IIT Guwahati Self Cleaning Fabric : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి శాస్త్రవేత్తలు తాజాగా చలికాలం కోసం ఓ ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేశారు. దానంతట అదే క్లీన్ చేసుకోవడమే ఈ వస్త్రం ప్రత్యేకత. చలి వాతావరణంలో అవసరమైనంత మేరకు మాత్రమే వేడెక్కడం దీని మరో స్పెషాలిటీ. అతి శీతల వాతావరణంలో ఎక్కువ సేపు ఉండేవారిని ఆరోగ్య సమస్యల నుంచి రక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందని సైంటిస్టులు తెలిపారు.
అతిశీతల వాతావరణమే ప్రమాదకరం
"అతిశీతల వాతావరణం ఎక్కువ సేపు గడిపితే మన ప్రాణాలకే ముప్పొస్తుంది. అంతేకాకుండా అత్యంత వేడి వాతావరణం కంటే అతిశీతల వాతావరణం వల్లే ప్రపంచంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తుంటాయి. అయితే అత్యంత శీతల వాతావరణంలో వెచ్చదనం కోసం హీటర్లు, లేయర్డ్ క్లాతింగ్ వంటివి వినియోగిస్తుంటారు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి తగినంత వెచ్చదనాన్ని అందించలేకపోవచ్చు. హీటర్ల నిర్వహణకు పెద్దఎత్తున విద్యుత్ కూడా అవసరమవుతుంది. ఇక లేయర్డ్ క్లాతింగ్ ఒక్కోసారి నాణ్యంగా ఉండకపోవచ్చు. దాన్ని శుభ్రం చేసేందుకు నీరు అవసరం. చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిలభ్యత కూడా తక్కువగానే ఉంటుంది. ఈ పరిమితులను అధిగమించే లక్ష్యంతోనే మేము ఈ సరికొత్త క్లాత్‌ను తయారు చేశాం' అని శాస్త్రవేత్తలు తెలిపారు.
కాటన్ క్లాత్లోకి నానో వైర్లను అమర్చి
కాటన్ వస్త్రంలోకి అత్యంత సన్నగా ఉండే సిల్వర్ నానో వైర్లను అమర్చి ఈ శక్తివంతమైన వస్త్రాన్ని రూపొందించామని ఐఐటీ గువాహటి ప్రొఫెసర్ ఉత్తమ్ మన్నా వెల్లడించారు. ఈ కొత్త రకం వస్త్రంలో ఉండే నానో వైర్లు, మనిషి వెంట్రుక కంటే లక్ష రెట్లు సన్నగా ఉంటాయన్నారు. దీనివల్ల ఆ వస్త్రాల నుంచి విద్యుత్ ప్రసారం జరిగే వీలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా ఈ వస్త్రం వెచ్చదనంతో పాటు మృదుత్వాన్ని, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారిపోయే స్వభావాన్ని పొందుతుందన్నారు.
కరెంట్ షాక్ తగలదు
'ఈ క్లాత్లోని సిల్వర్ నానో వైర్లు విద్యుత్, సూర్యరశ్మిలను వేడిగా మార్చగలవు. ఈ ఓల్టేజీ స్థాయి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. దీని వల్ల కరెంట్ షాక్ తగులుతుందనే ఆందోళన అస్సలు ఉండదు. సిల్వర్ నానో వైర్ల క్వాలిటీని పెంచడానికిగానూ మేం వాటికి వాటర్ రెపెల్లెంట్ కోటింగ్ వేయించాం. ఫలితంగా అవి ఆక్సిడేషన్, నీరు, మరకల నుంచి రక్షణ పొందుతాయి. దీనివల్ల అతిశీతల వాతావరణంలోనూ ఈ క్లాత్ పొడిగానే ఉండగలదు. చెమట, వాన నీరు, రక్తపు మరకలు వంటివి పడినా దీనికి డ్యామేజీ జరగదు. చిన్నపాటి బ్యాటరీ లేదా సోలార్ ఎనర్జీ ద్వారా ఈ క్లాత్‌ను వెచ్చగా ఉంచి, సగటున 10 గంటల పాటు 40 నుంచి 60 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు" అని అని ప్రొఫెసర్ ఉత్తమ్ మన్నా తెలిపారు
ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులకు
"ఈ క్లాత్‌ను మేం మోకాళ్ల, మో చేతుల బ్యాండ్‌లలో టెస్ట్ చేశాం. ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులకు ఇటువంటివి హీట్ థెరపీ అందిస్తుంటారు. మేం తయారు చేసిన వస్త్రం మరింత మెరుగైన హీట్ థెరపీని అందించగలదు. ఈ సరికొత్త వస్త్రం ఆవిష్కరణపై పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇందులోని నానో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తయారీ, ఇతరత్రా అనుబంధ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడంపై శ్రద్ధ పెడతామన్నాం' అని ప్రొఫెసర్ ఉత్తమ్ మన్నా చెప్పారు.