Tourists to Kondakarla Ava Anakapalle District : రాష్ట్రంలో కొల్లేరు తరువాత అతి పెద్ద మంచినీటి సరస్సు అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవ. సుమారు 1800 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. కాలుష్యానికి దూరంగా ప్రకృతి రమణీయతకు దగ్గరగా నిలుస్తోంది ఈ జల సోయగం. ఇక్కడి వాతావరణం ప్రకృతి అతిశయాలన్నీ పోగేసినట్లుంటుంది. పచ్చదనం పరుచుకున్న కొండలు మనల్ని చుట్టుముట్టి ప్రకృతి ఒడిలో బంధిస్తాయి. చల్లగాలులు ఇంకాసేపు సేద తీరమంటూ ఓలలాడిస్తుంటాయి.
కొండల మధ్యనుండే కొండకర్ల ఆవ కూడా మొత్తం పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. స్వచ్ఛమైన నీటిలో విరిసిన తామరాకులు అందంగా విచ్చుకున్న కలువలను చూస్తే కెమెరాలకు ఇట్టే కన్ను కొట్టేస్తాయి. అందుకే ఫోటోషూట్‌లకు ఇప్పుడు ఇదో హాట్ స్పాట్! కాబోయే జంటలు, నూతన వధూవరులు సహజసిద్ధమైన సీనరీ మధ్య ఫొటోలు తీయించుకుంటుంటారు. హీరోహీరోయిన్లలా అందమైన ఊహాలోకంలో విహరిస్తూ ఆ మరపురాని క్షణాలను మరచిపోలేని దృశ్యాలుగా మలుచుకుని దాచుకుంటున్నారు. 123 పక్షి జాతులు, 20 రకాల చేప జాతులు కొండకర్ల ఆవకు అదనపు ఆకర్షణలు. వందకుపైగా నీటి బాతులు ఇందులో బోటింగ్‌కు వెళ్లేవారి ఆత్మీయ నేస్తాలు. ఎంతదూరమైనా వెళ్లేందుకు అందుబాటులో బోట్లు. అందుకే కెమెరామెన్లకు కూడా కొండకర్ల ఆవ కేరాఫ్ సీనరీగా మారిపోయింది.
ప్రస్తుతానికి కొండకర్ల ఆవకు ఒకసారి వచ్చిన పర్యాటకులే బ్రాండ్ అంబాసిడర్లు. ఒకసారి చూసిన వారు ఇంకో పది మందికి చెప్పడం, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టడం ద్వారా ఇది సరికొత్త పర్యాటక విహారంగా మారిపోతోంది. అలా వచ్చిన వారెవరినీ నిరాశపరచకుండా ఇక్కడ ఏర్పాట్లున్నాయి. ఇక్కడ విశాఖ మహానగర పాలక సంస్థ నీటిపై తేలాడే వాటర్ బ్రిడ్జి నిర్మించింది. రాంకీ సంస్థ ఇక్కడ మత్స్యకారులకు ఫైబర్ బోట్‌లు ఇచ్చింది. ఇంకాస్త థ్రిల్లింగ్‌గా విహరిద్దాం అనుకునేవారికోసం తాటి దోనెలూ ఉన్నాయి.
మొత్తంగా ఉరుకుల పరుగుల ఒత్తిడి జీవితాలకు నూతన ఉత్తేజాన్ని, శారీరక ఉల్లాసాన్నిచ్చే ఓ సుందర ప్రదేశం కొండకర్ల ఆవ. ఇది అనకాపల్లి రైల్వే స్టేషన్‌కు 14 కిలోమీటర్లు, విశాఖ విమానాశ్రయానికి 30కిలోమీటర్ల దూరంలో ఉంది. యలమంచిలి, అనకాపల్లి నుంచి రోడ్డుమార్గంలో చేరుకోవచ్చు. రాత్రి బస చేసేందుకు సమీపంలో పదికిపైగా ప్రైవేట్ రిసార్ట్‌లున్నాయి. ప్రముఖులు, ఉన్నతాధికారులు వారాంతాల్లో ఇక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. ప్రత్యేకించి కార్తిక మాసంలో కొండకర్ల ఆవ సందర్శకులతో కిటకిటలాడుతుంది. మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఆదాయవనరుగా మారింది. మరింత మంది వచ్చేలా చేస్తే చేపల వేట సమయంలో ఉపాధికి ఢోకా ఉండదంటున్నారు ఇక్కడి మత్స్యకారులు.
పర్యాటకులకు శుభవార్త- త్వరలోనే ప్రకృతి ఒడిలో 'హోం స్టే'
'మేము చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ ప్రదేశాన్ని యూట్యుూబ్లో చూశాను. తక్కువ బడ్జెట్లో పెళ్లి ఫొటోషూట్‌కు పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. మంచి లొకేషన్స్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఇలాంటి సీనరీ ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కలువలు, పక్షులు, పచ్చదనం, పడవ ప్రయాణం, కొండలు, స్వచ్ఛమైన గాలి చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆవ చేరుకోవడానికి కూడా మంచి రహదారులు ఉన్నాయి. మరిన్ని సదుపాయాలు కల్పించి దీన్ని డెవలప్ చేస్తే ఆంధ్రలో కేరళ తరహాలో ఉన్న ఈ ప్రాంతాని సందర్శకుల తాకిడి పెరిగే అవకాశాలున్నాయి.' - ఫొటోషూట్కోసం వచ్చిన పర్యటకులు
అచ్యుతాపురం, మునగపాక మండలాల పరిధిలోని సుమారు 25 గ్రామాలకు సాగు, తాగునీటికి ఆధారం కొండకర్ల ఆవ. దాదాపు 200 మత్స్యకార కుటుంబాలకూ ఇదే జీవనాధారం. అటు స్థానిక అవసరాలకు ఇబ్బంది లేకుండానే పర్యాటక అభివృద్ధి చేసేలా స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు కొండకర్ల ఆవలోని సుమారు 700 ఎకరాలను ప్రభుత్వం కన్జర్వేషన్ రిజర్వ్‌గా మార్చింది.
సహజత్వాన్ని కోల్పోయిన కొండకర్ల ఆవ - నీటి ఎద్దడికి రైతుల ఆందోళన