
ఇప్పుడు తెలుగులోనూ గూగుల్ "AI Mode"- యూజర్లకు ఇక పండగే!
గూగుల్ సెర్చ్‌లో భారతీయ భాషలకు పెద్దపీట- కొత్తగా ఏడు లాంగ్వేజెస్‌లో "AI Mode"

Published : October 8, 2025 at 2:47 PM IST
Hyderabad: టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ యూజర్లకు అదిరే అప్డేట్ అందించింది. ఇప్పుడు తన ఏఐ ఆధారిత సెర్చ్ మోడ్‌ను తెలుగుతో సహా ఏడు కొత్త భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు "గూగుల్ సెర్చ్ లైవ్" అనే కొత్త ఫీచర్‌ను ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం ప్రారంభించింది.
ఏఐ మోడ్ ఇప్పుడు తెలుగులో: గూగుల్ సెర్చ్ "AI Mode" ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో గూగుల్‌తో ఇప్పుడు మనం తెలుగులోనే మాట్లాడొచ్చు, ఏదైనా సంక్లిష్టమైన అంశాలపై తెలుగులోనే సెర్చ్ చేయొచ్చు. తద్వారా వివరణాత్మకమైన సమాధానాలను మన స్థానిక భాషలోనే పొందొచ్చు.
గూగుల్ కొన్ని నెలల క్రితమే ఈ "AI Mode"ను ప్రారంభించింది. గూగుల్ సెర్చ్‌లో అడిగే ప్రశ్నలకు స్మార్ట్ సమాధానాలను అందించేందుకు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అయితే ప్రారంభంలో దీన్ని ఇంగ్లీషు భాషకు మాత్రమే పరిమితం చేశారు. తర్వాత దీనిని హిందీలోనూ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు దీనిని ప్రపంచవ్యాప్తంగా 35 కొత్త భాషలకు విస్తరించారు.
గూగుల్ తాజా బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. గూగుల్ సెర్చ్ "AI Mode" ఇప్పుడు 40 కొత్త దేశాల్లో, 35 కొత్త భాషల్లో అందుబాటులోకి వస్తోంది. ఈ కొత్త దేశాలతో కలిపి ఇది ఇప్పుడు 200 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాలకు చేరుకుంది. ఈ అప్డేట్ భారతదేశానికి కూడా కీలకమైనది. ఎందుకంటే ఇది ఇప్పుడు 7 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది.
మరో 7 భారతీయ భాషలకు మద్దతు: గూగుల్ సెర్చ్ "AI Mode" ఇప్పుడు ఇంగ్లీష్, హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ, ఉర్దూతో సహా 7 కొత్త భారతీయ భాషలలో కూడా పనిచేస్తుంది. దీంతో మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మీ స్థానిక భాషల్లోనే గూగుల్ సెర్చ్‌కు చెందిన ఈ "AI Mode"ను వినియోగించుకోవచ్చు.
ఈ ఏడు కొత్త భారతీయ భాషలతో పాటు ఇది అరబిక్, చైనీస్, క్రొయేషియన్, చెక్, డచ్, జర్మన్, గ్రీక్, ఫ్రెంచ్, మలయ్, రష్యన్, థాయ్, వియత్నామీస్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇతర భాషలలో అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ సెర్చ్ లైవ్ ఫీచర్: అదనంగా కంపెనీ "గూగుల్ సెర్చ్ లైవ్" అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది ప్రస్తుతం భారతదేశానికి మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా మీరు టైప్ చేయడం ద్వారా మాత్రమే కాకుండా మాట్లాడటం, కెమెరాను దాని వైపు చూపించడం ద్వారా కూడా ప్రశ్నలు అడగొచ్చు.
ఉదాహరణకు మీ వద్ద కొన్ని పదార్థాలు ఉంటే వాటితో మంచి వంటకాన్ని ఎలా తయారు చేయాలో మీకు తెలియకుంటే దీని సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు కెమెరాను ఆన్ చేసి వాటిని చూపించి వాటితో వంట ఎలా చేయాలో వాయిస్ ద్వారా అడిగి తక్షణమే సమాధానం పొందవచ్చు. భారతదేశంలోని ప్రజలు ఇప్పటికే వాయిస్, విజువల్ సెర్చ్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అధునాతన "సెర్చ్ లైవ్" ఫీచర్‌ను మొదట భారతదేశంలో ప్రారంభించినట్లు గూగుల్ తెలిపింది.

