High Court on YSRCP MP Mithun Reddy Petition : మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తనను విచారించే ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 19న విచారణ సందర్భంగా అధికారులు తనపై చేయి చేసుకుని, దుర్భాషలాడే ప్రమాదం ఉందని మిథున్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం మిథున్‌రెడ్డి వాంగ్మూలం నమోదు ప్రక్రియను సీసీ టీవీ కెమెరాలున్న ప్రదేశంలో నిర్వహించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. సిట్ కార్యాలయానికి ఇద్దరు న్యాయవాదులతో వెళ్లేందుకు మిథున్‌రెడ్డికి అనుమతిచ్చింది. విచారణ సమయంలో ఒక్క న్యాయవాది మాత్రమే, అదీ పది అడుగుల దూరంలో ఉండాలని స్పష్టం చేసింది.
వాంగ్మూలం నమోదు ప్రక్రియలో న్యాయవాది జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. సీఐడీ నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో తనను న్యాయవాదుల సమక్షంలో విచారించాలని, ఆ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ సమయంలో పిటిషనర్‌పై చేయిచేసుకుని, దుర్భాషలాడే ప్రమాదం ఉందన్నారు. విచారణకు న్యాయవాదులను అనుమతించాలని, ఆ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోరారు. రికార్డింగ్‌కు సుప్రీంకోర్టు, హైకోర్టులు పలు సందర్భాల్లో ఉత్తర్వులిచ్చాయన్నారు.
అది తప్పనిసరి కాదు: సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పీపీ ఎం. లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. విచారణ ప్రక్రియను వీడియో, ఆడియో రికార్డు చేయలా వద్దా అనేది దర్యాప్తు అధికారి (ఐవో) విచక్షణాధికారమేనని స్పష్టం చేశారు. రికార్డు చేయడం తప్పనిసరని ఏ కోర్టూ ఇప్పటి వరకు ఉత్తర్వులివ్వలేదన్నారు. న్యాయవాదులు నిర్దిష్ట దూరంలో ఉండి విచారణ ప్రక్రియను పరిశీలించేందుకు తమకు అభ్యంతరం లేదని, కానీ వారు విచారణకు అవరోధం కలిగించకుండా తగిన ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డింగ్‌కు ఆదేశించలేమని తేల్చిచెప్పారు.
వైఎస్సార్సీపీ లిక్కర్ స్కామ్ - రాజ్ కసిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు