Uses of Black Box in Plane Crashes: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి కారణాలపై మథనం మొదలైంది. బ్లాక్‌బాక్స్‌లో ఏ సమాచారం నిక్షిప్తమైంది. అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది. బ్లాక్‌బాక్స్ ఈ ప్రమాదానికి గల కారణాల గుట్టు విప్పుతుందా, లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇంతకీ బ్లాక్‌బాక్స్ ఏం చేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం.
దర్యాప్తు బృందాలు దృష్టి: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఏఐ-171 ఎయిర్ ఇండియా విమానం రన్‌వే వదిలిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో పైలట్ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా "మేడే" అనే పదాన్ని 3 సార్లు చెప్పినట్లు పౌరవిమానయానశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. మైడెర్ అనే ఫ్రెంచి పదానికి అర్ధం 'సాయం చేయండి అని'. పైలెట్ల నుంచి మేడే అనే ఒక్క సంకేతమే వచ్చిందా లేక ఇంకేదైనా సంభాషణ జరిగిందా అనే విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. ఇవన్నీ నిక్షిప్తమయ్యే బ్లాక్‌బాక్స్‌పైనా చర్చ కేంద్రీకృతమైంది. రెస్క్యూ పూర్తైన వెంటనే బ్లాక్‌బాక్స్‌ను వెలికితీసి డీజీసీఏ లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఐబీ ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ మెమొరీ డేటా డీకోడ్ చేస్తారు. ఆడియో, డేటాను తీస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది.
బ్లాక్ బాక్స్ ద్వారానే వెలుగులోకి: విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్. దీని వల్లనే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తోంది. విచారణ అధికారులూ ఈ బ్లాక్ బాక్స్‌పైనే ఆధారపడుతుంటారు. బ్లాక్ బాక్స్ అనేది ఇప్పటికే ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను బయటపెట్టింది. దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విమానం ప్రమాదానికి గురైందంటే అందుకు సంబంధించిన కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారానే వెలుగుచూస్తాయి. ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిత తర్వాత నుంచి ప్రతి విషయం కూడా ఈ బ్లాక్ బాక్స్‌లో రికార్డు అవుతుంది. ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ ఎప్పటికప్పుడు ఇందులో రికార్డు అవుతుంటాయి.
గుర్తుపట్టేలా సులభంగా: ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు. సాధారణంగా విమాన ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగిన అన్ని కాలి బూడిదవుతుంటాయి. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్‌ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే బ్లాక్ బాక్స్‌కు ఆరెంజ్ కలర్ ఉంటుందని ఏవియేషన్ అధికారులు చెప్తున్నారు. ఈ బాక్స్ విమానం వెనక భాగంలో అమరుస్తారు. ప్రతికూల వాతావరణంలో కూడా ఈ బ్లాక్ బాక్స్ దృఢంగా ఉండేలా రూపొందిస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా తొలగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే దీనిని డిజైన్ చేస్తారు. ఒక వేళ రాడర్ సిగ్నల్స్ అందని సమయంలో కూడా బ్లాక్ బాక్స్ పని చేస్తూనే ఉంటుంది.
ఇందులో 2 కీలక పరికరాలు: విమానం ప్రమాద సమయంలో అందులో ఉండే పైలట్, ఇతర ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు, పైలట్ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి సహాయం కోరారు వంటి విషయాలు ఇందులో నమోదు అవుతాయి. విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనక భాగం పెద్దగా ధ్వంసం కాదు అందుకే బ్లాక్ బాక్స్‌ను అక్కడ పెడతారు. విమానంలో అమర్చే ఈ బ్లాక్ బాక్స్‌లో 2 కీలక పరికరాలుంటాయి. ఒకటి ఫ్లయిడ్ డేటా రికార్డ్ (ఎఫ్‌డీఆర్), మరొకటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్). ఫ్లయిడ్ డేటా రికార్డర్‌లో విమానానికి చెందిన పూర్తి వివరాలు నమోదవుతాయి. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఎంత ఇంధనం ఉంది, ఇంజిన్‌కు సంబంధించిన విషయాలు పారామీటర్ల సమాచారం, విమాన కదలికలను ఎప్పటికప్పుడు రికార్డు చేసి ఉంచుతుంది.
ఏం జరిగిందనేది కీలకం: విమాన పైలట్ ల్యాండింగ్ గేర్ ఎప్పుడు వేశారు లేక గేర్ వేయడంలో ఏమైనా జాప్యం జరిగిందా అనే విషయాలు తెలుస్తాయి. ఇక కాక్‌పిట్ పైలట్ నుంచి ఏటీసీతో మాట్లాడిన అన్ని మాటలు రికార్డు చేస్తుంది. అందుకే ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు అధికారులు దీనినే ఆధారంగా తీసుకుంటారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా వివరాలు తెలుసుకున్నా పూర్తి దర్యాప్తు కోసం బ్లాక్‌బాక్స్‌ను ఆధారంగా చేసుకుంటారు. ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఏం జరిగిందనేది కీలకం. ప్రమాదం జరిగే సమయంలో పైలట్ ఏటీసీకి ఏమైనా తెలిపారా లేదా అనే విషయాలు రికార్డు అవుతాయి. బ్లాక్‌బాక్స్ 13 గంటల పాటు నిడివి విమానంలో ఉన్న డేటాను రికార్డు చేస్తుంది.
1960లో రూపకల్పన: ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్ వారెన్ 1960లో తొలుత దీన్ని రూపొందించారు. బ్లాక్ బాక్స్‌లోని రికార్డింగ్ టేపులు దెబ్బతినకుండా లేదా కాలిపోకుండా బాక్స్ కవర్ చాలా బలంగా ఉంటుంది. ఇది 1000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఒక గంటసేపు సురక్షితంగా ఉంటుంది. విమానం సముద్రంలో కూలినా దానిని గుర్తించడానికి ఈ బ్లాక్ బాక్స్ సిగ్నల్ ఇస్తుంది. టెస్టింగ్ దశలోనే బ్లాక్ బాక్స్‌ను గంటకు 750 కి.మీ. వేగంతో కాంక్రీట్ గోడకు ఢీ కొట్టిస్తారు. 2.5 టన్నుల బరువును 5 నిమిషాల పాటు బాక్స్ మీద ఉంచుతారు. ప్రమాదం తరువాత టెక్నికల్, ఆపరేషన్ బృందాలు బ్లాక్‌బాక్స్‌లో నమోదైన విషయాలను అధ్యయనం చేస్తాయి. 1960లో ఆస్ట్రేలియాలో ఓ విమానానికి మొట్టమొదటి సారిగా ఈ బ్లాక్‌బాక్స్ బిగించారు. ఈ క్రమంలో భారత్ 2005 నుంచి విమానాల్లో బ్లాక్‌బాక్స్‌లు ఉండటం తప్పనిసరి చేసింది.
అత్యంత ఘోర విమాన ప్రమాదాలివే- ఎంతో మందిని బలిగొన్న దుర్ఘటనలు