ETV Bharat / technology

తప్పిన పెను ప్రమాదం- భూమి వైపుగా దూసుకొచ్చిన భారీ గ్రహశకలం

భూమికి దగ్గరగా వెళ్లిన "2025 FA22"- వీడియో చూస్తే గూస్​బంప్సే!

Asteroid Passing Earth Today
Asteroid Passing Earth Today (Photo Credit- Getty Images)
author img

By ETV Bharat Tech Team

Published : September 18, 2025 at 4:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: ఎన్నో జీవరాశులకు నివాస స్థలమైన భూమి ఇవాళ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఒక పెద్ద నగరాన్ని నాశనం చేయగల గ్రహశకలం గంటకు 38,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుగా దూసుకొచ్చింది. ఈ గ్రహశకలం వాషింగ్టన్ మాన్యుమెంట్ అంత భారీగా ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీనిపేరు "2025 FA22". అయితే ఇందులో ఆనందించదగ్గ విషయం ఏంటంటే చాలా దగ్గరగా సమీపించినప్పటికీ ఇది భూమికి ఎటువంటి ముప్పును కలిగించలేదు.

ఈ గ్రహశకలం ఎంత దగ్గరగా వచ్చింది?: శాస్త్రవేత్తలు అందించిన సమాచారం ప్రకారం ఈ గ్రహశకలం భూమి నుంచి దాదాపు 523,000 మైళ్ల (842,000 కిలోమీటర్లు) దూరంలో వెళ్లింది. ఈ దూరం దాదాపు 2.2 చంద్ర దూరాలకు (Lunar Distances) సమానం లేదా భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరానికి 2.2 రెట్లు.

ఈ గ్రహశకలం ఈరోజు తెల్లవారుజామున 3:42 EDT (0742 GMT), లేదా దాదాపు 1:12 PM ISTకి భూమికి దగ్గరగా వెళ్లింది. ఈ అరుదైన సంఘటనకు సంబంధించిన దృశ్యాలను యూట్యూబ్​లోని కొన్ని ఛానెల్స్​ ప్రత్యక్ష ప్రసారం చేశాయి కూడా. ఒకవేళ ఇప్పుడు మీరు దీన్ని చూడాలనుకుంటే కింద అందించిన యూట్యూబ్​ లైవ్ వీడియోపై క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు.

2025 FA22 ఎంత పెద్దది?: ఈ గ్రహశకలం 130 నుంచి 290 మీటర్లు (427 నుంచి 951 అడుగులు) వెడల్పు ఉంటుందని అంచనా. దీనిని మార్చి 2025లో గుర్తించారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు దీనిని పర్యవేక్షిస్తూ వస్తున్నారు. దీని పరిమాణం, కక్ష్యను బట్టి దీనిని పొటెన్షియల్లీ హాజర్డస్ ఆస్ట్రాయిడ్ (PHA)గా వర్గీకరించారు. దీనర్థం ఇది భవిష్యత్తులో భూమికి దగ్గరగా రాగల ప్రమాదకరమైన గ్రహశకలం.

వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు జియాన్లూకా మాసి దీనిపై మాట్లాడారు. ఈ పరిమాణంలో ఉన్న వస్తువు సగటున ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భూమికి దగ్గరగా వస్తుందని చెప్పారు. అయితే ఈసారి ఈ గ్రహశకలం ఎటువంటి ప్రమాదం కలిగించకుండా భూమిని దాటుకుంటూ ప్రశాంతంగా వెళ్తుందని పేర్కొన్నారు.

NASA అంచనాలు: NASA ప్రకారం.. "ఈ పరిమాణంలో ఉన్న ఒక గ్రహశకలం భూమిని ఢీకొంటే 2 కిలోమీటర్ల వెడల్పు గల బిలం ఏర్పడవచ్చు. కానీ ఇది ప్రతి 20,000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఈసారి ఈ "2025 FA22" గ్రహశకలం ఎటువంటి ముప్పును కలిగించకుండా భూమికి హలో చెప్పి వెళ్లిపోతుంది."