World Sparrow Day 2025 : కొన్నేళ్ల క్రితం కిచకిచమంటూ పిచ్చుకల అరుపులు వినిపించేవి. కానీ నేటి తరానికి ఆ అనుభూతి దక్కే అవకాశం కనుమరుగైంది. అక్కడక్కడ మాత్రమే అరుదుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వాటి మనుగడ కష్టమైపోతోంది. పర్యావరణ సమతుల్యతలో వీటి పాత్ర కీలకమైంది. వాటిని సంరక్షించేందుకు జంగారెడ్డిగూడెంకు చెందిన వీరా మహేశ్ నడుం బిగించారు. అవి నివసించేందుకు వీలుగా చెక్క ముక్కలతో 2012 నుంచి కృత్రిమ ఆవాసాలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 600కు పైగా గూళ్లను పట్టణంలోని పలువురి ఇళ్ల వద్ద ఉచితంగా అమర్చి పిచ్చుకల సంతతి వృద్ధికి కృషి చేస్తున్నారు. అంతే కాకుండా వాటిని ఏటా శుభ్రం చేయిస్తున్నారు.
15 ఏళ్ల నుంచి : మహేశ్ జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో జువాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. చిన్ననాటి నుంచి అతడికున్న ప్రేమతో పిచ్చుకల సంతతి పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్వేషించే వారు. 15 సంవత్సరాల నుంచి ఆయా పరిశోధనలు చేస్తూ 2015లో పిచ్చుకల సంరక్షణ, పరిశోధన సంస్థను ఏర్పాటు చేసి, దాని కార్యకలాపాలను విస్తరించారు. కృత్రిమ ఆవాసాల ద్వారా పిచ్చుకల సంతతి వృద్ధిపై కృష్ణా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 2022లో జీవ వైవిధ్య విభాగం అవార్డు అందుకున్నారు.

100 నుండి 3000ల వరకు : జంగారెడ్డిగూడెం పట్టణంలో పిచ్చుకల సంతతి 2012లో వంద లోపు ఉండేది. ఎక్కడికక్కడ కృత్రిమ ఆవాసాల ఏర్పాటు, ధాన్యం పెట్టి సంరక్షించడంతో నేడు వాటి సంఖ్య 300లకు పెరిగింది. పిచ్చుకలు ప్రకృతిలో ఓ భాగమని వీరా మహేశ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వాటి సంఖ్య తగ్గిపోతోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేసి వాటి వృద్ధికి సహకరించాలని కోరారు. తమ సంస్థ ద్వారా పలు విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు
బుల్లి నేస్తాలకు భలే గూళ్లు! : ప్రకృతి సమతుల్యతకు దోహదం చేసే పిచ్చుకుల సంరక్షణకు ఆకివీడు మండలం అయిభీమవరం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు ఎన్.కృపానందం తన వంతు కృషి చేస్తున్నారు. పిచ్చుకలు గూళ్లు పెట్టుకొనే తాటాకుల ఇళ్లు దాదాపు కనుమరగవడంతో అవి గుడ్లు పెట్టి పొదిగేందుకు అనువుగా కుండలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ గొట్టాలు, చెక్కలతో పెట్టెలు రూపొందించి ఆసక్తి ఉన్నవారికి, విద్యార్థులకు అందిస్తున్నారు.

పిచ్చుకల సంచారం ఉన్న ప్రాంతాల్లోని నివాసాల వద్ద వీటిని అమర్చడంతో పాటు వాటికి తిండి గింజలు, నీళ్లు సమకూర్చేలా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. గత ఐదేళ్లగా ఉండి, కాళ్ల, కుప్పనపూడి, భీమవరం తదితర ప్రాంతాల్లో ఇలాంటి పెట్టెలను ఏర్పాటు చేస్తూ పిచ్చుకుల సంతతి వృద్ధికి కృషి చేస్తున్నట్లు కృపానందం పేర్కొన్నారు.