Vitamin D Deficiency : ప్రస్తుతం చిన్నాపెద్దా అంతా ఆధునిక జీవితానికి అలవాటు పడిపోయారు. ఉదయం పొద్దుపోయాక లేవడం ఆ తర్వాత ఇంట్లోనే ఉంటూ మళ్లీ రాత్రికి తినేసి పడుకోవడం ఇలా ఇదే మానవుడి జీవితంలో అలవాటుగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లిన బైకులు, కార్లు.. రూంలో ఉంటే ఏసీలు, అసలు వెలుతురు లేమి రూమ్‌లలో ఉండటం అంటే ఎంతో ఇష్టంగా ఫీల్ అవుతారు. అందుకే నగరవాసులను విటమిన్ డి లోపం భయపెట్టేలా చేస్తోంది. ఈ విటమిన్-డి లోపం ఏకంగా 82 శాతం మందిలో ఉన్నట్లు పరీక్షలో తేలింది.
సికింద్రాబాద్, డీఆర్డీఓ, హైదర్‌గూడ, జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోని అపోలో ఆసుపత్రి క్లినిక్‌లకు వచ్చే రోగులను పరీక్షించగా ఈ విటమిన్ లోపంతో ఎంతో మంది బాధపడుతున్నట్లు తేలింది. ఆ వివరాలను అపోలో ఆసుపత్రి వెల్లడించింది. మొత్తం 17,321 మందికి పరీక్షలు చేయగా ఏకంగా 14,238 మందిలో విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తించారు. కండరాలు, ఎముకల ఆరోగ్యానికి ఇది కీలకమని నిపుణులు అంటున్నారు.
విటమిన్-డి ఉపయోగాలు, నష్టాలు :
- సూర్యరశ్మి ద్వారా ఈ విటమిన్ శరీరంలోకి చేరుతుంది.
- ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలకు పరిమితం కావడంతో శరీరానికి విటమిన్ లోపిస్తోంది.
- జంక్ఫుడ్స్, సరైన ఆహారపు అలవాట్లు లేక విటమిన్ శరీరానికి చేరడం లేదు.
- పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధికి, పెద్దల్లో బోలు ఎముకల వ్యాధికి, మానసిక స్థితిలో మార్పులు, కుంగుబాటు, ఇతర మానసిక రుగ్మతలకూ విటమిన్ డి కారణం.
- ఊబకాయం, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు ఉన్నవారిలో విటమిన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి.
- బరువు తగ్గేందుకు శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిలో కూడా విటమిన్-డf లోపిస్తుంది.
- విటమిన్ సరిపడా ఉంటే గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు నుంచి రక్షించడమే కాకుండా ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
- కాల్షియం, ఫాస్పేట్ నియంత్రణలో సహాయపడుతుంది.
విటమిన్ - డీ లోపం రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి :
- వయసు పెరిగేకొద్దీ శరీరానికి ఈ విటమిన్‌ను తయారు చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారికి ఈ విటమిన్ - డి లోపం ఉండొచ్చు. అందుకే అందరూ రోజూ కాసేపు ఎండలో గడిపితే విటమిన్ లోపం ఉండదు.
- కాళ్లు, చేతులు పూర్తిగా వస్త్రాలతో కప్పుకోకుండా సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. ఇలా చేస్తే విటమిన్-డీని వేగంగా గ్రహించవచ్చు.
- విటమిన్ లోపం ఉన్నట్లు తేలితే వైద్యుల సూచనల మేరకు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.
- రోజుల తరబడి ఇంటికే పరిమితం కాకుండా బయటకు వెళితే మంచిది.
- పిల్లలను కూడా నిత్యం ఉదయం ఎండలో కాసేపు ఆడుకునేలా ప్రోత్సహిస్తే విటమిన్ లోపం నుంచి బయటపడేయొచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- ఒమేగా-3 ఫ్యాట్స్ ఉండే చేపలు, సోయాపాలు, గుడ్డు సొన, పుట్టగొడుగులు వంటి వాటిల్లో విటమిన్ - డి కొంత వరకు ఉంటుంది. వీటిని ఆహారంతో పాటు తరచుగా తీసుకుంటే విటమిన్ లోపం తగ్గుతుంది.
సూర్యు'D'ని స్వీకరించు - పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించు
మందులు వేయకుండానే విటమిన్ D - ఇది లోపిస్తే ఎన్నో సమస్యలు వస్తాయట జాగ్రత్త!