Yesvantpur Superfast Express at Chirala Railway Station : యశ్వంత్‌పుర సూపర్‌ఫాస్ట్ రైలులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. చీరాల రైల్వేస్టేషన్ సమీపంలోని పేరాల రైల్వే గేట్ వద్ద బీహార్ నుంచి బెంగళూరు వెళ్తున్న యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోయింది. ఎస్-2 బోగీ వద్ద రన్నింగ్ రైలులో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి పొగ రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్‌ను ఆపారు. రైలు నుంచి దిగిన ప్రయాణికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. అయితే బ్రేక్‌లు వేసే సమయంలో రైలు చక్రాలకు రాపిడి జరగడంతో నిప్పు రవ్వలు వచ్చాయని, ఇది సాధారణమేనని రైల్వే అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా రైలు నుంచి దిగిన ప్రయాణికులు పరుగులు తీస్తూ పట్టాలు దాటుతున్న సమయంలో పక్క ట్రాక్‌పై మరో రైలు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.