Youngman Excels in Para Rowing: దేశానికి సేవ చేయాలనే ఆశయంతో కష్టపడి సైన్యంలో ఉద్యోగం సాధించారు ఆ యువకుడు. విధి నిర్వహణలో ప్రమాదంలో కాలికి గాయమైంది. అయినా కూడా దేశానికి పేరు తీసుకురావాలనే ఆశయంతో రోయింగ్ క్రీడపై ఆయన దృష్టి పెట్టారు. వరుసగా పతకాలను సాధిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన వెంకటస్వామి, సుంకమ్మల కుమారుడు కొంగనపల్లె వెంకటనారాయణ. 2007లో ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో భాగంగా బాంబులు పేలడంతో వెంకటనారాయణ కాలికి గాయాలయ్యాయి. పుణేలో చికిత్స చేయించుకున్న అనంతరం ఆటలపై ఆసక్తితో పారా రోయింగ్ పోటీల వైపు వెళ్లి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పలు పతకాలను దక్కించుకున్నారు.
ఇప్పటి వరకూ సాధించిన విజయాలు:
- 2021లో హాంకాంగ్‌లో జరిగిన ఏషియన్ ఇండోర్ రోయింగ్ పోటీల్లో 2,000 మీటర్ల దూరాన్ని 7.2 నిమిషాల్లో చేరుకొని ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి స్వర్ణాన్ని సాధించారు.
- 2022లో మహారాష్ట్రలోని పుణెలో 7 రోజుల పాటు జరిగిన 40వ జాతీయస్థాయి రోయింగ్ కప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, హరియాణా రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఏపీ తరఫున వెంకటనారాయణ పాల్గొని 2,000 మీటర్ల దూరాన్ని 8 నిమిషాల 14 సెకన్లలో, 500 మీటర్ల దూరాన్ని ఒక నిమిషం 50 సెకన్ల వ్యవధిలో చేరుకొని 2 స్వర్ణపతకాలను కైవసం చేసుకున్నారు.
- 2022లో పోలండ్‌లో 3 రోజుల పాటు జరిగిన ప్రపంచ రోయింగ్ కప్ పోటీల్లో ఇండియా, ఫ్రాన్స్, ఉక్రెయిన్, ఇటాలియన్, జర్మనీ దేశాలు పాల్గొన్నాయి. మనం దేశం తరఫున నంద్యాల జిల్లాకు చెందిన వెంకటనారాయణ, హరియాణాకు చెందిన కుల్‌దీప్‌సింగ్ 200 మీటర్ల దూరాన్ని 7.33 నిమిషాల వ్యవధిలో చేరుకొని కాంస్యాన్ని కైవసం చేసుకున్నారు.
- 2023 ఫిబ్రవరిలో జరిగిన 40వ జాతీయస్థాయి రోయింగ్ పోటీల్లో 2,000 మీటర్ల దూరాన్ని 8.14 నిమిషాల్లో చేరుకొని సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలిచి 2 స్వర్ణాలను దక్కించుకున్నారు.
- 2023 అక్టోబరులో చైనాలోని హంగ్‌జోలో రోయింగ్ పీఆర్3 మిక్స్‌డ్ డబుల్ పోటీల్లో మనం దేశం తరఫున వెంకటనారాయణ, రాజస్థాన్‌కు చెందిన అనితతో కలిసి 2 కిలో మీటర్ల దూరాన్ని 8.50 నిమిషాల్లో చేరుకొని రజతం సాధించారు. ఈ పోటీల్లో భారత్‌తో పాటు జపాన్, చైనా, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్థాన్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. భారత్ రెండో స్థానంలో నిలవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఇద్దర్నీ అభినందిస్తూ ట్వీట్ చేశారు.
- 2025లో థాయ్‌లాండ్‌లోని పటాయాలో జరిగిన ఏషియన్ ఇండో రోయింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 7 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. పారా రోయింగ్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో 2 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల 5 సెకన్లు, 500 మీటర్ల దూరాన్ని 1.30 నిమిషాల వ్యవధిలో చేరుకొని 2 స్వర్ణాలను సాధించారు.
దేశం గర్వించే స్థాయికి దీప్తి - ఎంతోమందికి స్ఫూర్తి
రెండు కాళ్లు లేకుంటేనేం! - స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకాలు