Gorantla Madhav Case Latest Updates: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో మాధవ్‌ను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టే క్రమంలో మాధవ్ హంగామా సృష్టించారు. అనంతరం కోర్టు వద్ద సైతం ఇదే స్థాయిలో రెచ్చిపోవడం గమనార్హం.
పోలీసులపై మాధవ్ జులుం: పోలీస్ అధికారిగా ఉంటూ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ గుంటూరు పోలీసులతో వ్యవహరించిన తీరు తీవ్ర వివాదస్పదమైంది. వైఎస్ భారతిని దూషించిన చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా దాడికి పాల్పడిన మాధవ్‌తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వీరందరినీ శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టేందుకు గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు.
మిగిలిన వారు వాహనం దిగి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే గదిలోకి పోలీసులతో వచ్చారు. మాధవ్ మాత్రం వాహనం దిగేందుకు నిరాకరించారు. తాను ఎంపీగా పనిచేశానని తనను మీడియా ముందు ఎలా నిల్చోబెడతారంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు తమాషా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు మిగతా ఐదుగురిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. పోలీస్ కస్టడీలో ఉన్న కిరణ్‌పై మాధవ్ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
గోరంట్ల మాధవ్‌కు రిమాండ్: నిందితులను ఎస్పీ కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా కోర్టుకు తరలించారు. అయితే మాధవ్‌ను కూడా మీడియా ముందు ప్రవేశ పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. దీంతో కోర్టు వద్ద నుంచి మాధవ్‌ను వెనక్కి తీసుకెళ్లాలని పోలీసులు యత్నించారు. కోర్టు వద్దకు వచ్చిన తర్వాత మళ్లీ వెనక్కి ఎందుకు తీసుకెళ్తున్నారని మాధవ్ కేకలు వేశారు. అప్పటికే కోర్టు వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున కూడా పోలీసులకు అడ్డుతగిలారు.
మాధవ్ తరపున వాదించేందుకు వచ్చిన న్యాయవాదులు కూడా పోలీసులను నిలువరించారు. దీంతో మాధవ్ సహా మిగతా ఐదుగురిని గుంటూరు జిల్లా మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేట్ జి.స్రవంతి ఉత్తర్వులిచ్చారు. అనంతరం పోలీసులు వారిని రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు.
పోలీసుల తీరుపై విమర్శలు: మాధవ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా ఆ సమయంలో ఆయన ఫోన్ మాట్లాడేందుకు పోలీసులు అవకాశం ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. రామగిరి మండల మాజీ ఎంపీపీ తిమ్మప్ప ఫోన్ ఇవ్వగా మాధవ్ మాట్లాడినట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఆ పార్టీ నాయకుడు కలిసి ఫోన్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి.
''ప్రభుత్వ అధికారులు పనిచేయడాన్ని ఆపడం, వారిపై దాడి చేయడం, తరువాత అసభ్యంగా దూషించడం, ప్రభుత్వ వస్తువులను ధ్వంసం చేయడం వంటి పలు సెక్షన్ల కిెంద గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇతనిపై గతంలో 5 కేసులున్నాయి''- సతీష్‌కుమార్, గుంటూరు జిల్లా ఎస్పీ
పోలీసు విధులకు ఆటంకం - గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు