Young Women Achieved Three Bank Jobs : తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన ఓ యువతి ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించి వారి కష్టాన్ని తీర్చాలని నిశ్చయించుకుంది. ప్రయత్నలోపం లేకుండా రోజుకు 8 గంటలపాటు చదివి ఏకంగా మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించింది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓకేసారి మూడు ప్రభుత్వ కొలువులు సాధించడంతో ఆ యువతి అందరి మన్ననలు పొందుతోంది.
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన బొత్స గాయత్రి ఒకేసారి మూడు బ్యాంకు కొలువులు సాధించి సత్తాచాటింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో యూనియన్ బ్యాంకు పీవోగా, కెనరా బ్యాంకు క్లర్కుగా, ఐడీబీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికైంది. దీంతో తల్లిదండ్రులు హరికృష్ణ, శ్రీదేవి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గాయత్రి తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో యూబీఐలో పీవోగా ఉద్యోగంలో చేరినట్లు తెలిపారు. బాడంగి మండలం బొత్సవానివలసకు చెందిన జేసీబీ చోదకుడు హరికృష్ణ పిల్లల చదువు కోసం 20 ఏళ్ల క్రితం బొబ్బిలిలో స్థిరపడ్డారు. ఇద్దరు ఆడపిల్లలున్నా వారిని చదివించి, ప్రయోజకుల్ని చేయాలని ఎంతో కష్టపడ్డారు. స్థానికంగా బొబ్బిలిలోనే డిగ్రీ వరకు చదివించారు.
గాయత్రికి బ్యాంకు ఉద్యోగంపై ఉన్న ఆసక్తి తెలుసుకున్న తండ్రి విజయవాడలోని ఓ కోచింగ్ కేంద్రంలో చేర్పించారు. అక్కడ గాయత్రి ఏడాదిన్నరగా శిక్షణ తీసుకుంటూ, పరీక్షలు రాసింది. రోజుకు 8 గంటలపాటు చదివినట్టు గాయత్రి తెలిపింది. పెద్ద కుమార్తె మైథిలి సైతం చిత్తూరు కోర్టులో ఉద్యోగం సాధించి, రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
విజయనగరంలోని ఆ గ్రామంలో ఇళ్లు 35 - ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 40
నిరుద్యోగులకు శుభవార్త - ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తునకు వయోపరిమితి పెంపు