Mother Milk Best Protection For Baby : పుట్టిన పసిబిడ్డకు తల్లిపాలు నోటికి అందితేనే ప్రాణం పుంజుకుంటుంది. కానీ కొందరు తల్లులు వివిధ కారణాలరీత్యా బిడ్డకు చనుబాలు ఇవ్వలేరు. అలాంటి పరిస్థితి నుంచి తల్లులను సొంత బిడ్డలకు పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించే లక్ష్యంతో ధాత్రి మథర్ మిల్క్‌బ్యాంక్‌ను ప్రారంభించారు. 2017లో మొదలైన ఆ సంస్థ ప్రభుత్వ భాగస్వామ్యంతో తొలిసారిగా హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో 'మథర్ మిల్క్ బ్యాంక్' ఏర్పాటుచేసింది.
అనంతరం గాంధీ, సహా పలు ఆస్పత్రుల్లో మిల్క్‌బ్యాంకులను ఏర్పాటు చేసింది. ప్రసవం తర్వాత అనారోగ్య కారణాల రీత్యా కొందరు తల్లులు బిడ్డకు పాలిచ్చే వీలుండదు. అలాంటి వారి కోసం ఆ తల్లిపాల బ్యాంకులు కీలకంగా మారాయి. తల్లిపాల విశిష్టతను వివరిస్తూ ప్రభుత్వం ఏటా ఆగస్టు 1 నుంచి 7వరకూ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తోంది.
తల్లిపాలే బిడ్డకు అతిముఖ్యం : తొమ్మిది నెలలు గర్భంలో శిశువుని మోసి పురుటినొప్పులని భరించి ఓబిడ్డకు జన్మనిస్తుంది తల్లి. బిడ్డ బోసినవ్వులు చూసి తన కష్టమంతా క్షణంలో మర్చిపోతుంది. తన రక్తాన్నే పాలుగా మార్చి చనుబాలు అందిస్తుంది. ఆ బిడ్డ నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. పుట్టినబిడ్డకు గంటలోపే తల్లిపాలు పట్టించటం ద్వారా అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్లతో పాటు ఇన్ ఫెక్షన్లు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రతి తల్లి తప్పకుండా తన పిల్లలకు కనీసం ఆరునెలల పాటు తల్లిపాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.
మిల్క్‌బ్యాంకుల ద్వారా బిడ్డల ఆకలి తీరుస్తూ : తల్లుల అనారోగ్యం సహా ఎన్నో కారణాలతో పసికందులు తల్లిపాలకు దూరం అవుతున్నారు. అలాంటి వారికి అమ్మపాల అమృతాన్ని పంచుతోంది ధాత్రీ తల్లిపాల నిధి. ప్రసవం తర్వాత కొందరు తల్లుల్లో పాలు ఉత్పత్తి కావు. మరికొందరిలో అధికంగా ఉత్పత్తి అవుతుంటాయి. అలాంటి వారి నుంచి పాలను సేకరించి మిల్క్‌బ్యాంకుల ద్వారా మరో బిడ్డ ఆకలి తీరుస్తోంది.
ముందుగా తల్లి నుంచి పాలను సేకరించి ఆ పాలలో బ్యాక్టీరియా, వైరస్ ఉన్నాయా? అని తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వాటిని వేడి చేసి తిరిగి నాలుగు డిగ్రీల వద్ద చల్లార్చి భద్రపరుస్తారు. వైద్యుల సలహా మేరకు అవసరమైన వారికి అందిస్తారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యకరమైన తల్లులకు తమ పాలు దానంగా ఇవ్వాలని ఉన్నా కుటుంబం అంగీకరించకపోవచ్చు. కుటుంబం ప్రోత్సహిస్తే ఎందరో శిశువులకు మేలు జరుగుతుందని ధాత్రి మథర్ మిల్క్ బ్యాంక్ చెబుతోంది.
అమృతం తల్లి పాల కేంద్రం ఉండగా.. తల్లి పాలకు చింత ఏలా..
World Breastfeeding Week: అప్పుడే పుట్టిన బిడ్డకు అమృత ఘడియలవి!