Young woman Suicide in Gachibowli : హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన యువతి (23) గణేశ్ వేడుకలను చూసేందుకు తన స్నేహితులతో (మరో ఇద్దరు అబ్బాయిలు) కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. గచ్చిబౌలిలోని చిన్న అంజయ్య నగర్లో ఉన్న రెడ్ స్టోన్స్ హోటల్‌లో వారు 2 గదులు అద్దెకు తీసుకున్నారు. ఆదివారం (సెప్టెంబరు 15) రాత్రి అదే హోటల్‌లో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించింది. తీవ్రంగా తల నొప్పి ఉందని చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.
అరగంట అయినా యువతి తిరిగి రాకపోవడంతో ఆరోగ్యం బాగోలేదని ఆమెను వదిలేసి, మిగతా ఇద్దరు స్నేహితులు ట్యాంక్‌బండ్‌కు బయలుదేరారు. రాత్రి 3 గంటల తర్వాత తిరిగి హోటల్‌కు వచ్చారు. యువతి ఉన్న గది తలుపు తట్టారు. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో హోటల్ సిబ్బందికి సమాచారం అందించారు. వారి సహాయంతో గదిని తెరిచి చూడగా, అప్పటికే గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇది చూసిన స్నేహితులు ఒక్కసారిగా హతాశులయ్యారు.
Suspicious Death in Hotel Gachibowli : హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆమె యశోదా హాస్పిటల్లో నర్సుగా పని చేసినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతబస్తీలోని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆత్మహత్య కాదు, హత్యే! : ఇదిలా ఉండగా, తమ కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని యువతి తండ్రి ఆరోపించారు. తమతో ఫోన్లో కూడా మాట్లాడిందని తెలిపారు. ఆమెది కచ్చితంగా ఆత్మహత్య కాదని, ఏదో చేసి హత్య చేసుంటారని అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పారు. అనుమానం అంతా ఆమె స్నేహితులు, హోటల్ సిబ్బందిపై ఉందని యువతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని శిక్షించి, తమకు న్యాయం చేయాలని కోరారు.
ఘటనపై ఏసీపీ శ్రీకాంత్ స్పందించారు. 'ఉదయం 4 గంటలకు డయల్ 100కు కాల్ వచ్చింది. హోటల్‌లో యువతి ఉరి వేసుకుని చనిపోయిందని ఫోన్ చేశారు. హోటల్ రూమ్‌లో బీరు సీసాలు ఉన్నాయి. శవ పరీక్ష తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయి. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం.' అని వివరించారు.
'నన్ను నమ్మండి నాన్న - నేను ఏ తప్పు చేయలేదు' - లెటర్ రాసి యువతి సూసైడ్ - Young Woman Suicide In AP