Fourteen Days Remand for Ahmed Basha : వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కువైట్‌కు వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న ఆయణ్ని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని కడప పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి ఆయనను కడప తీసుకొచ్చిన పోలీసులు ఇవాళ సుమారు 8 గంటలపాటు డీటీసీలో విచారించారు.
విచారణ అనంతరం అహ్మద్ బాషాను రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత ఆయణ్ని కడప కోర్టులో హాజరపరిచారు. ఈ క్రమంలో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అహ్మద్ బాషాకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కడప జైలుకు పోలీసులు తరలించారు.
YSRCP Leader Ahmed Basha Case : 2022లో కడప వినాయకనగర్‌లో తలెత్తిన ఓ స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా తన అనుచరులతో కలిసి దాడి చేశారు. ఈ ఘర్షణలో ముస్తాక్ కాలు విరిగి రిమ్స్‌లో వారం పాటు చికిత్స తీసుకున్నాడు. ఈ మేరకు అహ్మద్ బాషాతో పాటు మరికొందరిపై కడప పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయినా ఆయనపై వైఎస్సార్సీపీ సర్కార్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డిని అహ్మద్ బాషా దూషించారు. దీనిపై కూడా అతనిపై కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను అరెస్టు చేస్తారన్న భయంతో అహ్మద్ బాషా దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు. రంజాన్ నేపథ్యంలో ఇటీవల కడపకు వచ్చారు. శనివారం రాత్రి తిరిగి వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి చేరుకోగా అప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఇమిగ్రేషన్ అధికారులు ఆయణ్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అహ్మద్‌పై కడప చిన్నచౌకు పోలీస్ స్టేషన్, వన్ టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసులు ఉన్నట్లు సమాచారం.
విమర్శిస్తే దాడులు - ప్రశ్నిస్తే వేధింపులు - వంశీ గ్యాంగ్ అకృత్యాలు