Yuva Special Story On Doctor Cum Swimmer: ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చాటాలనేది యువ క్రీడాకారుల కల. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. తీవ్ర పోటీని ఎదుర్కొని పతకాల సాధించే దిశగా అడుగులు వేస్తుంటారు. ఆ కోవకు చెందిన యువతే బెజవాడకు చెందిన సాయిశ్రీ. చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువతో స్విమ్మింగ్‌లో కఠోర సాధన చేసి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో 100 పతకాలు, అవార్డులు సాధించింది. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో నిరుపేదలకు నిరంతరం వైద్య సేవలందిస్తూ ఒలింపిక్స్ పోటీలకు సన్నద్ధమవుతోంది.
రెండు రంగాల్లో ప్రావీణ్యత : క్రీడలు, చదువులో రాణించాలంటే శ్రమ, పట్టుదల, కృషి, కార్యచరణ ఉండాలి. ఎవరైనా సరే రెండింట్లో ఒక్కదానిపైనే దృష్టి పెడతారు. ఆ యువతి మాత్రం అటు క్రీడలు, ఇటు చదువులో రాణిస్తూ వందల పతకాలు, అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకుంది. అలాగే గిరిజన ప్రాంతాల్లోని నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలను అందుకుంటుంది.
నేపథ్యం: విజయవాడకు చెందిన మధుసూధన్‌రావు, ధనలక్ష్మీ దంపతుల ద్వితీయ కుమార్తె సాయి శ్రీ. వృత్తి రీత్యా అల్లూరి జిల్లా పాడేరు మండలం మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా పని చేస్తోంది. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు క్రీడల వైపు ప్రోత్సహించడంతో బరిలోకి దిగితే పతకం సాధించాల్సిందే అన్నట్లుగా రాటు తేలింది. రాష్ట్ర, జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో 100 పతకాలు సాధిస్తే అందులో 50 స్వర్ణాలే ఉండటం విశేషం.
క్రీడల్లో రాణిస్తూ చదువును ఏ మాత్రం అలసత్వం చేయలేదు. కష్టపడి చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఔరా అనిపించింది. అఖిల భారత ఉద్యోగుల క్రీడాపోటీల్లో అద్భుత ప్రతిభను చూపి ఫ్రీ స్టైల్‌ల్లో 50, 100 మీటర్ల విభాగంలో విజయం సాధించడంతో పాటు దిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటిందీ యువతి.
4 ఏళ్లకే స్విమ్మింగ్: తండ్రికి క్రీడలపై ఉన్న ఆసక్తితో 4 ఏళ్ల వయసులోనే స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకున్నానని చెబుతోంది సాయిశ్రీ. ఒలింపిక్ స్విమ్మర్ ఫిలిప్స్‌ను ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులు, సోదరి ప్రోత్సాహంతో క్రీడల్లో ముందుకు వెళ్తున్నట్లు వివరించింది. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి కర్ణాటక, ఏపీలో జరిగిన పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది సాయి శ్రీ.
గిరిజన ప్రాంతాల్లోని యువత ఎక్కువ శాతం శారీరకంగా బలంగా ఉంటారు. కానీ పనులపై తప్ప చదువు, క్రీడలపై దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వం వారిని క్రీడల వైపు మళ్లిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెబుతుంది సాయి శ్రీ. చిన్నతనం నుంచే పిల్లలకు చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించాలని సూచించింది.
ప్రముఖుల ప్రశంసలు: ఆరేళ్ల వయసులో కృష్ణా నదిలో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపి అవార్డుతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. చిన్నతనం నుంచి ఒకవైపు క్రీడలు, మరోవైపు చదువులో రాణిస్తూనే ఎన్సీసీ క్యాడెట్‌గా సైతం మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీ సర్టిఫికేట్ సాధించి రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో అద్భుత ప్రదర్శనతో అందరి చేత శభాష్ అనిపించుకుంది.
క్రీడలు, చదువును బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తే కచ్చితంగా విజయం సొంతమవుతుందని చెబుతున్నారు జిల్లా వైద్యాధికారి జమల్ బాషా. స్విమ్మింగ్‌లో రాష్ట్ర, జాతీయస్థాయిలో సాయి శ్రీ పతకాలు సాధించడం పట్ల తోటి వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి ఆమెను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే దేశానికి మంచి పేరుతో పాటు పతకాలు సాధిస్తారు. తనకు ఆర్థికంగా తోడ్పాటునిస్తే ఒలిపింక్స్‌లో స్వర్ణం తీసుకొస్తానని సాయి శ్రీ చెబుతుంది.
''4 ఏళ్ల వయసులోనే స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. తల్లిదండ్రులు, సోదరి ప్రోత్సాహంతో క్రీడల్లో ముందుకు వెళ్తున్నాను. గిరిజన ప్రాంతాల్లోని యువత ఎక్కువ శాతం శారీరకంగా బలంగా ఉంటారు. కానీ పనులపై తప్ప చదువు, క్రీడలపై దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వం వారిని క్రీడల వైపు మళ్లిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. చిన్నతనం నుంచే పిల్లలకు చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించాలి''-సాయిశ్రీ, స్విమ్మర్, డాక్టర్,మన్యం జిల్లా
''క్రీడలు, చదువును బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తే కచ్చితంగా విజయం సొంతమవుతుంది. స్విమ్మింగ్‌లో రాష్ట్ర, జాతీయస్థాయిలో సాయి శ్రీ పతకాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి విద్యార్థి ఆమెను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి''-జమల్ బాషా,జిల్లా వైద్యాధికారి
విధి వెక్కిరించినా విజయం సాధించింది - స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్‌లో రాణిస్తున్న విజయవాడ యువతి
కష్టపడింది - కల నెరవేర్చుకుంది - గీతా భార్గవి విజయగాథ ఇది