World Hypertension Day 2025 : మారిన ఆహారపు అలవాట్లు జీవనశైలిలో మార్పు, శారీరక, మానసిక రుగ్మతల కారణంగా ఎక్కువ మంది రక్తపోటు (బీపీ) బారిన పడుతున్నారు. 50 సంవత్సరాలు దాటిన వారిలో కనిపించే ఈ లక్షణాలు నేడు యువతలోనూ కనిపిస్తున్నాయి. 30 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరికి బీపీ ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) అంచనా వేస్తోంది.
హైబీపీకి మన జీవనశైలిలో చోటుచేసుకునే కొన్ని మార్పులు కారణమవుతుంటాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, సమయపాలన అలవర్చుకోకపోవడం, మితిమీరిన ఔషధాల వినియోగం వంటి కారణాలతో యువత ప్రధానంగా రక్తపోటు బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోకపోతే శరీరంలో అత్యంత కీలకమైన రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
దీనివల్ల మెదడు నుంచి కాళ్ల వరకు ప్రమాదకర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తాయని చెబుతున్నారు. వైద్యులు చెబుతున్న కఠోర వాస్తవమేమిటంటే చాలామందికి అసలు హైబీపీ ఉన్న విషయం తెలియకపోవడం. తెలిసినవాళ్లేమో పెద్దగా పట్టించుకోవడం లేదు. చాప కింద నీరులా వ్యాపించే ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఏటా మే 17న వరల్డ్ హైపర్‌టెన్షన్ డేని నిర్వహిస్తున్నారు.
వ్యాయామం తప్పనిసరి : రక్తపోటు మిగిలిన వ్యాధుల మాదిరిగా బయటపడదని వైద్యులు పేర్కొంటున్నారు. 40 సంవత్సరాలు దాటిందంటే ఎవరికి వారు స్వచ్ఛందంగా ఆర్నెళ్లకోసారి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిరోజు వ్యాయామం, యోగాతో పాటు ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. పచ్చళ్లకు దూరంగా ఉండడం మంచిదని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవాలని వివరిస్తున్నారు. సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చకూడదని చెబుతున్నారు. ఒత్తిడిని అధిగమిస్తే బీపీ రాదని చెబుతున్నారు.
గత సంవత్సరం నవంబర్ నుంచి నిర్వహిస్తున్న ఎన్‌సీడీ (అసాంక్రమిత వ్యాధులు) సర్వేలో అధిక రక్తపోటు బాధితుల్లో పశ్చిమ, ఏలూరు జిల్లాలు మూడు, నాలుగో స్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ సర్వే రెండు దఫాలు పూర్తైంది. మూడో దఫా జరుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, ఏలూరు జిల్లా ఆసుపత్రులతో పాటు నరసాపురం, జంగారెడ్డిగూడెం, భీమవరం, పాలకొల్లు ఇతర ప్రాంతీయ వైద్యశాలలకు వచ్చే వారిలో బీపీ బాధితులే అధికం. అవుట్ పేషెంట్లలో 40శాతం మందికి సాధారణ మందులతో పాటు వైద్యులు బీపీకి మందులు రాసిస్తున్నారు. ఏటా 6 శాతం మంది బాధితులు పెరుగుతున్నారు.
బీపీ బాధితుల్లో మహిళలే అత్యధికం- వెంటాడుతున్న పది వ్యాధులు
మందులు వేసుకోకుండానే BP తగ్గించుకోవాలా? - నిపుణులు ఏం చెప్తున్నారంటే!