Wine Shops Closed in Hyderabad : హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైన్స్ అన్ని మూసివేయాలని నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 06 గంటల వరకు మూసివేయాలని తెలిపారు. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్‌లు కూడా మూసివేయాలన్నారు.
జంటనగరాల్లో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని అందరూ సహకరించాలని కోరారు. ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య హనుమాన్ జయంతి జరుపుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులను మూసేశారు.
రాష్ట్రానికి కొత్త మద్యం బ్రాండ్లు : మరోవైపు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యానికి జారీ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ ప్రకటనతో మద్యం సరఫరాదార్లు, తయారీ దార్లు మధ్య పోటాపోటీ నెలకొని దరఖాస్తులు అధికంగా వచ్చాయి. తాము 604 రకాల మద్యం బ్రాండ్లను సరఫరా చేస్తామంటూ 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ 604 బ్రాండ్లలో 331 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొత్త బ్రాండ్లు కాగా, 273 ఫారిన్ బ్రాండ్లు ఉన్నాయి.
47 కొత్త కంపెనీల నుంచి 386 బ్రాండ్ల సరఫరా కోసం, 45 పాత కంపెనీల నుంచి 218 బ్రాండ్ల సరఫరా కోసం మద్యం దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా మద్యం సరఫరాలో ఆరు కంపెనీలే చేస్తున్నాయి. వీటిలో ఒకటిరెండు కంపెనీలదే సింహభాగం కావడం విశేషం.
ముగిసిన దరఖాస్తుల గడువు : రాష్ట్రంలో మద్యం సరఫరాలో కంపెనీల ఏకఛత్రాధిపత్యం ఉండకుండా ఉండేందుకు కొత్త కంపెనీలను మద్యం సరఫరాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ ప్రయత్నిస్తోంది. ఇందుకు తొలుత ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ ఇవ్వగా మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇచ్చారు. కానీ పలు కంపెనీలు గడువు పెంచాలని టీజీబీసీఎల్ ఎండీ హరికిరణ్కు విజ్ఞప్తి చేయగా ఆయన ఏప్రిల్ 2 వరకు సమయం పొడిగించారు. ప్రస్తుతం ఈ సమయం కూడా ముగిసింది.
మందుబాబులు చిందేసే వార్త - కొత్త 'బ్రాండ్లు' వచ్చేస్తున్నాయ్!
మందుబాబులకు అలర్ట్ : మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్ - మళ్లీ ఓపెన్ అప్పుడే!