ETV Bharat / state

ఒక హత్య, ఆరు మరణాలు - ఆరేళ్లయినా అంతుచిక్కని మిస్టరీగా వివేకా హత్య కేసు!

అసలు కుట్రధారులు, సూత్రధారులను నిర్థారించడంలో మీనమేషాలు లెక్కిస్తోన్న సీబీఐ - అనుమానాస్పదస్థితిలో ఒక్కొ‌క్కరుగా మృతి చెందుతున్న సాక్షులు - న్యాయం కోసం వివేకా కుమార్తె సునీత ఒంటరి పోరాటం

What Happening On Viveka Murder Case
What Happening On Viveka Murder Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 15, 2025 at 12:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

What Happening On Viveka Murder Case : రాష్ట్రంలోనే అత్యంత సంచలన సృష్టించిన మాజీమంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు ఆరేళ్లయినా అతీగతీ తేలలేదు. దేశంలోనే అత్యుత్తమ దర్యాప్తు సంస్థ సీబీఐ సైతం ఇప్పటికీ అసలు కుట్రధారులు, సూత్రధారులను నిర్థరించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఆరేళ్లవుతున్నా ఇప్పటికీ నాంపల్లి సీబీఐ కోర్టులో కేసు విచారణ ప్రారంభమే కాలేదు. ఈ కేసులో నిందితులు ఇప్పటికే బెయిల్‌పై దర్జాగా బయట తిరుగుతుండగా కీలక సాక్షులు మాత్రం ఒక్కొ‌క్కరుగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందుతున్నారు. తండ్రిని చంపిన కిరాతకులకు శిక్షపడేలా చేసేందుకు వివేకా కుమార్తె సునీత గల్లీ నుంచి దిల్లీ వరకు ఒంటరిగా పోరాటం చేస్తోంది.

ఆరేళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున మాజీమంత్రి వివేకానందరెడ్డి పులివెందులలోని ఆయన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. గొడ్డలివేటుతో బాత్‌రూంలో రక్తపుమడుగులో పడి ఉన్న ఆయన్ను చూసిన వైఎస్సార్సీపీ నాయకులు తొలుత గుండెపోటుగా ప్రచారం చేశారు. అయితే హైదరాబాద్‌ నుంచి పులివెందుల చేరుకున్న వివేకా కుమార్తె సునీత తండ్రి మరణంపై అనుమానం ఉందంటూ పోస్టుమార్టానికి పట్టుబట్టడంతో హత్యగా నిర్థారణ అయ్యింది.

వివేకా హత్యకు గురై నేటికి ఆరేళ్లయింది - ఇంకా న్యాయం జరగలేదు : వైఎస్ సునీత

బాబాయి మరణవార్త తెలుసుకుని హుటాహుటిన రావాల్సిన జగన్‌ తీరిగ్గా సాయంత్రం 6 గంటలకు రోడ్డుమార్గంలో హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకోవడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పటికే వివేకాది హత్యగా నిర్థరణయ్యింది. అయితే పోలీసులే ఎవరు చంపారో తేల్చక ముందే అప్పటి సీఎం చంద్రబాబు కుట్రేనంటూ ఆరోపించారు. ఆ తర్వాత సాక్షిపత్రికలో నారాసుర రక్తచరిత్ర అంటూ ప్రచారం చేశారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కావాలంటూ తొలుత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన జగనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపసంహరించుకున్నారు.

వివేకా హత్య కేసు తేల్చేందుకు పోలీసుల ఆధ్వర్యంలో మూడు సిట్‌లు ఏర్పాటు చేసినా కేసులో ఎలాంటి పురోగతి లేదు. దీంతో వివేకా కుమార్తె సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జగన్‌ పిటిషన్ అప్పటికే ఉపసంహరించుకున్నా సునీత పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలంతో ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి హత్యలో పాల్గొన్నట్లు తేల్చింది. వీరందరినీ అరెస్ట్ చేయగా దస్తగిరి నేరాన్ని అంగీకరించి అఫ్రూవర్‌గా మారాడు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో అసలు కుట్రధారులైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డితోపాటు వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.

రంగన్నపై విష ప్రయోగం చేశారా? - రీపోస్టుమార్టం ద్వారా 20 రకాల అవయవాలు సేకరణ

కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సైతం ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా అప్పటి ప్రభుత్వం నుంచి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రస్తుతానికి ఎర్రగంగిరెడ్డి మినహా మిగిలిన నిందితులంతా బెయిల్‌పై బయటకు వచ్చారు. తండ్రి హత్యపై న్యాయపోరాటం చేస్తున్న సునీతపైనా, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పైనా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టడం విశేషం. అవి తప్పుడు కేసులంటూ పులివెందుల పోలీసులు ఈనెల 13న జమ్మలమడుగు కోర్టులో ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఆరేళ్లుగా కేసు నత్తనడకన సాగుతుండటంతో ఆరుగురు కీలక సాక్షులు ఆనుమానాస్పద రీతిలో మృతిచెందారు. నిందితులను కళ్లారా చూసిన ప్రత్యక్షసాక్షి రంగన్న మృతి సైతం అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఆరుగురు సాక్షుల మరణాల వెనక నిజాలు వెలికితీసేందుకు వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆద్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు కేసు విచారణ సీబీఐ కోర్టులో త్వరగా ప్రారంభించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సునీత తెలంగాణ హైకోర్టును ఇటీవలే ఆశ్రయించారు.

వివేకా పీఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసు - తేల్చి చెప్పిన పులివెందుల పోలీసులు