Women Protest To Take Action On Krishnam Raju: అమరావతి మహిళలపై సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రోడ్డెక్కారు. కృష్ణంరాజుని అరెస్టు చేయాలి, సాక్షి ఛానల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నినదిస్తూ ఆందోళనలతో కదం తొక్కారు. మహిళల మనోభావాలు కాపాడాలంటూ పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేశారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి ఛానల్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలుచోట్ల మహిళలు డిమాండ్ చేశారు. బంటుమిల్లిలో మండల మహిళా విభాగం నాయకులు, తిరువూరులో తెలుగు మహిళలు, అవనిగడ్డలో టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.మహిళల మనోభావాలు కాపాడాలని డిమాండ్ చేశారు.
ఏలూరులోని సాక్షి కార్యాలయం వద్ద తెలుగు మహిళా విభాగం నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. సాక్షి పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఆ తర్వాత మూడో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన మహిళలు: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమని విశాఖ మహిళలు ధ్వజమెత్తారు. కృష్ణంరాజుని అరెస్టు చేసి, సాక్షి ఛానల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హోంమంత్రి అనిత, విశాఖ సీపీ శంఖబ్రాత బాగ్చికి వినతిపత్రం అందజేశారు. అనకాపల్లి జిల్లా కొత్తకోట మాజీ సర్పంచ్ నీలవేణి ఇతర మహిళలతో కలిసి వచ్చి పోలీస్ స్టేషన్‌లో కృష్ణంరాజు, సాక్షి ఛానల్‌పై ఫిర్యాదు చేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్: విజయనగరం జిల్లా రాజాంలో మహిళలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐకి ఫిర్యాదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజధాని అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక జగన్ పక్షం అమరావతి మహిళలను అవమానించిందని బాపట్ల జిల్లా ఇంకొల్లులో టీడీపీ మహిళలు మండిపడ్డారు. కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు తెలుగు మహిళలు కదం తొక్కారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు ర్యాలీ నిర్వహించారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌లో సాక్షి ఛానల్‌పై ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో తెలుగు మహిళలు ఆందోళన నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు మహిళలు తీవ్ర నిరసన తెలిపారు. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు చిత్ర పటాలను చెప్పులతో కొడుతూ ఆందోళన చేశారు. అనంతరం చిత్ర పటాలను దహనం చేశారు.
''రాజధాని అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక జగన్ పక్షం అమరావతి మహిళలను అవమానిస్తున్నారు.అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమని చర్య. అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలి. సాక్షి జర్నలిస్టు కృష్ణంరాజును అరెస్టు చేయాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా సాక్షి ఛానల్‌పై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం''-మహిళలు
'సాక్షి' ఛానల్ జర్నలిస్ట్‌పై కేసు నమోదు చేయాలి - డీజీపీకి రఘురామ రాజు లేఖ