ETV Bharat / state

మూణ్నాళ్ల ముచ్చటగా ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ - కట్నం కోసం చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరణ

కట్నం కోసం భార్యకు తీవ్ర చిత్రహింసల చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరణ - యువకుడి ఇంటిముందు కుటుంబసభ్యులు ఆందోళన

Woman_Dies_Suspiciously
Woman_Dies_Suspiciously (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 17, 2025 at 11:08 AM IST

2 Min Read
Choose ETV Bharat

Woman from Warangal Dies Suspiciously in Guntur: ఇన్‌స్టాగ్రామ్​ రీల్స్‌లో ఆ యువతిని చూశాడు. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులను ఎదిరించి మరీ వచ్చిన భార్యను 6 నెలలు తిరగకుండానే కట్నం కోసం చిత్ర హింసలు పెట్టి హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన ఆదివారం (16/03/2025) వెలుగు చూసింది.

గుంటూరు జిల్లా నల్లపాడు ఎస్సై నాగరాజు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన గీతిక (19) ఇస్టాగ్రామ్​లో రీల్స్‌ చేస్తుంటుంది. ఆమెకు గుంటూరు ద్వారకానగర్‌ ఏడో లైన్‌కు చెందిన సాయి మణికంఠకు పరిచయం ఏర్పడింది. అతడు పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అతడి మాటలు నమ్మిన గీతిక తల్లిదండ్రులకు తెలియకుండా గతేడాది సెప్టెంబర్‌ 17 గుంటూరులో సాయి మణికంఠను వివాహం చేసుకుంది.

అప్పటి నుంచి అత్తింటిలోనే ఉంటోంది. కొంత కాలం బాగానే కాపురం చేసిన సాయి మణికంఠ గంజాయికి బానిసై భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. కట్నం తీసుకురావాలని తరచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న గీతిక తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని చెప్పింది. అదే రోజు రాత్రి నుంచి ఆమె ఫోన్ పని చేయలేదు.

బిడ్డా నువ్వు లేని ఈ లోకంలో నేనుండలేను - నీ వెంటే నేనూ

ఆందోళనకు దిగిన కుటుంబసభ్యులు: ఈ క్రమంలో మీ కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఈ నెల 15న సాయిమణికంఠ తండ్రి యువతి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు గుంటూరు చేరుకుని గీతికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, కారకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని 6 నెలలకే కుమార్తెను హతమార్చాడని గీతిక తల్లిదండ్రులు బోరున విలపించారు.

సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులకు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. సౌత్‌ డీఎస్పీ భానోదయ, వెస్ట్‌ తహసీల్దారు వెంకటేశ్వరరావు, ఎస్సై నాగరాజు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వరంగల్‌ తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తండ్రి జగదీశ్వరచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్న హత్య కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.

ఒక హత్య, ఆరు మరణాలు - ఆరేళ్లయినా అంతుచిక్కని మిస్టరీగా వివేకా హత్య కేసు!

పిల్లలు పోటీ పడలేక పోతున్నారని - కాళ్లూ చేతులూ కట్టేసి, తలలు బకెట్లలో ముంచేసి!