Youth are Suffering Severely Due To Gambling Apps On Social Media : సామాజిక మాధ్యమాల్లో వచ్చే జూదం యాప్‌ల కారణంగా చాలా మంది అప్పుల్లో మునిగిపోతున్నారు. వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువత చదువుకు, కెరీర్‌క దూరమవుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూస్తూ : కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన యువకుడు సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూస్తున్న క్రమంలో ఓ యూట్యూబర్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు సంపాదించవచ్చని చెప్పడం విన్నాడు. దానిని డౌన్ లోడ్ చేసి పందేలు కాయడంతో తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు బంగారు నగలు అమ్మి అప్పులు తీర్చారు.
అమలాపురం పట్టణానికి చెందిన మహిళ డేటింగ్ యాప్‌లో గుర్తు తెలియని యువకుడితో పరిచయం పెంచుకుంది. అతని ప్రవర్తనలో మార్పు రావడంతో దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న ఆ యువకుడు గుంటూరు నుంచి వచ్చి తనతో చాటింగ్ చేసిన మహిళ అనుకుని వేరే వివాహితను హత్యచేశాడు. ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే.
యూట్యూబర్ అరెస్ట్ : గత ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఓ యూట్యూబర్ జూదం యాప్‌లకు ప్రచారం చేయడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాజాగా మన రాష్ట్ర పోలీసులు విశాఖకు చెందిన ఓ ప్రముఖ యూట్యూబర్‌ను సైతం ఇదే కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు.
గాలం వేస్తారు జాగ్రత్త..
- జూదం యాప్‌ను డౌన్‌లోడ్ చేయకూడదు. వీటి ద్వారా ఫోన్లోని వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయవచ్చు.
- బెట్టింగ్ యాప్స్‌లో ఆన్‌లైన్ పేమెంట్ చేసేందుకు బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు వివరాలు సేకరించి వాటి ఆధారంగా మోసాలకు పాల్పడతారు.
- యాప్ లింకులు ఓపెన్ చేసిన వెంటనే కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓటీపీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెబితే తక్షణం బ్యాంకులోని నగదు మొత్తం ఊడ్చేస్తారు.
చట్టరీత్యా నేరం : సామాజిక మాధ్యమాల ద్వారా జూదానికి సంబంధించిన యాప్‌లను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం అని పోలీసులు చెబుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరూ అలాంటి యాప్‌లను చరవాణిల్లో నిక్షిప్తం చేయవద్దని సూచిస్తున్నారు.
'ఆన్‌లైన్ బెట్టింగ్'పై కేంద్రం సీరియస్.. ఇక అవన్నీ బంద్!
బెట్టింగ్ యాప్‌లు హానికరం - ప్రమోషన్లపై చట్టాలు ఏమంటున్నాయి ?