Young Man Made Mobile Solar Power Motor in Manyam District : అట్టముక్కలు, అగ్గిపుల్లలు, ఆటబొమ్మలు కావేవి ఆవిష్కరణలకు అనర్హం అన్నట్లు బాల్యంలో చేతికి ఏది దొరికినా వాటికి కొత్తరూపమిచ్చి తెగ సంతోషపడేవాడు ఆ యువకుడు. అప్పటినుంచే వినూత్నంగా ఆలోచించడం అందుకు తగ్గట్టు ఆవిష్కరణలు చేయడం అభిరుచిగా మలచుకున్నాడు. సృజనకు పదును పెడుతూ రైతులకు ఉపయోగపడేలా సరికొత్త ప్రాజెక్టులు చేయడం ప్రారంభించాడు. ఫలితంగా మొబైల్ సోలార్ పవర్ మోటర్ తయారు చేసి అన్నదాతలకు అండగా నిలుస్తున్నాడు.
ఆకట్టుకునే ఆవిష్కరణలు చేసి అధ్యాపకులు ప్రశంసలు అందుకోవడం ఇతడికి బాల్యం నుంచే అలవాటు. పెరిగే కొద్ది అభిరుచికి తగ్గట్టు ఆలోచిస్తూ అబ్బురపరిచే ప్రాజెక్టులు తయారు చేశాడు. ఉన్నత ఉద్యోగాన్నీ వదులుకుని అన్నదాతలకు ఉపకరించే ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు. తక్కువ ఖర్చులోనే మొబైల్ సోలార్ పవర్ మోటార్ రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నాడు.
అనారోగ్యం నుంచి రైతులకు రక్షణ - అందరి మన్ననలు పొందుతున్న శ్రీయ
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఈ యువకుడి పేరు గెంబలి గౌతమ్. కంప్యూటర్స్ డిగ్రీతో పాటు పీజీలో డేటాసైన్స్ కోర్సులు చేసి కంప్యూటర్ పరిజ్ఞానంలో పట్టు సాధించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం నుంటే వినూత్న ప్రాజెక్టులు చేయడం తనకు చాలా ఇష్టం. సాంకేతికాంశాలు తెలుసుకుని వాటి ఆధారంగా మైక్రోఆర్ట్స్ సహా భిన్నమైన పరికరాలు తయారు చేసేవాడు.
ఎమ్మెస్సీలో డేటాసైన్స్ పూర్తి చేసిన గౌతమ్‌కి రూ.80 వేల జీతంతో ముంబయిలో ఉద్యోగం వచ్చింది. కానీ, ఆవిష్కరణలపై ఆసక్తితో దానికి గుడ్ బై చెప్పి అగ్రికల్చర్‌కి ఉపయోగపడే ప్రాజెక్టులు చేయడం ప్రారంభించాడు. ఇతడి ప్రతిభ గుర్తించి వాసన్ సంస్థ ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించింది. వాసన్ సహకారంతో పాటు సెల్కో, హెర్థాన్ సంస్థల ఆర్ధిక తోడ్పాటుతో కొత్త ప్రయాణం ప్రారంభించాడు గౌతమ్.
బరిలోకి దిగితే పతకం సాధించాల్సిందే - సత్తా చాటుతున్న స్విమ్మర్, వైద్యురాలు సాయిశ్రీ
తక్కువ ఖర్చుతోనే మొబైల్ సోలార్ పవర్ మోటర్ రూపొందించాడు గౌతమ్. నీరున్న చోటుకే ఈ మోటార్ తీసుకెళ్లొచ్చని అంటున్నాడు. చెరువులు, కుంటలు ఎక్కడుంటే అక్కడికి మోటార్ తీసుకెళ్లి నీటిని పొలానికి మళ్లించవచ్చని వివరిస్తున్నాడు. సౌరశక్తితో పనిచేసే 0.5, 2, 3 హర్స్ పవర్స్‌తో నడిచే మోటార్లు తయారు చేశానంటున్నాడు. సోలార్ ప్లేట్లను ట్రాలీకి అమర్చి నీరున్న చోటుకు తీసుకెళ్లి పైపుల సహయంతో పొలాలకు నీటిని పంపించవచ్చని చెబుతున్నాడు.
"రైతులు పెట్రోల్, డీజిల్ పంపులను వాడినట్లే ఈ సోలార్ పంపునూ వాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతో సౌరశక్తితో పనిచేసే 0.5, 2, 3 హర్స్ పవర్స్‌తో వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటికి వాడే ప్యానళ్లు గాజుతో కాకుండా సిలికాన్‌తో తయారుచేశాం. దీంతో ఎక్కువ మన్నిక వస్తాయి. వీటితో పాటు రైతులకు ఉపయోగపడే చాలా పరికరాలు తయారు చేశాం.ఈ ఆవిష్కరణలకు వాసన్, సెల్కో,హెర్థాన్ సంస్థలు సహకారం అందించాయి." - గౌతమ్, ఆవిష్కర్త
మొబైల్ సోలార్ పవర్ మోటార్ తయారీతో పాటు మరెన్నో ప్రాజెక్టులు చేశాడీ యువకుడు. జపాన్ సాంకేతికతతో మందుల పిచికారీ చేసే బ్యాటరీ తయారు చేశాడు. వీటిని ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో వినియోగించవచ్చని అంటున్నాడు. ఆవు పేడ, మూత్రం, శనగపిండి, బెల్లం మొదలైన వాటిని నిత్యం కలియబెట్టేందుకు కంట్రోలింగ్ యూనిట్ ఆవిష్కరించాడు. చిరుధాన్యాలు సక్రమంగా ప్రాసెసింగ్ చేసేలా సరికొత్త మిక్సీ రూపొందించానని చెబుతున్నాడు.
ప్రకృతిలో లభించే వనరులతో ఉత్పత్తులు - చిన్న ఆలోచనలతో ఆదాయం
వాసన్, సెల్కో, హెర్థాన్ సంస్థల సహకారంతో పార్వతీపురంలో Nature FarmEasy Tech Solutions Pvt Ltd పేరుతో తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు గౌతమ్. అనేక రకాల యంత్రాలు, పరికరాలతో పాటు స్టీరింగ్ లేని కార్లు, చైన్ లేకుండా నడిచే ఈ- బైక్ వంటివి తయారు చేస్తున్నారు. దాంతో పాటు కొందరు యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉపకారం వేతనంగా 15 వేల రూపాయలు ఇస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పరికరాలు తయారు చేసిన అన్నదాతలకు అండగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ యంగ్ ఇన్నోవేటర్ గౌతమ్.
విధి వెక్కిరించినా విజయం సాధించింది - స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్‌లో రాణిస్తున్న విజయవాడ యువతి