Disadvantages of Late Marriage : 'అరేయ్ మామ. అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి. మరి నువ్వెప్పుడు చేసుకుంటావ్‌రా. మన బ్యాచ్‌లో బ్రహ్మచారిలాగా మిగిలిపోదామని అనుకుంటున్నావా?' అని ఏ ఫ్రెండో అడిగినా, 'ఏరా నీ పెళ్లెప్పుడు, నీతో పాటు ఉన్న వాళ్లు అందరు పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలను కంటున్నారు. నువ్వు మాత్రం ఇంకా అలాగే ఉన్నావ్.' అని ఏ బంధువులు ప్రశ్నించినా అటు నుంచి వచ్చే సమాధానం 'నేను ఇంకా జీవితంలో స్థిర పడలేదు. పెళ్లికి ఇప్పుడే తొందర ఏముంది? నన్ను నేను పోషించుకోవడమే కష్టంగా ఉందంటే, మళ్లీ పెళ్లీపిల్లలు అంటే వాళ్లను ఎలా పోషించేది.' అంటూ సవాలక్ష కారణాలు చెబుతున్నారు. ఇలా 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని మొండి ఘటాలు ఈ ఆధునిక ప్రపంచంలో ఎందరో ఉన్నారు. అయితే లేట్‌గా పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు, సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
యువతకు పెళ్లిపై ఆసక్తి లేకపోవడానికి గల కారణాలు :
- మంచి ఉద్యోగం రాకపోవడం
- కోరుకున్న తోడు దొరకకపోవడం
- జీవితంలో ఇంకా స్థిర పడకపోవడం
- పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ దూరం అవుతుందనే భయం
- కుటుంబ బాధ్యతలు నెత్తి మీద పడతాయనే భయం
- పిల్లలు పుడతారు, వారి బాధ్యత ఎలా అనే భయం
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే కలిగే నష్టాలు :
- ఎక్కువ కాలం ఒంటరిగా జీవించడంతో జీవిత భాగస్వామితో ఇమడలేకపోవడం
- సర్దుబాటు కాలేక భార్యాభర్తల మధ్య గొడవలు, వాగ్వాదాలు
- 30 ఏళ్లు దాటిన మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది
- దాంపత్య జీవితంలో అవాంతరాలు, మానసిక, శారీరక అనారోగ్యం వంటివి దరి చేరడం.
- 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే దొరికిన వారితో సంతృప్తి చెందాల్సి వస్తుంది.
- అసలైన దాంపత్యపు మాధుర్యాన్ని అనుభవించలేక వివాహం చేసుకున్నాం కాబట్టి సంసారం చేస్తున్నాం అనే ధోరణిలో ఉండిపోవడం
సరైన వయసు శ్రేయస్కరం : వివాహానికి సరైన వయసు శ్రేయస్కరమని స్త్రీల వైద్య నిపుణురాలు (మిర్యాలగూడ) డాక్టర్ జీవనజ్యోతి తెలిపారు. వయసు తక్కువైనా, ఎక్కువైనా సంసారం జీవితంలో అనేక అనర్థాలు చవి చూడాల్సి వస్తుందని అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది 30 ఏళ్లు దాటిన తర్వాత వివాహం చేసుకోవడం, ఆ తర్వాత జీవితాన్ని ఆస్వాదించాలనే సాకుతో మరి కొన్నేళ్లు సాగదీయడం వంటివి చేస్తున్నారు. ఆ తర్వాత వారు సంతానం కోసం ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. సాధారణంగా 30 ఏళ్లు దాటిన తర్వాత సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుందని వెల్లడించారు. మహిళల్లో అనేక సమస్యలు వెలుగు చూస్తాయన్నారు. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తేనే మాతృత్వపు మమకారాన్ని చవి చూస్తామని వివరించారు.
'3 అడుగుల' సూపర్ జోడీ- కట్న, కానుకలు లేకుండా పెళ్లి- ఎవరైనా వాళ్లని తలవంచి చూడాల్సిందే!
పెరిగిపోతున్న 'పెళ్లికాని ప్రసాదు'ల సంఖ్య - అమ్మాయిల ఆ కోరికలే కారణమా?