YSRCP Leaders Get Agitated and Stone Pelting On Police : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పర్యటనలో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు రెచ్చిపోయారు. స్థానిక నాయకులు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలతో పాటు రామగిరి సరిహద్దులోని కర్ణాటక గ్రామాల నుంచి జనాలను కుంటిమద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు తరలించి బీభత్సం సృష్టించారు. జగన్ హెలికాప్టర్ ల్యాండ్ కాగానే ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులనూ నెట్టేసి ముందుకు దూసుకెళ్లారు.
పోలీసులపై రాళ్ల దాడి : ఇదే క్రమంలో మద్యం మత్తులో ఉన్న కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. జగన్ కిందకు దిగకుండానే హెలికాప్టర్ వద్దకు చేరుకున్న కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు, నాయకుల తోపులాటలో హెలికాప్టర్ దెబ్బతిని సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ప్రచారం చేశారు. దీంతో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ హెలికాప్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలో బెంగళూరు బయలుదేరి వెళ్లారు.
రామగిరికి జగన్ వస్తున్న సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు జనసమీకరణలో పోటీ పడ్డారు. 14 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నాయకుడికి లక్ష్యాలు విధించి జనాలను తరలించారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మరీ జనాలను రామగిరి తరలించారు. ముందుగానే మద్యం, డబ్బులు పంపిణీ చేసి జనాలను వాహనాల్లో ఎక్కించారు. గుంతకల్లుకు చెందిన నాయకులు జనాలకు డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ముందస్తు ప్రణాళికలో భాగమేనా? : జగన్ హెలికాప్టర్ వద్దకు వైఎస్సార్సీపీ శ్రేణులు దూసుకెళ్లడం పోలీసులు భద్రతా వైఫల్యంగా ఆ పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. కార్యకర్తలు హెలికాప్టర్ తలుపులు, రెక్కలపై కొట్టడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు చెప్పుకొచ్చారు. అందులో తిరిగి ప్రయాణించడం సురక్షితం కాదని సుమారు గంటన్నర తర్వాత జగన్ లేకుండానే హెలికాప్టర్ వెళ్లిపోయింది.
అయితే ఇదంతా వైఎస్సార్సీపీ నాయకులు ముందస్తు ప్రణాళికలో భాగంగానే హెలికాప్టర్ డ్రామా ఆడినట్లు పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. జగన్ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు జగన్ హెలికాప్టర్‌లో కాకుండా రోడ్డుమార్గంలోనే బెంగళూరుకు వెళతారని చర్చించినట్లు పోలీసుల దృష్టికి వచ్చిందంటున్నారు. హెలికాప్టర్‌లో నిజంగానే సాంకేతిక సమస్యలు తలెత్తి ఉంటే ఎలాంటి మరమ్మతులు చేయకుండా బెంగళూరుకు ఎలా వెళ్లిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హెలిప్యాడ్ వద్దకు భారీగా జనం : మాజీ సీఎం జగన్ పర్యటనలో తమ వైపు నుంచి ఎక్కడా భద్రతా వైఫల్యం లేదని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న స్పష్టం చేశారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. "ఆయన జడ్‌ప్లస్ కేటగిరికి అనుగుణంగానే భద్రతా ఏర్పాట్లు చేశాం. ఇద్దరు ఎస్పీల పర్యవేక్షణలో 1,100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. వైఎస్సార్సీపీ నాయకులకు ఎంత చెప్పినా వినకుండా హెలిప్యాడ్ వద్దకు జనాన్ని తరలించారు. ఏదో విధంగా హెలిప్యాడ్ వద్దకు చేరుకోవాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పార్టీ శ్రేణులకు చెప్పడంతోనే గందరగోళం నెలకొంది. హెలిప్యాడ్ వద్ద జనం భారీగా గుమిగూడారు.
