YSRCP Leaders Granite Quarries Scam: వైఎస్సార్సీపీ హయంలో రాష్ట్రంలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయనో పేరోందిన నేత, ఆయన కుమారుడు దేశ రాజకీయాలలో ఉన్న నేత. వీరిది అంతులేని ధన దాహం. అధికారం ఉన్నన్ని రోజులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదేళ్లపాటు వారి దోపిడీకి పట్ట పగ్గాలు లేకుండా పోవడంతో ఆ తండ్రీకుమారులు ఆరాచక శక్తులుగా మారారు. చెరువులు, కొండలు, నదులు, అడవులు ఇలా అన్నింటినీ చెరబట్టి సహజవనరుల్ని యథేచ్చగా దోచేశారు. ప్రైవేటు వ్యక్తుల భూములను కబ్జా చేసిన వీరు చివరకు ఓ బీజేపీ నేత క్వారీని భయభ్రాంతులకు గురి చేసి స్వాధీనం చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తులన్నీ అమ్ముకుని తెచ్చుకున్న గ్రానైట్ క్వారీ లీజును గత ప్రభుత్వంలో బెదిరించి, గ్రానైట్‌ను దోచేసి మొత్తంగా 100 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడిన తీరుపై ప్రత్యేక కథనం.
జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు: వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరించి గుంజుకున్న తమ గ్రానైట్ లీజును తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా నాడు అధికారులెవరూ సహకరించలేదని చిత్తూరు జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి, బీజేపీ నేత కుమారుడు శశాంక్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. చిత్తూరు జిల్లా కమ్మపల్లి రక్షిత ఆటవీ ప్రాంతంలో దాదాపు 100 కోట్ల విలువైన గ్రానైట్‌ను యజమానులుగా ఉన్న తమకు తెలియకుండా తమిళనాడుకు అక్రమంగా తరిలించి అమ్మేసుకున్నారని ఆరోపించాడు. అనుమతులు తమపేరు మీదే ఉన్నందున రూ. 40 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీస్ వచ్చిందని తెలిపారు. పెద్దిరెడ్డి దందాను అడ్డుకుని క్వారీ తమకు దక్కేలా చూడాలని అధికారులను తాను కోరుతుంటే, కూటమి నేతలే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పర్మిట్లు నిలిపేసినా తరలింపు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది సెప్టెంబరు వరకు గ్రానైట్ పర్మిట్లు నిలిపేసినా పాత పర్మిట్లను కలర్ జిరాక్స్ తీయించి, పాత తేదీలు వేసి యాదమరి నుంచి అక్రమంగా తరలించారు. రెండు నెలల కిందట ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆటవీశాఖ అధికారులు స్పందించి 136 గ్రానైట్ బ్లాక్లను సీజ్ చేశారు. అయితే వారు ఇవ్వన్ని లెక్క చేయకుండా క్రిష్ణగిరికి 15 కోట్ల రూపాయల గ్రానైట్ బ్లాక్లను తరలించారు. రెండు రోజుల క్రితం గనులు, అటవీశాఖ అధికారులు రక్షిత అటవీ ప్రాంతంలోని గని వద్దకు వెళ్లి సర్వే చేశారు. ఈ ఉదంతంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి చర్యలు తీసుకోవాలని శశాంక్ ప్రసాద్ కోరుతున్నారు.
ఐటీ సలహాదారుగా పనిచేసిన తనకు ఎక్సైజ్ కేసుతో సంబంధమేంటి?: రాజ్ కసిరెడ్డి రివర్స్ జిత్తులు
వడ్డీ చెల్లించలేదని రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకుడు - పోలీసు కేసు నమోదు