Yogandhra Guinness Record: 3 లక్షలకుపైగా ప్రజలు పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఇదే అంశంలో గతంలో సూరత్ యోగా రికార్డును విశాఖ యోగాంధ్ర బద్దలు కొట్టింది. గతంలో సూరత్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో లక్షా 47 వేల మంది పాల్గొనగా, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖలో 3 లక్షలకు పైగా ప్రజలు భాగస్వాములయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగాంధ్ర ఈ గిన్నిస్ రికార్డును సాధించింది.
'యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్' 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి నినాదంగా మారింది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాది మంది ప్రజలు యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు పాల్గొని 45 నిమిషాలపాటు యోగాసనాలు వేశారు.
ఇవీ రికార్డులు: విశాఖలో ఒకేసారి 3 లక్షల మందికి పైగా యోగాసనాలు వేసినందుకు ఒక రికార్డు దక్కింది. గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు మరో గిన్నిస్ రికార్డు వచ్చింది. అల్లూరి జిల్లాలో ఒకేసారి 22,122 మంది గిరిజన విద్యార్థులు సూర్యనమస్కారాలు చేశారు. ఈ మేరకు మంత్రులు లోకేశ్, సత్యకుమార్‌కు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాలు అందజేశారు.

యోగాంధ్ర నిర్వహణపై సంతోషంగా ఉన్నా: యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల పట్ల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి గిన్నిస్ రికార్డు కానుకగా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రజల్లో యోగాంధ్రపై చైతన్యం తీసుకువచ్చామని వెల్లడించారు. ఆశించిన దానికంటే ఎక్కువ మంది యోగాంధ్రకు వచ్చారని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఉన్నతమైన ఐటీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ యోగా డే నిర్వహణ ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగిందని ఆయన చెప్పారు.
యోగాంధ్ర నిర్వహణపై సంతోషంగా ఉన్నానన్న మంత్రి లోకేశ్, ఆంధ్రుల కోరికలను ప్రధాని నెరవేరుస్తున్నారని అన్నారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లే యోగాంధ్ర విజయవంతమైందని, ప్రధాని పిలుపు మేరకు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారని లోకేశ్ అన్నారు. ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయడం వల్లే యోగాంధ్ర ప్రశాంతంగా ముగిసిందని, ప్రధాని వ్యాఖ్యలు తనపై మరింత బాధ్యతను పెంచాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రుల విజయమని లోకేశ్ పేర్కొన్నారు.
పరిపాలన సౌలభ్యం కోసం రాజధానిగా అమరావతి నిర్మిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని, దక్షిణ భారతదేశంలో ఉన్నతమైన ఐటీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఐటీని ప్రోత్సహించాలంటే మెరుగైన సదుపాయాలు ఇవ్వాలన్న లోకేశ్, 99 పైసలకే ఎకరా భూమి ఇవ్వడం వల్ల టీసీఎస్, కాగ్నిజెంట్ వచ్చాయని లోకేశ్ పేర్కొన్నారు. ఫ్రస్టేషన్‌లో ఉన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్‌లాంటి వాళ్లకు యోగా ఎంతో అవసరం అని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
యోగాకు హద్దులు లేవు - వయస్సుతో పనిలేదు: ప్రధాని మోదీ
యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్‌సెట్టర్‌గా మారింది: సీఎం చంద్రబాబు
విశాఖలో గిరిజన విద్యార్థుల యోగసాధన - 108 మినిట్స్ - 108 సూర్య నమస్కారాలు