హెలిప్యాడ్ వద్ద సుమారు 150 మంది పోలీసులతో తొలుత భద్రత ఏర్పాటు చేశాం. ఆ తర్వాత జనం ఎక్కువవడంతో మరో 100 మందితో భద్రత పెంచాం. కానీ, జనమంతా ఒక్కసారిగా దూసుకురావడంతో చిన్నపాటి తోపులాట జరిగింది. వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినా పోలీసులు సంయమనం పాటించారు. హెలిప్యాడ్ వద్ద కొంతమంది చాపర్ డోర్‌ని లాగడంతో అది కొంత దెబ్బతింది. దీంతో పైలట్లు వీవీఐపీనీ తీసుకువెళ్లలేమని చెప్పారు. అందువల్ల జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళ్లారు. ఎక్కడా హెలిప్యాడ్‌పై రాళ్లు కానీ కర్రలు కానీ వేయలేదు. ఈ విషయాన్ని పైలట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అన్ని వీడియో ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నాం. హెలిప్యాడ్ వద్ద ఘటనపై చట్టపరంగా వ్యవహరిస్తున్నాం" అని ఎస్పీ రత్న తెలిపారు.
యూనిఫాంని కష్టపడి సాధించాం : పోలీసు అధికారుల బట్టలు విప్పిస్తామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా ఎస్పీ స్పందిస్తూ "పోలీస్ యూనిఫాంని మేము కష్టపడి సాధించాం. ఇది ఎవరో మాకు ఇచ్చింది కాదు. ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. లింగమయ్య భార్యను బెదిరించి సంతకాలు పెట్టించామనేది కూడా అవాస్తవం. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు కట్టాం. లింగమయ్య హత్య జరిగిన 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశాం" అని ఎస్పీ రత్న స్పష్టం చేశారు.
పక్కా ప్రణాళికతో వ్యవహరించారు : రాప్తాడు పర్యటనలో కావాలనే గొడవలు సృష్టించి ఘర్షణలు జరిగేలా చేసేందుకే మాజీ సీఎం జగన్ పక్కా ప్రణాళికతో వ్యవహరించారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగన్ పర్యటనకు రెండురోజుల ముందు నుంచే ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆమె ఆరోపించారు. గొడవలు జరిగే అవకాశం ఉందనే నిఘావర్గాల సమాచారంతోనే 11వందల మంది పోలీసుల్ని మోహరించామన్నారు. అయినా డబ్బులిచ్చి వైసీపీ కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారని కానీ తాము సంయమనం పాటించామని చెప్పారు.
పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ముందుగానే జగన్ నిర్ణయించుకున్నారని కానీ గొడవల్ని సృష్టించి దాన్ని పోలీసులు, ప్రభుత్వంపై నెట్టేందుకే హెలికాప్టర్ సమస్య అని నాటకం ఆడారని అనిత తెలిపారు. కాసేపటికే అదే హెలికాప్టర్‌లో పైలట్ ఎలా వెళ్లిపోయాడని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. కారుమూరి నాగేశ్వరరావు లాంటి నేతల్ని అదుపులో పెట్టుకోకపోతే 11 నుంచి సున్నాకి పడిపోవడం ఖాయమనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని అనిత స్పష్టం చేశారు.
కానిస్టేబుల్‌కు అస్వస్థత : జగన్ పర్యటనలో హెలిప్యాడ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రంగారెడ్డి అనే కానిస్టేబుల్ అస్వస్థతకు గురైయ్యారు. ఆయన అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆసుపత్రికి వచ్చి కానిస్టేబుల్ రంగారెడ్డిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి త్వరగా కోలుకునే విధంగా వైద్యం అందించాలని వారికి సూచించారు. బాధిత కానిస్టేబుల్ కుటుంబసభ్యులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జగన్ పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు.
'ఆ రోజు జనాల్ని చూసి ఆవేశంలో పాస్టర్‌ది హత్య అన్నాను'-కానీ!
వడ్డీ చెల్లించలేదని రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకుడు - పోలీసు కేసు నమోదు