Yuva Story On Handball Player Satya In Vijayawada: హ్యాండ్‌బాల్ క్రీడలో ఎక్కువ పొడుగువారే కనిపిస్తారు. కానీ పొట్టిగా కనిపించే ఆ అమ్మాయికి ఎత్తు ఏ మాత్రం అడ్డంకి కాలేదు. చలాకీలా లంకించి మెరికల్లా కదులుతూ సునాయాసంగా లక్ష్యం చేరుకోవడం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయస్థాయిలో పతకాలతో పాటు బెస్ట్ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డు అందుకుని ఔరా అనిపిస్తోంది. మరి, ఆ విద్యార్థిని విజయ ప్రస్థానం ఈ కథనంలో చూద్దాం.
చిన్నతనం నుంచి క్రీడలపై ఉన్న మక్కువతో వచ్చిన ఏ అవకాశం వదులుకోకుండా అన్నింటిలో పాల్గొని విజయాల వైపు అడుగులేసింది ఈ అమ్మాయి. అలానే హ్యాండ్‌బాల్‌లో మెళకువలు నేర్చుకుని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు, అవార్డులు, ప్రశంసలతో అందరితో శభాష్ అనిపించుకుంటోంది.
నేపథ్యం: క్రీడా మైదానంలో బంతితో చెడుగుడు ఆడుతున్న ఈ యువతి బోయి సత్య. విజయవాడకు చెందిన కనకరాజు, ఆదిలక్ష్మీ దంపతుల కుమార్తె. ప్రస్తుతం కేబీఎన్ కళాశాలలో డిగ్రీ మెుదటి ఏడాది చదువుతోంది. చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులూ ప్రోత్సహించారు. ఐదో తరగతిలో ఉన్నప్పుడే క్రీడల్లో పాల్గొని మంచి ప్రతిభ చూపేదీ యువతి. ఈమె ఆసక్తి గుర్తించిన రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఉచితంగా శిక్షణ అవకాశం కల్పించింది. మైలవరంలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి హాస్టల్‌కు పంపించి ఉచిత విద్య, శిక్షణ అందించారు.
అలా చదువుకుంటూనే హ్యాండ్‌బాల్‌లో కఠోరన సాధన చేసింది సత్య. 2019 నుంచి ఇప్పటి వరకు 6 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణ, దిల్లీ, కేరళ, సేలంలో నిర్వహించిన అంత:రాష్ట్ర పోటీల్లో పతకాలు, అవార్డులు, ప్రశంసలు అందుకుంది. హ్యాండ్‌బాల్‌తో సత్య ప్రతిభకు బెస్ట్ ప్లేయర్ అవార్డుతో సత్కరించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తండ్రి మార్షల్ ఆర్ట్స్‌లో మాస్టర్ కావడంతో చిన్నతనం నుంచే ఆ విభాగంలోనూ పట్టు సాధించింది. స్విమ్మింగ్‌లోనూ రాణిస్తూ పతకాలు, అవార్డులు కైవసం చేసుకుంటోంది.
పేదరికాన్ని అధిగమించి తమ విద్యార్థిని చదువు, క్రీడల్లో విజేతగా నిలవడం హర్షించదగ్గ విషయమని చెబుతున్నారు ఉపాధ్యాయులు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరికొంత మంది విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు. చదువు కొనసాగిస్తూనే జాతీయస్థాయి పోటీల్లో మరిన్ని పతకాలు, అవార్డులు తీసుకొస్తానని చెబుతోంది సత్య. క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమంటోంది.
''నాకు చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఐదో తరగతిలో ఉన్నప్పటి నుంచే క్రీడల్లో పాల్గొంటున్నాను. నేను రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు, అవార్డులను గెలుచుకున్నాను. అంతే కాకుండా నాకు స్విమ్మింగ్ అంటే కూడా ఆసక్తి ఉంది. భవిష్యత్తులో బాగా చదువుకుని క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం''-బోయి సత్య, హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి
''ఆరు వేలకు పైగా ఉన్న కేబీఎన్ కళాశాలలో మూడు వేల మంది అమ్మాయిలే ఉన్నారు. విద్యార్థిని సత్యకు ఉత్తమ మహిళా క్రీడాకారిణిగా సీఎం చేతుల మీదుగా ఆమె అవార్డును సైతం అందుకుంది. భవిష్యత్తులో సత్య మరింత ఉన్నత స్థాయికి వెళ్లి ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని మా కళాశాల యాజమాన్యం తరపున కోరుకుంటున్నాము''-జి.కృష్ణవేణి, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్
అనారోగ్యం నుంచి రైతులకు రక్షణ - అందరి మన్ననలు పొందుతున్న శ్రీయ
బరిలోకి దిగితే పతకం సాధించాల్సిందే - సత్తా చాటుతున్న స్విమ్మర్, వైద్యురాలు సాయిశ్రీ