Apple WWDC 2025 Dates Announced: టెక్ దిగ్గజం యాపిల్ 2025 వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) తేదీలను ప్రకటించింది. ఈ కాన్ఫరెన్స్ జూన్ 9 నుంచి జూన్ 13, 2025 వరకు జరగనుందని వెల్లడించింది. ఇందులో కంపెనీ 'లేటెస్ట్ యాపిల్ సాఫ్ట్‌వేర్ అండ్ టెక్నాలజీల' గురించి తన ఇన్సైట్స్ను పంచుకుంటుంది. కీలక ప్రసంగంతో ప్రారంభంకానున్న ఈ వ్యక్తిగత కార్యక్రమం యాపిల్ పార్క్‌లో జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడ డెవలపర్లు కీలక ప్రసంగాన్ని వీక్షించొచ్చు. అంతేకాకుండా యాపిల్ నిపుణులతో కూడా నేరుగా మాట్లాడొచ్చు.
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఈ కాన్ఫరెన్స్ ఆన్‌లైన్ ల్యాబ్‌ల ద్వారా యాపిల్ ఇంజనీర్లు, డిజైనర్లతో సంభాషించే అవకాశాలతో పాటు వీడియో సెషన్‌లను అందిస్తుంది. ఈ సెషన్‌లను యాపిల్ డెవలపర్ యాప్, యాపిల్ డెవలపర్ వెబ్‌సైట్, యాపిల్ డెవలపర్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. యాపిల్ దీనిపై పూర్తి వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మాక్‌లు, మరిన్నింటి కోసం తదుపరి తరం OSను కంపెనీ ఆవిష్కరిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ కంటే కాస్త ఆలస్యం అయినా, AI-ఆధారిత సిరి అప్డేట్స్ గురించిన వివరాలను ఇందులో ప్రకటించే అవకాశం ఉంది.
యాపిల్ WWDC 2025లో ఏం ఆశించొచ్చు?:
యాపిల్ WWDC 2025లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ iOS 19తో పాటు మరిన్ని కొత్త డివైజ్‌ల వివరాలను పంచుకునే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలో బ్లూమ్‌బెర్గ్.. యాపిల్ ఈ ఏడాది కంపెనీ చరిత్రలో 'వన్ ఆఫ్ ది మోస్ట్ డ్రమాటిక్ సాఫ్ట్‌వేర్ ఓవర్‌హాల్స్'ని ప్లాన్ చేస్తుందని నివేదించింది. రాబోయే OS అప్‌డేట్‌లు- iOS19, iPadOS19, macOS16, watchOS అండ్ tvOS కొత్త వెర్షన్‌లు. ఇవి యాపిల్ డివైజ్‌లలో మరింత ఏకీకృత సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని సృష్టించడంపై దృష్టి పెడతాయని ఈ నివేదిక పేర్కొంది.
తదుపరి తరం యాపిల్ OS, విజన్ ప్రో హెడ్‌సెట్‌కు శక్తినిచ్చే అదే ఆపరేటింగ్ సిస్టమ్ అయిన visionOS నుంచి డిజైన్ ఎలిమెంట్‌లను ఏకీకృతం చేసే అవకాశం ఉంది. visionOS లాగానే iOS, iPadOS, macOSలలో ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్, రీడిజైన్డ్ ఇంటర్‌ఫేస్ ఎలిమెంట్స్, మరింత స్ట్రక్చర్డ్ విజువల్ హైరాకీ (Structured Visual Hierarchy) ఉండొచ్చు. అంతేకాకుండా iOS19 అప్‌డేట్‌తో యాపిల్ ఐఫోన్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ RCS మెసేజింగ్ సపోర్ట్‌ను పరిచయం చేయగలదని భావిస్తున్నారు.
యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అప్‌గ్రేడ్స్: iOS 18.4తో మొదట ఊహించిన AI-ఆధారిత సిరికి సంబంధించిన అప్‌గ్రేడ్‌లు నెక్స్ట్ మేజర్ OS రిలీజ్ వరకు వాయిదా వేయొచ్చు. ఈ అప్‌గ్రేడెట్ సిరి AI-ఆధారితంగా ఉంటుందని, మెరుగైన కాంటాక్ట్స్ అవేర్నెస్, ఆన్-స్క్రీన్ రికగ్నైజేషన్, ఇన్- యాప్ ఫంక్షనాలిటీలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది వర్చువల్ అసిస్టెంట్‌ను మరింత సహజంగా, సమర్థవంతంగా చేస్తుంది.
You’re gonna want to save the date for the week of June 9! #WWDC25 pic.twitter.com/gjzYZCkPbA
— Greg Joswiak (@gregjoz) March 25, 2025
కంపెనీ ఈ AI-ఆధారిత సిరి గురించిన వివరాలు WWDC 2025 సమయంలో షేర్ చేయొచ్చని అంతా భావిస్తున్నారు. జెమిని AIని యాపిల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్‌వర్క్‌తో విలీనం చేసేందుకు యాపిల్.. గూగుల్ సహకారం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీకి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా 9To5Google నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. గూగుల్ జెమిని AI అనేది యాపిల్ రైటింగ్ టూల్స్, సిరి ఫంక్షనాలిటీలతో పొందుపరచవచ్చు.
కొత్త డివైజ్‌లు: సాధారణంగా కంపెనీ తన వార్షిక డెవలపర్ సమావేశంలో కొత్త డివైజ్‌లను పరిచయం చేయదు కానీ అప్పుడప్పుడు అప్‌కమింగ్ డివైజ్‌ల ప్రివ్యూను ప్రదర్శిస్తుంది. కంపెనీ నుంచి ఊహించిన ఐఫోన్ 17 స్లిమ్ డివైజ్‌ను ముందస్తుగా ప్రదర్శించొచ్చని అంచనా. అంతేకాకుండా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో పరికరాలకు విస్తరించే ప్రణాళికలను యాపిల్ వెల్లడించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవలే బ్లూమ్‌బెర్గ్.. యాపిల్ వాచ్ మోడల్స్, ఎయిర్‌పాడ్‌లను ఇంటిగ్రేటెడ్ కెమెరాలతో అభివృద్ధి చేస్తోందని నివేదించింది. ఇవి యాపిల్ అధునాతన విజువల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలకు సపోర్ట్ చేస్తాయి. దీనిపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హోండా అమేజ్ vs టాటా టిగోర్- ఈ రెండింటి టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?
దేశంలో మొట్టమొదటి 'మేక్ ఇన్ ఇండియా' MRI మెషీన్- ఇకపై తక్కువ ఖర్చుతోనే వైద్యం!
EV సేల్స్‌లో టెస్లాను అధిగిమించిన BYD- 2024లో రికార్డు స్థాయిలో లాభాలు!