World Blood Donor Day : 'రక్తదానం చేయండి - ఇతరుల ప్రాణాలను కాపాడండి' అనే నినాదం ప్రతీచోట వింటూనే ఉంటాం. ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తులకు ఆయుష్షు పోసేందుకు వచ్చిన గొప్ప అవకాశం రక్తదానం చేయడం. ఇప్పుడు దీనిపై అందరిలోనూ సామాజిక స్పృహ పెరుగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజులు ఇలా తదితర శుభ సందర్భాల్లో చాలా మంది రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు. వారి స్ఫూర్తితోనే కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004 నుంచి ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. రక్తదానం చేయడం వల్లే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
రక్త దానం చేయడం వల్ల ప్రయోజనాలు :
- రక్తంలో ఐరన్ అధిక స్థాయిలో ఉంటే రక్త ప్రసరణలో అడ్డంకులతో గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంది. హెమోక్రొమాటోసిస్ (ఐరన్ ఓవర్ లోడ్) వ్యాధికి కారణం అవుతుంది.
- క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే శరీరంలో ఐరన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.
- రక్తదానంతో గుండె జబ్బులు తగ్గుతాయి.
- శరీరంలో ఐరన్ నిల్వల స్థాయి తగ్గడంతో పెద్ద పేగు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
- రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
- కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది.
- రక్తంలో నూతన కణాలు వృద్ధి చెంది, రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.
రక్తం వీరు ఇవ్వకూడదు :
- రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, హిమోగ్లోబిన్ లోపాలు ఉన్నవారు, ఏదైనా శస్త్ర చికిత్సలు చేయించుకున్న కొద్ది రోజుల వరకు రక్తాన్ని దానం చేయకూడదు.
- గుండె వ్యాధులు ఉన్నవారు ఇవ్వకూడదు.
- తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.
- లైంగిక సంక్రమణ వ్యాధులు
- క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు
- మధుమేహ వ్యాధిగ్రస్థులు
- ఇన్సులిన్ తీసుకుంటున్న వారు రక్తం దానం చేయకూడదు.
వీరు నాలుగు వారాల్లోపు రక్తదానం చేయవద్దు : మంప్స్, మీజిల్స్, రుబెల్లా, ఎల్లోఫీవర్, హెపటైటిస్ టీకా తీసుకున్న వారు నాలుగు వారాల్లోపు రక్తదానం చేయకూడదు. అలాగే హెచ్ఐవీ, హెపటైటిస్-బీ, హెపటైటిస్ - సీతో బాధపడుతున్న వారు రక్తదానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
సామాజిక మాధ్యమాలే వేదికగా ప్రచారం : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రక్తదాతల వివరాలతో 25కు పైగా వాట్సప్ గ్రూపులు ఉన్నాయి. ఇందులో అరుదైన గ్రూపులు, రక్తం అవసరమైన వారి ఫోన్ నంబర్లు ఆయా గ్రూపుల్లో పోస్టు చేయగానే, సమీపంలోని వాట్సప్ గ్రూపు సభ్యులు స్పందించి ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేస్తున్నారు. ఆసుపత్రుల్లోనూ రక్తం అవసరమైన వారు సంప్రదించాలంటూ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదిలో నాలుగుసార్లు రక్తం దానం చేసే అవకాశం ఉండగా, ఈ ఉమ్మడి జిల్లాలో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన వారెందరో ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి శుక్రవారం వరకు 4,300 మంది రక్తదానం చేయడమే ఇందుకు నిదర్శనం.
ఆపదలో ఆదుకునే నేస్తం : ఎల్లారెడ్డిపేటకు చెందిన వంగ గిరిధర్‌రెడ్డి ఇప్పటివరకు 50 సార్లకు పైగా రక్తాన్ని అందించారు. ఇలా ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 2005లో సహాయ స్వచ్ఛంద సంస్థను స్థాపించడం ద్వారా సామాజిక సేవలో భాగస్వాములు అయ్యారు. మహానంది జాతీయ అవార్డుతో పాటు పలు పదికిపైగా అవార్డులను ఆయన కైవసం చేసుకున్నారు.
ఉదయ్‌కుమార్ 38 సార్లు రక్తదానం : మెట్పల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్లో నివాసం ఉంటున్న ఎనుగందుల ఉదయ్‌కుమార్ ఇప్పటివరకు 38 సార్లు రక్తదానం చేశారు. అత్యవసర సమయాల్లో రక్తదానంతో పాటు రక్తకణాలను ఆయన అందించారు.
దెబ్బ తగిలితే రక్తం ఆగట్లేదా? ఇదొక వ్యాధని మీకు తెలుసా? ఎలా వస్తుంది?
రక్తంతో మెడిసిన్ తయారీ! బోన్ ఫ్యాక్చర్స్, గాయాలకు ఇకపై ఈజీ ట్రీట్మెంట్!