Fake Aadhaars With AI : కృత్రిమ మేధస్సుతో(AI) జరుగుతున్న ఆవిష్కరణలు ప్రపంచ సాంకేతిక విప్లవానికి రెక్కలు జోడిస్తున్నాయి. దీనివల్ల ప్రయోజనాలతో పాటు ప్రమాదాలూ అంతమేర జరిగే సూచనలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఛాట్ జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్‌లో తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫొటో జనరేషన్ ఫీచర్‌పై సైబర్ భద్రతా నిపుణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ ద్వారా జనరేట్ చేసే ఆధార్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు, కేవైసీ ఫామ్‌లు అసలువా? నకిలీవా? అనేది వెంటనే గుర్తించడం చాలా కష్టమని చెబుతున్నారు.
దుర్వినియోగం చేసే ముప్పు
అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ (OpenAI) కంపెనీ ఛాట్ జీపీటీని తయారు చేసింది. ఈ ఏఐ టూల్‌లో అందుబాటులోకి తెచ్చిన ఫొటో జనరేషన్ ఫీచర్‌తో యూజర్లు అత్యంత వాస్తవికంగా కనిపించే ఫొటోలను జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ క్రియేటివిటీ, ప్రొడక్టివిటీల మేళవింపుగా ఉన్న మాట నిజమే. అయితే దీన్ని సైబర్ నేరగాళ్లు స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రజలను మోసం చేసేందుకు దుర్వినియోగం చేసే ముప్పు ఉంది. అచ్చం నిజమైన వాటిలా కనిపించే ఐడీ కార్డులను కేటుగాళ్లు తయారు చేసి, పెద్ద ఎత్తున మోసాలకు తెగబడే గండం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేవైసీ మోసాలతో ఎన్నో రంగాలకు చిక్కులు
ఏఐ ద్వారా జనరేట్ చేసే డాక్యుమెంట్లు వివిధ రంగాల్లో విభిన్న రకాల సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి బ్యాంకింగ్, బీమా, టెలికాం, లాజిస్టిక్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో నో యువర్ కస్టమర్ (కేవైసీ)కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి చోట్ల చలామణి చేసేందుకు అనువైన ఫేక్ ఐడీ కార్డులను సైబర్ కేటుగాళ్లు ఏఐతో తయారు చేసే అవకాశం ఉంది. ఫేక్ ఐడీ కార్డులను చూపించి అసలైన వినియోగదారుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే ముప్పు ఉంది. వివిధ రకాల ఆర్థిక నేరాలకు పాల్పడేందుకు సదరు ఏఐ జనరేటెడ్ కార్డులను సైబర్ కేటుగాళ్లు దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు.
కాలం చెల్లిన డిటెక్షన్ టూల్స్‌తో
డిజిటల్ మోసాలను గుర్తించేందుకు సాధారణంగా వాటర్ మార్కింగ్, ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు), C2PA మెటాడేటా వంటి టూల్స్‌ను వాడుతుంటారు. వీటన్నింటి కళ్లు కప్పగలిగే నూతన ఏఐ టూల్స్‌ను సైబర్ కేటుగాళ్లు వాడే అవకాశం ఉంది. అధునాతన యాంటీ-డిటెక్షన్ టూల్స్‌తో ఈ వ్యవస్థలను నేరగాళ్లు సులభంగా దాటేయగలరు. దీనివల్ల కంపెనీలు నిజమైన పత్రాలు, నకిలీ పత్రాల మధ్య తేడాను గుర్తించడం కష్టతరం అవుతుంది. అందుకే కంపెనీలు ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ డిటెక్షన్ సాఫ్ట్‌వేర్ల కొనుగోలుపై పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్పులు చేసిన, కృత్రిమంగా తయారు చేసిన ఫొటోలు, డాక్యుమెంట్లను కంపెనీలు అప్‌లోడ్ దశలోనే గుర్తించేందుకు ఈ కొత్త సాఫ్ట్‌వేర్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
ఏఐ ఆధారిత సైబర్ నేరాలు పైపైకి
అయితే, ఈ ముప్పు నకిలీ పత్రాలకే పరిమితం కాలేదు. డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలను సృష్టించడానికి ఏఐను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అచ్చం నిజమైన వాటిలా కనిపించే, వినిపించే వీడియోలు, ఆడియోలను ఏఐ జనరేట్ చేస్తోంది. ఒక్క 2024 సంవత్సరంలోనే డీప్‌ఫేక్ సంబంధిత మోసాల వల్ల ప్రపంచవ్యాప్తంగా రూ.51వేల కోట్లు (6 బిలియన్ డాలర్లకు)పైగా నష్టాలు జరిగాయని అంచనా. ఈ మోసాల కారణంగా హాంకాంగ్‌కు చెందిన ఒక బహుళజాతి కంపెనీ రూ.193 కోట్లు (22.5 మిలియన్ డాలర్ల) భారీ నష్టాన్ని చవిచూసింది. ఏఐ ఆధారిత ముప్పులు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ పై-ల్యాబ్స్ వ్యవస్థాపకుడు అంకుష్ తివారీ తెలిపారు. 2028 నాటికి జరగబోయే సైబర్ దాడులలో డీప్‌ఫేక్‌లు, సోషల్ ఇంజినీరింగ్ వ్యూహాలే దాదాపు 40 శాతం ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.