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ బి.మధుసూదనన్ తెలిపారు. క్లౌడ్ డేటా సెంటర్లు, ఎడ్జ్ డివైజ్‌ల్లో ఉండే సీపీయూలను ఉపయోగించి ఏఐ మోడల్స్‌ను రూపొందించడానికి, వాటికి శిక్షణ ఇవ్వడానికి, వాటి పనితీరును అంచనా వేయడానికి ఈ కాంపాక్ట్ ఏఐ ప్లాట్‌ఫారమ్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లు అందరికీ అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు. అయితే డేటా ప్రైవసీ, డేటా రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించకుండా ఏఐ డెవలప్‌మెంట్‌ను ప్రారంభించినట్లు కాంపాక్ట్ ఏఐ ప్లాట్‌ఫారమ్ పేర్కొంది.