
మొక్కజొన్న కండెతో 'క్యారీబ్యాగ్స్' - లాభాలు పండిస్తున్న యువత
కాలుష్యానికి కళ్లెం వేసేలా మొక్కజొన్న కండెతో ‘బయోడీగ్రేడబుల్ క్యారీబ్యాగ్స్’ - లాభాల పంట పండిస్తున్న యువ పారిశ్రామికవేత్తలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 12, 2025 at 2:54 PM IST
|Updated : October 12, 2025 at 6:51 PM IST
Young Entrepreneurs Making Corn Cobs Bags in AP : మొక్కజొన్న కండెతో కాలుష్యానికి కళ్లెం వేస్తున్నారు బెజవాడలో కొందరు యువ పారిశ్రామికవేత్తలు. కండెతో చేసిన ముడిపదార్థాన్ని దిగుమతి చేసుకుని ప్రకృతి హిత ‘బయోడీగ్రేడబుల్ క్యారీబ్యాగ్స్’ తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్‌పై యుద్ధం చేస్తూనే లాభాల పంట పండిస్తున్నారు. ప్రజలకు స్ఫూర్తినిస్తున్నారు.
మొక్కజొన్న కండెతో బ్యాగులు : ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించాయి. ప్రభుత్వ పిలుపును అందిపుచ్చుకున్న బెజవాడలోని రుద్ర ఎకో ట్రేడర్స్ స్థాపకుడు త్రివిధ్ నాయక్ ప్రకృతిహిత సంచుల తయారీకి నడుం బిగించారు. చైనాలో విత్తులు తీసిన తర్వాత మిగిలే మొక్కజొన్న కండెతో ఈ సంచుల ఉత్పత్తిలో కీలకమైన ఫిల్లర్ అనే పదార్థాన్ని తయారు చేస్తున్నారు.
దాన్ని దిగుమతి చేసుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్‌ట్రాడర్ అనే యంత్రంలో 70 శాతం ఫిల్లర్‌ను 30 శాతం పీబ్యాట్ (బయో డీగ్రేడబుల్ థర్మో ప్లాస్టిక్ పాలిమర్)ను వేస్తారు. అక్కడ నుంచి బ్యారల్ ద్వారా బ్లోవర్‌లోకి పంపి 180 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. గ్యాడ్జెట్‌లో సంచి సైజు, మైక్రాన్‌ల పరిమాణం సెట్ చేస్తారు. 30-120 మైక్రాన్ల పరిమాణం వరకు సంచులు తయారు చేయవచ్చు.

తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం : పది కేజీల ముడి పదార్థంతో 8 కేజీల సంచులు వస్తాయి. అన్నీ కలిపి ఖర్చు రూ.900. కేజీకి 190 సంచులు వస్తాయి. వాటిని రూ.140కి విక్రయిస్తున్నారు. 8 కేజీలకు రూ.1,120 వస్తుంది. పెట్టుబడి పోగా రూ.220 వరకు మిగులుతుంది. రోజుకు 20 టన్నుల ముడి పదార్థంతో సంచులు తయారు చేస్తారు.
ప్రారంభ దశలో ఎన్నో ఆటుపోట్లు : పర్యావరణాన్ని కాపాడేందుకు కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పరిశ్రమను స్థాపించానని చెబుతున్నాడు త్రివేద్ నాయక్. ప్రారంభ దశలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, అనుభవజ్ఞుల నుంచి మార్కెటింగ్ చేయడంలో మెళకువలు నేర్చుకున్నాడు. సమాజంలో ప్లాస్టిక్ బ్యాగులు వినియోగం ఎక్కువ శాతం ఉందని గ్రహించాడు. అధైర్యపడకుండా పలు వ్యాపార సముదాయాలు, ప్రముఖ మెడికల్ స్టోర్లు, దేవాలయాలకు వెళ్లి తాను తయారు చేసే బ్యాగుల గురించి అవగాహన కల్పించాడు. ఆ తర్వాత ఎక్కడా వెనుదిరిగి చూడకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.
పక్క రాష్ట్రాలకు సైతం ఎగుమతి : మొదట్లో చిన్నమోతాదులో పర్యావరణహితమైన బ్యాగులు తయారీని ప్రారంభించిన ఈ యువకుడు. ప్రస్తుతం పక్క రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేస్తున్నాడు. ముఖ్యంగా యువత ఈ రంగం వైపు రావాలని పిలుపునిస్తున్నాడు. బ్యాగులు అవసరమైన వారు ఒకరోజు ముందు ఆర్డర్ చేస్తే తయారు చేసి ఇస్తామని చెబుతున్నారు పరిశ్రమ ఉద్యోగులు. పర్యావరణానికి మంచి చేసేందుకు ఈ తరహా పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించి, రాయితీలు అందిస్తే మరింత మంది ఔత్సాహికులు ముందుకు వస్తారని చెబుతున్నాడు త్రినేద్.
మూడు నెలల్లో భూమిలో కలిసిపోతాయి : త్రివిధ్ నాయక్ కాకుండా విజయవాడలోని ఆటోనగర్‌లో మరో మూడు పరిశ్రమలు ఉన్నాయి. ఇలా తయారు చేసిన సంచులను ప్రస్తుతం మెడికల్ దుకాణాలు, స్వీట్‌షాపులు, చిరువ్యాపారాలు, ఆలయాల్లో ప్రసాదాల వితరణ, కొన్ని హోటళ్లలో, రెస్టారెంట్లలో ప్యాకింగ్‌కు విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు కొన్నేళ్లపాటు భూమిలో కలవవు, కాల్చినా కాలుష్యమే. ఈ సంచులు మూడు నెలల్లో భూమిలో కలిసిపోతాయి. మంటల్లో వేస్తే బూడిదైపోతాయి. పర్యావరణానికి మంచి చేసేందుకు ఈ తరహా పరిశ్రమలను రాయితీ ఇచ్చి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. వీటిని గుర్తు పట్టేలా సంచుల మీదే ప్లాస్టిక్ సంచిని కాదు అని ముద్రించి విక్రయిస్తున్నామని త్రివిధ్ నాయక్ చెబుతున్నారు.
క్యారీ బ్యాగ్‌పై డబ్బులు వసూలు చేశారా? ఇలా చేస్తే పరిహారం గ్యారెంటీ!
D Mart: డీమార్ట్‌లో క్యారీ బ్యాగ్స్ కొంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే..!

