Love Cheating Cases in AP : స్కూల్‌కు వెళ్తున్న బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. మోసగించి అత్యాచారం చేశాడు. ఆ దురాగాతాన్ని వీడియోల్లో చిత్రీకరించి వాటిని అడ్డం పెట్టుకుని ఇంకొంతమంది ఆ బాలికపై అత్యాచారానికి చేశారు. ఇటీవల బాధితురాలు గర్భం దాల్చడంతో ఈ దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.
ఇటీవల కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మైనర్లపై జరుగుతున్న ఆకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రేమ ఆకర్షణల వలలో చిక్కుకుని కొందరు కొట్టుమిట్టాడుతున్నారు. సోషల్ మీడియా, సినిమాల ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో సంరక్షణ, పెంపకంలో తల్లిదండ్రులలో శ్రద్ధ ఉండట్లేదు. నైతిక విలువలు, క్రమశిక్షణ లోపించి మైకం కమ్మేసిన కొంతమంది యువకులు ప్రేమ పేరుతో బాలికలపై అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. టీనేజీ ప్రేమ ఆకర్షణే తప్ప అందులో పరిపక్వత ఉండదని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. చదువుకోవాల్సిన వయసులో ప్రేమిస్తున్నానని వెంటాడి వేధింపులకు పాల్పడుతూ తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు.
నిజ స్వరూపం తెలిశాక :
- అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఓ గ్రామానికి చెందిన బాలిక ఇటీవల 10వ తరగతి పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడి మాటలు నమ్మి సర్వం అర్పించింది. తీరా పెళ్లి విషయం తెచ్చేటప్పటికి అతడు కాదన్నాడు. పోలీసులను ఆశ్రయించగా పోక్సో కేసు నమోదు చేసి ఆ యువకుడిని జైలుకు పంపారు.
- మరో ఘటనలో పదో తరగతి చదివిన బాలిక సెల్ఫోన్లో పరిచయమైన ఓ యువకుడి మాయలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. తీరా కాపురానికి వెళ్లాక అక్కడ భర్త, అతని కుటుంబం వేధింపులకు గురిచేసింది. దిక్కుతోచని ఆ అమ్మాయి తిరిగి నగరానికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే ఆమె గర్భం దాల్చింది. మైనర్‌ను పెళ్లి చేసుకోవడమే కాకుండా వేధింపులకు గురి చేసిన భర్తపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
- వారం క్రితం శింగనమల నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ చదివింది. తల్లిదండ్రులకు తోడుగా కూలి పనులకు వెళ్తేది. ఈ క్రమంలో ఓ యువకుని ఆకర్షణకు లోనై ముక్కూ ముఖం తెలియని వాడితో గడప దాటి వెళ్లిపోయింది. ఆ తర్వాత కానీ అమ్మాయికి ఆ యువకుడి అసలు నిజ స్వరూపం తెలియలేదు. కేవలం శారీరక సుఖం కోసమే తనకు దగ్గరయ్యాడని గ్రహించి ఆఖరికి ఇంటికి చేరుకుంది.
పుస్తకాల పాఠ్యాంశాలకు మాత్రమే ప్రాధాన్యం : బడుల్లో కేవలం పుస్తకాల పాఠ్యాంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. యవ్వన దశలో చోటు చేసుకున్న ఆకర్షణ, ప్రేమ, వాటి వల్ల జరిగే అనర్ధాలపై చెప్పడం లేదు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విద్యాలయాల్లో బాలికలకు అనుకోని ఆపద, ప్రేమ పేరుతో ఎదురయ్యే ఇబ్బందులపై రహస్యంగా వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా ఎప్పటికప్పుడు అమ్మాయిల సమస్యలు తెలుసుకునేలా ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
లక్ష్యంపై ప్రేరణ నింపాలి : ప్రేమ, పెళ్లి పేరుతో ఎదురయ్యే ఆకర్షణ వలలో బాలికలు చిక్కుకోకుండా ఉండేందుకు వారి ప్రవర్తన, కదలికలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపించాలని మానసిక వైద్య నిపుణుడు ఎండ్లూరి ప్రభాకర్ చెబుతున్నారు. మంచి చెడులను వారికి అర్థమయ్యేలా వివరించాలని పిల్లల అభిప్రాయాల్ని గౌరవించి సమాజంలో ఎవరితో ఎలా మసలుకోవాలో తెలియజెప్పాలని సూచిస్తున్నారు. ఆకర్షణ వలలో చిక్కుకున్న దారుణ ఘటనల్ని మైనర్లకు తెలపాలని అలానే ఉన్నత లక్ష్యాల వైపు మనసు లగ్నం చేసేలా వారిలో ప్రేరణ నింపాలని అంటున్నారు. సాధనపై ఏకాగ్రత చూపించే విధంగా నిత్యం చూసుకోవాలని ప్రభాకర్ పేర్కొంటున్నారు.