Protest in Tirumala Queue Lines : టీటీడీకి వ్యతిరేకంగా శుక్రవారం తిరుమలలో నినాదాలు చేసిన కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన అచ్చారావు వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు అనుచరుడు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అతను ఛైర్మన్‌గా ఉన్నప్పుడు వేణుగోపాలస్వామి నూతన ఆలయ నిర్మాణానికి టీటీడీ నుంచి రూ.50 లక్షలు మంజూరయ్యాయి.
అచ్చారావు గతంలో తిరుమల చాలాసార్లు వెళ్లారని సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఆయన తెలుసని, కావాలనే తిరుమల ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఇలా చేశారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నినాదాలు చేసిన వీడియోలో వైఎస్సార్సీపీకి చెందిన తిమ్మాపురం సర్పంచి బెజవాడ సత్యనారాయణ ఉన్నారు. నినాదాలు చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు గుర్తించినట్టు సమాచారం. అచ్చారావుపై తిరుమల పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు.
Facilities Row at Tirumala : నిరసన తెలిపితే త్వరగా దర్శనం చేయిస్తారనుకున్నా అంటూ అచ్చారావు టీటీడీకి వ్యతిరేకంగా చేసిన నినాదాలకు క్షమాపణలు చెప్పారు. శ్రీవారి సన్నిధిలో ఇలా చేయడం తప్పేనని అంగికరించారు. నినాదాలు చేసిన చోటుకు దగ్గర్లోనే తనకు పాలు, అన్నప్రసాదాలు అందాయని వెల్లడించారు. భక్తులను రెచ్చగొట్టి వీడియోలు తీసి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపడతామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కొంతగాలంగా వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తుందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అశిస్తోందని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ పేటీఎం బ్యాచ్ అచ్చారావుతో డ్రామా ఆడించి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని మండిపడ్డారు. టీటీడీపై అసత్య ప్రచారం చేస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు.
''క్యూలైన్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఉదయం నుంచి అనారోగ్యంతో ఉండటం వలన దర్శనం త్వరగా అవుతుందా లేదా అనే ఆందోళనతో నేను అలా ప్రవర్తించాను. ఆ తర్వాత భక్తులందరికీ పాలు, ఆహార పదార్ధాలు అందాయి. నేను ఇలా ప్రవర్తించినందుకు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నాను. దీనిపై టీటీడీకి క్షమాపణలు కోరుతున్నాను''- అచ్చారావు, వైఎస్సార్సీపీ నాయకుడు
''భక్తులను రెచ్చగొట్టి వీడియోలు తీసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపడతాం. ఇది ప్రజల నమ్మకానికి సంబంధించిన విషయం. దైవత్వానికి సంబంధించిన విషయం. అంతే కాకుండా దీనిపై చట్టపరంగా వెళ్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం'' -వెంకయ్య చౌదరి,టీటీడీ అదనపు ఈవో
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు: టీటీడీ ఏఈవో
తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం - పాల్గొన్న డీజీపీ, టీటీడీ ఈవో