Young Woman Attacked by Unknown Person in Vizianagaram District : విశాఖలో ప్రేమోన్మాది దాడిలో మహిళ మృతి చెందిన దారుణాన్ని మరవకముందే విజయనగరం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. గరివిడి మండలం శివరాం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి యువతిపై దాడి చేశారు. గ్రామానికి చెందిన యువతి శనివారం ఇంట్లో గిన్నెలు కడుగుతుండగా మాస్క్ ధరించిన వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. కొందరు స్థానికులు దుండగుడిని పట్టుకునేందుకు వెంటపడినా ఫలితం లేకుండా పోయింది. దుండగుడు పరారయ్యాడు.
పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆసుపత్రికి తరలించారు. కత్తితో పొడిచి పరారైన వ్యక్తి కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. గుర్తుతెలియని దుండగుడు మాస్క్ వేసుకుని వచ్చి దాడి చేశాడని, యువతి నానమ్మ చెబుతుంది.
ఘటనా స్థలాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. యువతి ప్రస్తుతం కోలుకుంటోందని తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే కేసును ఛేదిస్తామని చెప్పారు.
'18 ఏళ్ల అమ్మాయి ఇంట్లో పని చేసుకుంటుంటే కత్తితో ఆమె శరీరంపై రెండు చోట్ల పొడిచారు. సమాచారం అందగానే మేము ఘటనా స్థలానికి చేరుకున్నాం. క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ వచ్చి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేశాం. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. ఇప్పుడు అమ్మాయి ఆరోగ్యం నిలకడగానే ఉంది. దాడి ఘటనలో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నాం. మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక తెలియజేస్తాం.' -వకుల్ జిందాల్, విజయనగరం జిల్లా ఎస్పీ
'ఇంట్లో ఎవ్వరూ లేరు, అమ్మాయి ఒక్కతే ఉంది. అమ్మా, నాన్న, మేము పనికి వెళ్లాం. ఇలా జరిగిందని చుట్టుపక్కల వారు ఫోన్ చేసి చెప్పారు. మేము వచ్చేప్పటికి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రేమ వ్యవహారం ఏమీ లేదు . ఆ పొడిచిన అబ్బాయి మాస్క్ వేసుకుని ఉన్నాడని అమ్మాయి చెప్తుంది. అతడు పొడిచేసి వెనక డోర్ నుంచి పారిపోయాడు.' - బాధితురాలి బంధువు
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం - తల్లీకూతుళ్లపై కత్తితో దాడి - ఒకరు మృతి
మైనర్ బాలికపై సాముహిక అత్యాచారం - 4 రోజులు నిర్బంధించి దారుణం