YOUTH ADDICTED TO BETTING: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బెట్టింగ్ మాఫియా యువకుల జీవితాలతో ఆడుకుంటోంది. ఆన్‌లైన్ గేమ్స్ నరసన్నపేటలోని పలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. యువత క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వ్యసనాలకు బానిసై లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని వాటి బారి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియక మానసిక వేదనకు గురవుతున్నారు.
ఎన్నో ఘటనలు: ఇటీవల నరసన్నపేటకు చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌కు బానిసై తల్లిదండ్రులను వేధించడంతో వారు మానసిక వేదనకు గురయ్యారు. నాలుగు రోజుల నుంచి ఆ యువకుడి తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతేడాది సత్యనారాయణ నగర్‌కు చెందిన మరో యువకుడు బెట్టింగ్ మాఫియా వలలో చిక్కుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దపేట వీధికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి సుమారు 5 కోట్ల రూపాయలు వరకు నష్టపోయి పరారీలో ఉన్నారు. భైరాగి వీధికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు కుటుంబ సభ్యులతో విభేదించి మరో రాష్ట్రానికి వెళ్లిపోయాడు.
ఆందోళనలో తల్లిదండ్రులు: పెద్దపేటకు చెందిన ఓ వ్యాపారి కుమారుడు బెట్టింగ్ మాఫియాలో చిక్కుకున్నాడు. వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అతను 30 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడని, మరో రూ.4 లక్షలు కావాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు జామి వెంకటరావు వద్దకు బాధిత తల్లిదండ్రులు వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలంటూ కోరారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. నరసన్నపేటలోని పలు ధనిక, వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందిన పిల్లలు బెట్టింగ్ మాఫియా వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
పేట్రేగిపోతున్న నిర్వాహకులు: నరసన్నపేటలో కొన్నేళ్లుగా బెట్టింగ్ నిర్వహిస్తున్న మాఫియా పేట్రేగిపోతోంది. కార్లలో తిరుగుతూ శిబిరాలను సైతం నిర్వహిస్తున్నారు. బొంతల వీధి, పాతబస్టాండ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ తతంగమంతా జరుగుతోందని సమాచారం. వీటికి బానిసైన యువకుల కుటుంబాలు బలైపోతున్నాయి. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై నిఘా పెట్టామని, సరైన ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మాఫియా వలలో చిక్కుకున్నట్లు బాధితుల నుంచి ఫిర్యాదులు ఏమీ అందలేదని చెప్పారు.
ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ భూతం - తీరని శోకంలో కన్నవారు
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం - దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండపై కేసు నమోదు